సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్‌కు పాన్ తప్పనిసరి
న్యూఢిల్లీ: వ్యాపార లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో ఎటువంటి ఆర్థిక అవకతవకలకూ వీలులేకుండా తగిన చర్యలు తీసుకునే దిశలో కేంద్రం మరో ముందడుగు వేసింది. సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్‌ను కోరుకునే ప్రైవేటు సంస్థలకు సంబంధిత యజమాని లేదా చట్టబద్ధమైన సంస్థ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్)ను తప్పనిసరి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అప్లికెంట్ తన ఈ మెయిల్ అడ్రస్‌ను, మొబైల్ నంబర్‌ను కూడా అప్లికేషన్‌లో తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించిన రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా తమ ఆన్‌లైన్ అప్లికేషన్లలో ప్రభుత్వ శాఖలు పాన్‌ను తెలపనక్కర్లేదని ప్రకటన పేర్కొంది. దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులపై విధించిన ఎక్సైజ్ సుంకం చెల్లింపునకు సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీనివల్ల అసెస్సీ ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపే వీలుంటుంది.