ఏఎస్ఐ మోహన్రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఏఎస్ఐ మోహన్‌రెడ్డి అక్రమ వడ్డీ వ్యాపారం దందా మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు.. మోహన్‌రెడ్డికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరి వివరాలు సేకరించింది. ఆయనకు తాకట్టు పెట్టిన ఆస్తుల విలువ రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. వాటి క్రయ విక్రయాలు జరుపవద్దని తాజాగా సీఐడీ ఆదేశాలు జారీ చేసింది. వాటి రిజిస్ట్రేషన్‌లను నిలిపివేయాలని అధికారులను కోరింది.
దీంతోపాటు, 2006లో మోహన్‌రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించి ఆస్తుల కేసును తిరగదోడింది. ఇందుకు సంబంధించి 68మంది సాక్షులను కోర్టులో హాజరుపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ఏడాది సీఐడీ నమోదు చేసిన 27 కేసుల్లో మోహన్‌రెడ్డికి సంబంధించినవే నాలుగు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసు శాఖ ఏఎస్పీ నుంచి హోంగార్డు స్థాయి వరకు 12 మందిపై వేటువేసింది. మరో ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మోహన్‌రెడ్డిపై పోలీసులు ఇప్పటికే 20కిపైగా కేసులు నమోదు చేశారు. మరోపక్క, మోహన్ రెడ్డి కేసులో ఆరుగురుని సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ తో జైలుకు తరలించారు.