ఒటావా: చైనా టెలికం దిగ్గజం హువావే వ్యవస్థాపకుడు కుమార్తె, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) మెంగ్ వాంఝూను కెనడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు కొనసాగించడం ద్వారా హువావే నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలే ఇందుకు కారణమని తెలియవచ్చింది. మెంగ్ వాంఝూను అప్పగించాల్సిందిగా అమెరికా కోరుతోందని, ఆమె బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుందని కెనడా న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హువావేతో దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్న అమెరికా... ఇప్పటికే ఇరాన్ మీద ఆంక్షలను ఉల్లంఘిస్తున్న అంశంపై హువావే మీద విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశ భద్రతకు ముప్పు తెచ్చి పెట్టే విధంగా చైనా వ్యవహరిస్తోందని, దీన్ని తాము చూస్తూ కూర్చోబోమని అమెరికా సెనేటర్ బెన్ సాసీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. తద్వారా వాంఝూ అరెస్ట్ వెనుక ఇరాన్ కోణం ఉన్నట్లు పరోక్షంగా చెప్పినట్లయింది.
అటు ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్‌తో పాటు అమెరికా చట్టాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని, ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని హువావే పేర్కొంది. ఈ మధ్యే వాణిజ్య యుద్ధాలపై తాత్కాలిక సంధి కుదుర్చుకున్న చైనా, అమెరికా మధ్య ఈ పరిణామంతో మరోసారి అగ్గి రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా, చైనాల మధ్య తాత్కాలిక సంధి కుదిరిన రోజు డిసెంబర్ 1వ తేదీ నాడే వాంఝూను కెనడాలో అరెస్ట్ చేశారు. మెంగ్‌ను తక్షణం విడుదల చేయాలంటూ కెనడాలోని చైనా దౌత్య కార్యాలయం డిమాండ్ చేసింది.
సంధి చర్యలు సత్వరం అమలుపై చైనా దృష్టి..
అమెరికాతో కుదుర్చుకున్న తాత్కాలిక సంధి చర్యలను సత్వరం అమలు చేయనున్నట్లు చైనా వెల్లడించింది. నిర్దేశిత 90 రోజుల్లోగా డీల్ కుదుర్చుకోగలమని ధీమా వ్యక్తం చేసింది. సుంకాలపరమైన పోరుతో వాణిజ్య యుద్ధానికి దారి తీసిన వివాదాల పరిష్కారానికి ఇరు దేశాలు 90 రోజుల గడువు విధించుకున్న సంగతి తెలిసిందే. సంధి ఒప్పందం ప్రకారం గడువు తీరేదాకా 200 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై సుంకాలను 25 శాతానికి పెంచకుండా 10% స్థాయిలోనే అమెరికా కొనసాగించనుంది. అటు చైనా తన వంతుగా అమెరికాతో వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు మరి న్ని అమెరికన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోనుంది.
కెనడాలో హువావే సీఎఫ్‌వో అరెస్ట్
Published Fri, Dec 7 2018 3:58 AM | Last Updated on Fri, Dec 7 2018 3:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment