Central Electricity Ministry
-
విద్యుత్ కొరత: మిగులు కరెంట్‌ని అమ్మితే చర్యలు: కేంద్రం
ఢిల్లీ: దేశంలోని వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత వల్ల విద్యుత్ కొరత ఏర్పడనుందని అనేక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యుత్ కొరతపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలు, కొరత ఉన్న రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ స్టేషన్ల వద్ద ఉన్న 15 శాతం అన్ అలకేటెడ్ కోటా నుంచి విద్యుత్ వాడుకోవాలని విన్నవించింది. (చదవండి: విద్యుత్ సంక్షోభం.. జనాలకు ఢిల్లీ ప్రభుత్వం వింత రిక్వెస్ట్) బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది.కొన్ని రాష్ట్రాలు ప్రజలకు విద్యుత్ కోతలు పెడుతూ బయట రాష్ట్రాలకు పవర్ అమ్ముతున్నారు. ఈ క్రమంలో కేంద్రం మిగులు కరెంట్‌ను పవర్ ఎక్స్చేంజిలలో అమ్మితే ఆ రాష్ట్రాల కేటాయింపులు తగ్గించేస్తామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ మంగళవారం రాష్ట్రాలకు లేఖ రాసింది. చదవండి: తెలంగాణలో బొగ్గు కొరత లేదు -
Power Sector: భారీ సంస్కరణలు.. అమ్మకానికి ‘లైన్లు’!
సాక్షి, హైదరాబాద్/అమరావతి: దేశంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలకు రంగం సిద్ధం చేసింది. ‘ఎలక్ట్రిసిటీ (ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్) రూల్స్–2021’ను అమల్లోకి తెచ్చినట్టు కేంద్ర విద్యుత్ శాఖ ఆదివారం ప్రకటించింది. రాష్ట్రాలు తమ అధీనంలోని విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌లను అమ్ముకోవడానికి, ఇతరుల నుంచి కొనుక్కోవడానికి.. పంచుకోవడానికి కూడా దీనితో అవకాశం ఉండనుంది. ఈ వెసులుబాట్లు రాష్ట్రాలతోపాటు విద్యుదుత్పత్తి కంపెనీలకూ వర్తించనున్నాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్ల విక్రయానికి వీలు కల్పిస్తూ కేంద్రం ఇటీవలే మార్గదర్శకాలు ఇచ్చింది. తాజాగా విద్యుత్ సంస్థల యాజమాన్యంలోని ట్రాన్స్మిషన్ లైన్ల విక్రయానికి వీలు కల్పించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక రీజియన్ నుంచి మరో రీజియన్‌కు విద్యుత్ సరఫరాకు సరిపడా ట్రాన్స్మిషన్ వ్యవస్థ లభ్యత ఉండేలా చూడటం కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు కేంద్రం పేర్కొంది. తెరపై కొత్త యాక్సెస్ విధానం విద్యుదుత్పత్తి కంపెనీలు తాము ఉత్పత్తి చేసే కరెంటును అమ్ముకోవడానికి ట్రాన్స్మిషన్ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘పవర్‌గ్రిడ్ కార్పొరేషన్’దేశవ్యాప్తంగా అంతర్రాష్ట ట్రాన్స్మిషన్ నెట్‌వర్క్‌ను నిర్మించి నిర్వహిస్తోంది. ప్రస్తుతం కంపెనీలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను ఆధారంగా చూపి ఈ అంతర్రాష్ట ట్రాన్స్మిషన్ వ్యవస్థను వినియోగించుకోవడం కోసం (లాంగ్ టర్మ్ యాక్సెస్) పవర్‌గ్రిడ్‌కు దరఖాస్తు పెట్టుకుంటున్నాయి. అయితే కేంద్రం తాజాగా లాంగ్‌టర్మ్ యాక్సెస్‌కు బదులు జనరల్ నెట్వర్క్ యాక్సెస్(జీఎన్ఏ) అనే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనితో విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు రాష్ట్రాలు కూడా తమ అవసరాలకు తగ్గట్టు ట్రాన్స్మిషన్ సామర్థ్యాన్ని పొందడం, బదిలీ చేయడం వంటివి చేయొచ్చు. స్వల్ప, మధ్యకాలిక ఒప్పందాలతో విద్యుత్ కొనుగోలుకు వెసులుబాటు కలగనుంది. దీనికోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చూపాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ విధానం ద్వారా ట్రాన్స్మిషన్ వ్యవస్థ నిర్వహణ, చార్జీల వసూళ్లలో హేతుబద్దత వస్తుందని కేంద్రం తెలిపింది. వసూళ్ల బాధ్యతలు పవర్‌గ్రిడ్‌కు.. ట్రాన్స్మిషన్ వ్యవస్థల కోసం జరిగిన ఒప్పందాలన్నీ కొత్త విధానం కింద జీఎన్‌ఏలుగా మారనున్నాయి. అంతేకాదు నెట్‌వర్క్‌ను వినియోగించుకునే వారి నుంచి ట్రాన్స్మిషన్ చార్జీల వసూలు, బిల్లింగ్, కలెక్షన్, పంపిణీ బాధ్యతలన్నీ పవర్‌గ్రిడ్‌కు వెళ్లనున్నాయి. ఒప్పంద సామర్థ్యానికి మించి అధిక విద్యుత్ తీసుకున్నా, సరఫరా చేసినా 25 శాతంచార్జీలను అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. జీఎన్‌ఏల అమలుపై కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనుంది. కొనుగోళ్లలో రోల్‌మోడల్‌గా ఏపీ చౌక విద్యుత్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ఏపీలో విద్యుత్ సంస్థలు అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నాయి. ఒక రోజు ముందే విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని అమలు చేస్తున్నాయి. ఫలితంగా విద్యుత్ కొనుగోలు ఖర్చును తగ్గించగలుగుతున్నాయి. ఈ విషయంలో ఏపీ విద్యుత్ సంస్థలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయి. 