భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌కు మోక్షం!
పర్యావరణ అనుమతుల జారీకి కేంద్ర పర్యావరణ శాఖ సిఫారసు
మరో వారం రోజుల్లో అనుమతుల జారీకి అవకాశం
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. రెండేళ్లుగా చిక్కుల్లో ఉన్న ఈ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులు జారీ చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్‌పర్ట్స్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గత నెల 20న సమావేశమైన ఈఏసీ.. ఈ మేరకు చేసిన సిఫారసులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. మరోవారం రోజుల్లో పర్యావరణ అనుమతులు జారీ కావచ్చని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి. విద్యుత్ కొరతను అధిగమించేందుకు బీహెచ్‌ఈఎల్ వద్ద అందుబాటులో ఉన్న సబ్ క్రిటికల్ బాయిలర్లు ఉపయోగించి తక్కువ కాలంలో 1080 (4‘‘270) మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి థర్మల్ విద్యు త్ కేంద్రం నిర్మించాలని రెండేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రూ.7,290.60 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు బీహెచ్‌ఈఎల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగూడెం జిల్లా మణుగూరు, పినపాక మండలాల పరిధిలోని రామానుజవరం, ఎద్దులబయ్యారం, సీతారాంపురం గ్రామాల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) అప్పట్లో శంకుస్థాపన కూడా నిర్వహించింది. 2016 డిసెంబర్ 31 లోగా ప్లాంటును నిర్మిస్తామని అప్పట్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా అసెంబ్లీ ప్రకటన చేశారు. అయితే అధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కాకుండా కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఆదిలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
పర్యావరణ అనుమతులు రాకముందే భద్రాద్రి ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టారని ఓ స్వచ్ఛంద సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)ను ఆశ్రయించడంతో ప్రాజెక్టు మరింత చిక్కుల్లో పడింది. కొంత కాలం తర్వాత ఎన్జీటీ కేసు నుంచి ఉపశమనం లభించినా, పర్యావరణ అనుమతుల కష్టాలు మాత్రం కొనసాగాయి. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నందున ఈ విద్యుత్ కేంద్రాన్ని జాబితా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గతేడాది చివర్లో ప్రకటించడంతో భద్రాద్రి ప్లాంట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అప్పటికే ప్లాంట్‌పై జెన్‌కో రూ.1,000 కోట్లకు పైగా వ్యయం చేయడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.
వరుస వివాదాలు, చిక్కులతో ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు పూర్తయింది. ఈ క్రమంలో సీఎం కె.చంద్రశేఖర్ రావు స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్‌తో సమావేశమై సబ్ క్రిటికల్ నిబంధన విషయంలో భద్రాద్రి ప్లాంట్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని కోరగా, సానుకూల నిర్ణయం వచ్చింది. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 2017 డిసెంబర్‌లోగా నిర్మించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ అనుమతించగా, దీని ఆధారంగానే తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈఏసీ.. పర్యావరణ అనుమతుల జారీకి సిఫారసు చేసింది.
ఏడాదిలోగా పూర్తి చేస్తాం..
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులు జారీ చేయాలని ఈఏసీ సిఫారసు చేస్తుందని ముందే ఊహించాం. నిర్ణయం సానుకూలంగా వచ్చింది. అనుమతులు అందిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి యుద్ధప్రాతిపదికన ఏడాదిలోగా ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తాం.
– జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు