రుణాల చెల్లింపులు ఆలస్యమైతే స్కోర్‌పై ప్రభావం
భవిష్యత్‌లో రుణాలు తీసుకోవాలంటే ఇబ్బందులే
లోన్ యాప్‌ల ఉచ్చులో యువత
ఇష్టారాజ్యంగా నగదు తీసుకుంటున్న వైనం
సకాలంలో చెల్లించకపోతే సిబిల్ స్కోర్ ఢమాల్
నెల్లూరు నగరానికి చెందిన కిశోర్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వివిధ వస్తువుల కొనుగోలు కోసం అతను ఆన్‌లైన్ యాప్‌లో రూ.20 వేలు రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించలేకపోయాడు. యాప్ నిర్వాహకులు చాలా వడ్డీ వేశారు. దీనికితోడు సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయింది.
నెల్లూరులో నివాసం ఉంటున్న సంతోష్ ఓ షోరూంలో ఏడునెలల క్రితం ఏసీ కొన్నాడు. ఐదునెలలపాటు ఈఎంఐలు సమయానికి చెల్లించాడు. వివిధ కారణాలతో ఆ తర్వాత కట్టలేకపోయాడు. దీంతో రూ.750 అపరాధ రుసుము చెల్లించాలని బ్యాంక్ వారు పేర్కొన్నారు. అదనపు చెల్లింపుల భారంతోపాటు సిబిల్ స్కోర్ సైతం తగ్గిపోయింది.
నెల్లూరు సిటీ: కాలం మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతోంది. దీంతో జీవనశైలిలో అనేక మార్పులొచ్చాయి. నాడు ఎంతో నెమ్మదిగా జరిగిన పనులు నేడు నిమిషాల్లోనే అయిపోతున్న పరిస్థితి. ఒకప్పుడు బ్యాంక్ రుణం కావాలంటే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. పొలం, ఇళ్ల డాక్యుమెంట్లు ఉన్నా డబ్బు ఇచ్చేందుకు బ్యాంక్‌లు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవి. నేడు స్మార్ట్ ఫోన్లోని యాప్ నుంచి రూ.5వేల నుంచి రూ.లక్షల్లో రుణాలు పొందొచ్చు. ఇక్కడే ఒక మెలిక ఉంది. అదే సిబిల్ క్రెడిట్ స్కోర్. డబ్బు కావాలంటే ఇది చాలా కీలకం. దీని ఆధారంగా ఇప్పుడు బ్యాంక్‌లు, ఆన్‌లైన్ యాప్‌లు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్కోర్‌ను 750 కంటే తగ్గకుండా చూసుకోవాల్సి బాధ్యత ఏర్పడింది.
ఈఎంఐల్లోనే..
నేడు బ్యాంక్‌లు ఈఎంఐల పద్ధతిలో రుణ సౌకర్యం కల్పించాయి. చేతికి పెట్టుకునే వాచ్ నుంచి సెల్‌ఫోన్, కారు, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఇళ్లు కొనుగోలుకు నెల వాయిదాల విధానంలో రుణాలు తీసుకుంటున్నారు. చిన్నచిన్న వస్తువుల కోసం ఈ–కామర్స్ యాప్‌లో క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈఎంఐలు పెడుతున్నారు. అయితే కొందరు నిర్దేశిత తేదీల్లోగా ఈఎంఐ చెల్లించకపోతున్నారు. దీంతో భారీగా ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తోంది. లోన్ యాప్‌లు, ఒక్కోసారి కొన్ని బ్యాంక్‌ల ప్రతినిధుల బెదిరింపులూ తప్పడం లేదు.
సులువుగా..
యాప్‌లు వచ్చిన నాటి నుంచి రుణం తీసుకోవడం సులభంగా మారిపోయింది. కేవలం పాన్‌కార్డు నంబర్ ఉంటే చాలు. సంబంధిత వెబ్‌సైట్ లేదా యాప్‌లో నమోదు చేయగానే కొద్ది నిమిషాల్లోనే రుణం వచ్చేది, రానిదీ తెలిసిపోతుంది. అలాగే వివిధ ఎలక్ట్రానిక్ దుకాణాలు, షాపుల్లోనూ పాన్‌కార్డు నంబర్‌ను నమోదు చేసి వెంటనే ఎంతవరకు రుణం వస్తుందో చెబుతున్నారు. దీంతో తమకు అవసరమున్నా, లేకున్నా చాలామంది ఎల్రక్టానిక్స్ వస్తువులపై ఆసక్తి చూపుతున్నారు. జీరో వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు లేదంటూ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు చెప్పే మాటలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ఏ ప్రయోజనం లేకుండా ఆయా సంస్థలు ఎందుకు ఇలా చేస్తాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. కనీస అవగాహన కూడా లేకుండా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వస్తువులు తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో సిబిల్ స్కోర్ గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల భవిష్యత్‌లో అత్యవసరమైనప్పుడు రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ..
కొత్త కొత్త లోన్ యాప్‌లు పుట్టుకుని రావడంతో యువత, విద్యార్థులు ఆ ఉచ్చులో ఇరుక్కుని పోతున్నారు. సరదాల కోసం రుణం తీసుకోవడం మొదలుపెట్టి, చివరికి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. యాప్‌లలో ఇష్టారాజ్యంగా లోన్లు తీసుకుని బెట్టింగ్‌లు, మద్యంకు బానిసవుతున్నారు. రుణాలు సమయానికి చెల్లించకపోవడంతో నిర్వాహకులు వారిని బ్లాక్‌మెయిల్ చేయడం, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాగా ఉన్నత చదువులకు రుణాలు తీసుకునే సమయంలో సమస్యలు త లెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
సిబిల్‌ను కాపాడుకుంటేనే..
రానున్న రోజుల్లో సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. ఇప్పటికే బ్యాంక్ రుణాలు తీసుకోవాలంటే ఇది కచ్చితంగా బాగుండాలి. రుణ చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే చెక్»ౌన్స్‌తోపాటు సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. భవిష్యత్‌లో తీసుకునే రుణాలపై కూడా ప్రభావం పడుతుంది. బ్యాంక్ రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులు ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి.
– సీహెచ్ వెంకటసందీప్, సీఏ
తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం
పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, రుణాలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా వారి అలవాట్లను నిత్యం గమనిస్తుండాలి. చెడు మార్గంలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– వేణు, సీఐ, నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్
Comments
Please login to add a commentAdd a comment