2019–20, 2020–21లో ఉత్తమ ప్రమాణాలు పాటించడం, చౌక విద్యుత్ పవర్ ఎక్ఛేంజీల ద్వారా కొనుగోలు చేయడం ద్వారా రూ.2,342 కోట్లు ఆదా చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ రాష్ట్రాన్ని అభినందిస్తూ ఏపీని రోల్ మోడల్‌గా తీసుకుంటామని ప్రకటించాయి. ఈ క్రమంలోనే దేశమంతటా తాజా నిబంధనలను కేంద్రం ప్రకటించింది. ఎందుకీ కొత్త విధానం? ట్రాన్స్మిషన్ వ్యవస్థ కోసం పెట్టిన భారీ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడం, అదే సమయంలో ప్రణాళికాబద్ధంగా ట్రాన్స్మిషన్ వ్యవస్థ నిర్వహణ, అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. దీనివల్ల ట్రాన్స్మిషన్, జనరేషన్ రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అందని ప్రాంతాలు అభివృద్ధికి దూరమవుతాయని, అలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా వ్యవస్థను నిర్వహించడానికి కొత్త నిబంధనలు దోహదపడతాయని తెలిపింది. కొత్తగా నిర్మించే విద్యుత్ ప్లాంట్ల అవసరాలకు తగ్గట్టు ట్రాన్స్మిషన్ వ్యవస్థ అభివృద్ధికి అవకాశం ఉంటుందని, ప్లాంట్లపై పెట్టిన పెట్టుబడులు వృథా కావని పేర్కొంది. -
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపునకు గడువు
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయేతర విద్యుత్తు వినియోగదారులకు ప్రీపెయిడ్ సౌకర్యం ఉండే స్మార్ట్ మీటర్ల ద్వారా మాత్రమే విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొంటూ ఆయా మీటర్ల బిగింపునకు నిర్దిష్ట కాల వ్యవధిని నోటిఫై చేస్తూ కేంద్ర విద్యుత్తు శాఖ గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. 2023 డిసెంబర్ నాటికి గడువు ఉన్న కేటగిరీలు ► 50 శాతం కంటే ఎక్కువగా వినియోగదారులు పట్టణ ప్రాంతాల్లో ఉండి, 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీఅండ్‌సీ) 15 శాతానికంటే మించిన ఎలక్ట్రిక్ డివిజన్లలో పాత మీటర్లలో స్థానంలో కొత్తగా ప్రీపెయిడ్ సౌకర్యం ఉన్న స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► అలాగే 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు 25 శాతం మించిన ఎలక్ట్రికల్ డివిజన్లలో కూడా స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► బ్లాక్ స్థాయి, ఆపైస్థాయి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► స్టేట్ రెగ్యులేటరీ కమిషన్ తగిన కారణాలు చూపి ఈ కాలవ్యవధిని రెండుసార్లు మాత్రమే పొడిగించవచ్చు. ఒక్కో విడత ఆరు నెలల కంటే ఎక్కువగా పొడిగింపు ఉండరాదు. ► ఇతర అన్ని ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లను 2025 మార్చి వరకు అమర్చాలి. ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు ► అన్ని ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ సౌకర్యం ఉన్న మీటర్లుగానీ, అడ్వాన్స్డ్ మీటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతి ఉన్న మీటర్లు గానీ అమర్చుతారు. 2022 డిసెంబర్ నాటికి ఈ మీటర్లను అమర్చాలి. ► 50 శాతం కంటే ఎక్కువగా వినియోగదారులు పట్టణ ప్రాంతాల్లో ఉండి, 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు(ఏటీఅండ్‌సీ) 15 శాతాని కంటే మించిన ఎలక్ట్రిక్ డివిజన్లలోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, 25 శాతానికి మించి నష్టాలు ఉన్న ఇతర అన్ని ఎలక్ట్రికల్ డివిజన్లలో పాత మీటర్లలో స్థానంలో డిసెంబర్ 2023 నాటికి కొత్తగా మీటర్లు అమర్చాలి. ఇతర ప్రాంతాల్లో 2025 మార్చి నాటికి మీటర్లు అమర్చాలి. -
బకాయిల బండ!
సాక్షి, హైదరాబాద్: విద్యుదుత్పత్తి కంపెనీలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన బకాయిల భారం ఏటేటా భారీగా పెరిగిపోతోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రాప్తి పోర్టల్ (https: //praapti.in) ప్రకారం 2019 డిసెంబర్ నాటికి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,860 కోట్లు ఉండగా 2020 డిసెంబర్ నాటికి అవి రూ. 7,101 కోట్లకు ఎగబాకాయి. తెలంగాణ జెన్కోతోపాటు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు ఈ జాబితాలో పొందుపర్చలేదు. అవి రెండూ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు కావడంతో డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను కేంద్ర విద్యుత్ శాఖకు తెలియజేయడం లేదు. జెన్కో, సింగరేణిలకు చెల్లించాల్సిన బకాయిలు కలిపితే డిస్కంల మొత్తం బకాయిలు రూ. 10 వేల కోట్లకుపైనే ఉండనున్నాయి. ఖర్చు ఎక్కువ.. ఆదాయం తక్కువ ఎన్టీపీసీ, జెన్కో వంటి ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు పలు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి డిస్కంలు భారీ ఎత్తున విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రంలోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల వ్యయం, పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వంటి అన్ని ఖర్చులు కలిపి విద్యుత్ సరఫరాకు అవుతున్న వాస్తవ వ్యయం (కాస్ట్ ఆఫ్ సర్వీస్)తో పోల్చితే వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్ల ద్వారా పొందుతున్న ఆదాయంలో భారీ వ్యత్యాసం ఉండటంతో డిస్కంలు ప్రతి నెలా రూ. 200 కోట్ల నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న ప్రతి యూనిట్ విద్యుత్‌పై 0.93 పైసల చొప్పున డిస్కంలు నష్టపోతున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న ‘ఉదయ్’పోర్టల్ పేర్కొంటోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విద్యుత్ సబ్సిడీలు పూర్తిస్థాయిలోఆదాయ లోటును పూడ్చటంలో విఫలం కావడంతో డిస్కంలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. నష్టాల కారణంగా విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరపలేకపోతున్నాయి. దీంతో క్రమేణ జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి. గత డిసెంబర్ నాటికి డిస్కంలు వివిధ జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు (రూ. కోట్లలో) విద్యుదుత్పత్తి కంపెనీ డిస్కంల బకాయిలు సీఎల్పీఐ 171.73 ఐటీపీసీఎల్ 9.53 ఎన్ఎల్సీఐఎల్ 492.11 ఎన్‌టీఈసీఎల్ 248.55 ఎన్టీపీసీ 1,723.97 ఎన్టీపీఎల్ 418.65 ఎస్‌ఈఎంబీ 2,532.22 సంప్రదాయ విద్యుత్ బకాయిల మొత్తం: 5,596.76 సంప్రదాయేతర విద్యుత్ బకాయిలు: 1,504.57 మొత్తం బకాయిలు: 7,101 ‘కో–ఆర్డినేషన్’కమిటీపై బకాయిల భారం.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 478.86 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 1,335.16 కోట్లు, తెలంగాణ స్టేట్ పవర్ కో–ఆర్డినేషన్ కమిటీ (టీఎస్పీసీసీ) రూ. 5,287.31 కోట్లు కలిపి డిస్కంలు మొత్తం రూ. 7,101.33 కోట్లను విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిపడ్డాయి. అత్యధిక శాతం విద్యుత్ కొనుగోళ్లను టీఎస్పీసీసీ ఆధ్వర్యంలో జరుపుతుండటంతో అత్యధిక బకాయిలు సైతం దీని పేరిటే ఉన్నాయి. ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు చైర్మన్‌గా ఉన్న టీఎస్పీసీసీ డిస్కంల తరఫున విద్యుత్ కొనుగోళ్లు, జనరేటర్లకు బిల్లుల చెల్లింపుల వంటి ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. నెలవారీగా జనరేటర్లకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు (రూ. కోట్లలో) 2020 బకాయిలు జనవరి 6,153 ఫిబ్రవరి 6,385 మార్చి 6,039 ఏప్రిల్ 6,494 మే 7,143 జూన్ 7,443 జూలై 4,755 ఆగస్టు 4,872 సెప్టెంబర్ 5,485 అక్టోబర్ 6,096 నవంబర్ 6,655 డిసెంబర్ 7,101 కేంద్రం మెట్టు దిగితేనే.. విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలకు ఆత్మనిర్భర్ రుణాలను ప్రకటించింది. తెలంగాణ డిస్కంలకు ఆర్ఈసీ, పీఎఫ్‌సీల నుంచి రూ. 12,600 కోట్ల రుణాలు మంజూరవగా 50 శాతం రుణాలను తొలి విడత కింద విడుదల చేశారు. రెండో విడత రుణాల విడుదలకు విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదిస్తున్న సంస్కరణల అమలుకు అంగీకరిస్తేనే మిగిలిన రుణాలను విడుదల చేస్తామని కేంద్రం పేర్కొంటోంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణల అమలును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో కేంద్రం మెట్టుదిగి రుణాల విడుదలకు అంగీకరిస్తేనే డిస్కంలు బకాయిల భారం నుంచి బయటపడనున్నాయి. -
భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌కు మోక్షం!
పర్యావరణ అనుమతుల జారీకి కేంద్ర పర్యావరణ శాఖ సిఫారసు మరో వారం రోజుల్లో అనుమతుల జారీకి అవకాశం సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. రెండేళ్లుగా చిక్కుల్లో ఉన్న ఈ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులు జారీ చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గత నెల 20న సమావేశమైన ఈఏసీ.. ఈ మేరకు చేసిన సిఫారసులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. మరోవారం రోజుల్లో పర్యావరణ అనుమతులు జారీ కావచ్చని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి. విద్యుత్ కొరతను అధిగమించేందుకు బీహెచ్ఈఎల్ వద్ద అందుబాటులో ఉన్న సబ్ క్రిటికల్ బాయిలర్లు ఉపయోగించి తక్కువ కాలంలో 1080 (4‘‘270) మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి థర్మల్ విద్యు త్ కేంద్రం నిర్మించాలని రెండేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.7,290.60 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు బీహెచ్ఈఎల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగూడెం జిల్లా మణుగూరు, పినపాక మండలాల పరిధిలోని రామానుజవరం, ఎద్దులబయ్యారం, సీతారాంపురం గ్రామాల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) అప్పట్లో శంకుస్థాపన కూడా నిర్వహించింది. 2016 డిసెంబర్ 31 లోగా ప్లాంటును నిర్మిస్తామని అప్పట్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా అసెంబ్లీ ప్రకటన చేశారు. అయితే అధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కాకుండా కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఆదిలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పర్యావరణ అనుమతులు రాకముందే భద్రాద్రి ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టారని ఓ స్వచ్ఛంద సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)ను ఆశ్రయించడంతో ప్రాజెక్టు మరింత చిక్కుల్లో పడింది. కొంత కాలం తర్వాత ఎన్జీటీ కేసు నుంచి ఉపశమనం లభించినా, పర్యావరణ అనుమతుల కష్టాలు మాత్రం కొనసాగాయి. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నందున ఈ విద్యుత్ కేంద్రాన్ని జాబితా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గతేడాది చివర్లో ప్రకటించడంతో భద్రాద్రి ప్లాంట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అప్పటికే ప్లాంట్‌పై జెన్కో రూ.1,000 కోట్లకు పైగా వ్యయం చేయడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. వరుస వివాదాలు, చిక్కులతో ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు పూర్తయింది. ఈ క్రమంలో సీఎం కె.చంద్రశేఖర్ రావు స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్‌తో సమావేశమై సబ్ క్రిటికల్ నిబంధన విషయంలో భద్రాద్రి ప్లాంట్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని కోరగా, సానుకూల నిర్ణయం వచ్చింది. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 2017 డిసెంబర్‌లోగా నిర్మించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ అనుమతించగా, దీని ఆధారంగానే తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈఏసీ.. పర్యావరణ అనుమతుల జారీకి సిఫారసు చేసింది. ఏడాదిలోగా పూర్తి చేస్తాం.. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులు జారీ చేయాలని ఈఏసీ సిఫారసు చేస్తుందని ముందే ఊహించాం. నిర్ణయం సానుకూలంగా వచ్చింది. అనుమతులు అందిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి యుద్ధప్రాతిపదికన ఏడాదిలోగా ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తాం. – జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు