పట్టు జారుతోంది
పట్టు రైతులకు ప్రోత్సాహకమివ్వని ప్రభుత్వం
12 సంవత్సరాలు గడిచిన అందని వైనం
ఒక్క కోలారు జిల్లాకు రూ. 5.60 కోట్ల బకాయి
కోలారు : పట్టు రైతులకు ప్రోత్సాహక ధనం ప్రకటించిన రాష్ర్ట ప్రభుత్వం ఏడాది గడిచినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఒక్క కోలారు జిల్లాలోని పట్టు రైతులకు రూ. 5.60కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు సమాచారం. కోలారు జిల్లాలో ఐదారు దశాబ్ధాలుగా పట్టుపరిశ్రమపై రైతులు ఆధారపడ్డారు. జిల్లాలోని వాతావరణ పరిస్థితులు పట్టు పరిశ్రమకు అనుకూలంగా ఉండడంతో అధిక శాతం రైతులు దీనిపై ఆధారపడ్డారు.
ఇక్కడ పండించే పట్టులో బైవోల్టిన్, సీఆర్‌ఆర్, కోలార్ గోల్డ్ రకం ప్రఖ్యాతి గాంచాయి. జిల్లాలోని ఐదు తాలూకాల్లో 15,447 హెక్టార్లలో పట్టు పరిశ్రమ విస్తరించి ఉంది. కోలారు తాలూకాలోని 1,531 గ్రామాలలో 22,815 మంది రైతులు పట్టు పురుగులను పెంచుతున్నారు. వీరిలో 1,580 మంది మహిళా రైతులు ఉన్నారు. 2,045 మంది ఎస్సీలు, 879 మంది ఎస్టీలు, 54 మంది వికలాంగులు, 284 మంది మైనారిటీలు పట్టుపరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టుపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా తగ్గించడంతో పట్టు గూళ్ల ధరలు గణనీయంగా పడిపోయి రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. మరో వైపు చైనా పట్టు దిగుమతి అధికం కావడంతో పట్టు రైతు మరింత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దీంతో రైతులను ఆదుకునేందుకు మిశ్రతలి పట్టు కిలో ఒక్కంటికి రూ. పది, బైవోల్టిన్ కిలో ఒక్కంటికి రూ. 30 చొప్పున ప్రోత్సాహకాన్ని 2013లో అప్పటి రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. ఇది రైతులకు కాస్త ఉపశమనం కలిగించింది. గత బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాన్ని పెంచింది.
మిశ్రతలికి రూ. 30, బైవోల్టిన్‌కు రూ. 50 చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపు 2014 ఆగస్టు నుంచి అన్వయం కానుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రోత్సాహకం ఇంకా అందకపోవడం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడలేక పోతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా 11,551 మెట్రిక్ టన్నుల పట్టును ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో 10,974 మెట్రిక్ టన్నులు మిశ్రతళి పట్టు అయితే, బైవోల్టిన్ 577 మెట్రిక్ టన్నులను మాత్రమే ఉత్పత్తి అవుతోంది.
ప్రభుత్వం బకాయి పడిన ప్రోత్సాహకం వివరాలు
తాలూకా పెంపకందార్లు బకాయి (లక్షల్లో)
కోలారు 8163 300.00
బంగారుపేట 3213 150.00
మాలూరు 1907 65.00
ముళబాగిలు 4983 16.00
శ్రీనివాసపురం 4549 35.00
మొత్తం 22815 560.00