సాక్షి, హైదరాబాద్: విద్యుదుత్పత్తి కంపెనీలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన బకాయిల భారం ఏటేటా భారీగా పెరిగిపోతోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రాప్తి పోర్టల్ (https: //praapti.in) ప్రకారం 2019 డిసెంబర్ నాటికి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,860 కోట్లు ఉండగా 2020 డిసెంబర్ నాటికి అవి రూ. 7,101 కోట్లకు ఎగబాకాయి. తెలంగాణ జెన్‌కోతోపాటు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు ఈ జాబితాలో పొందుపర్చలేదు. అవి రెండూ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు కావడంతో డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను కేంద్ర విద్యుత్ శాఖకు తెలియజేయడం లేదు. జెన్‌కో, సింగరేణిలకు చెల్లించాల్సిన బకాయిలు కలిపితే డిస్కంల మొత్తం బకాయిలు రూ. 10 వేల కోట్లకుపైనే ఉండనున్నాయి.
ఖర్చు ఎక్కువ.. ఆదాయం తక్కువ
ఎన్టీపీసీ, జెన్‌కో వంటి ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు పలు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి డిస్కంలు భారీ ఎత్తున విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రంలోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల వ్యయం, పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వంటి అన్ని ఖర్చులు కలిపి విద్యుత్ సరఫరాకు అవుతున్న వాస్తవ వ్యయం (కాస్ట్ ఆఫ్ సర్వీస్)తో పోల్చితే వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్ల ద్వారా పొందుతున్న ఆదాయంలో భారీ వ్యత్యాసం ఉండటంతో డిస్కంలు ప్రతి నెలా రూ. 200 కోట్ల నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.
రాష్ట్రానికి సరఫరా చేస్తున్న ప్రతి యూనిట్ విద్యుత్‌పై 0.93 పైసల చొప్పున డిస్కంలు నష్టపోతున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న ‘ఉదయ్’పోర్టల్ పేర్కొంటోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విద్యుత్ సబ్సిడీలు పూర్తిస్థాయిలోఆదాయ లోటును పూడ్చటంలో విఫలం కావడంతో డిస్కంలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. నష్టాల కారణంగా విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరపలేకపోతున్నాయి. దీంతో క్రమేణ జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి.
గత డిసెంబర్ నాటికి డిస్కంలు వివిధ జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు (రూ. కోట్లలో)
విద్యుదుత్పత్తి కంపెనీ డిస్కంల బకాయిలు
- సీఎల్‌పీఐ 171.73
- ఐటీపీసీఎల్ 9.53
- ఎన్‌ఎల్‌సీఐఎల్ 492.11
- ఎన్‌టీఈసీఎల్ 248.55
- ఎన్టీపీసీ 1,723.97
- ఎన్టీపీఎల్ 418.65
- ఎస్‌ఈఎంబీ 2,532.22
సంప్రదాయ విద్యుత్ బకాయిల మొత్తం: 5,596.76
సంప్రదాయేతర విద్యుత్ బకాయిలు: 1,504.57
మొత్తం బకాయిలు: 7,101
‘కో–ఆర్డినేషన్’కమిటీపై బకాయిల భారం..
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 478.86 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 1,335.16 కోట్లు, తెలంగాణ స్టేట్ పవర్ కో–ఆర్డినేషన్ కమిటీ (టీఎస్‌పీసీసీ) రూ. 5,287.31 కోట్లు కలిపి డిస్కంలు మొత్తం రూ. 7,101.33 కోట్లను విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిపడ్డాయి. అత్యధిక శాతం విద్యుత్ కొనుగోళ్లను టీఎస్‌పీసీసీ ఆధ్వర్యంలో జరుపుతుండటంతో అత్యధిక బకాయిలు సైతం దీని పేరిటే ఉన్నాయి. ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు చైర్మన్‌గా ఉన్న టీఎస్‌పీసీసీ డిస్కంల తరఫున విద్యుత్ కొనుగోళ్లు, జనరేటర్లకు బిల్లుల చెల్లింపుల వంటి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది.
నెలవారీగా జనరేటర్లకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు (రూ. కోట్లలో)
2020 బకాయిలు
- జనవరి 6,153
- ఫిబ్రవరి 6,385
- మార్చి 6,039
- ఏప్రిల్ 6,494
- మే 7,143
- జూన్ 7,443
- జూలై 4,755
- ఆగస్టు 4,872
- సెప్టెంబర్ 5,485
- అక్టోబర్ 6,096
- నవంబర్ 6,655
- డిసెంబర్ 7,101
కేంద్రం మెట్టు దిగితేనే..
విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలకు ఆత్మనిర్భర్ రుణాలను ప్రకటించింది. తెలంగాణ డిస్కంలకు ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రూ. 12,600 కోట్ల రుణాలు మంజూరవగా 50 శాతం రుణాలను తొలి విడత కింద విడుదల చేశారు. రెండో విడత రుణాల విడుదలకు విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదిస్తున్న సంస్కరణల అమలుకు అంగీకరిస్తేనే మిగిలిన రుణాలను విడుదల చేస్తామని కేంద్రం పేర్కొంటోంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణల అమలును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో కేంద్రం మెట్టుదిగి రుణాల విడుదలకు అంగీకరిస్తేనే డిస్కంలు బకాయిల భారం నుంచి బయటపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment