Bhadradri thermal power
-
మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం (గత బీఆర్ఎస్ సర్కార్) బిడ్డింగ్ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకోవడం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టడంతో రాష్ట్రానికి నష్టం వాటిల్లిందంటూ వచ్చిన ఆరోపణలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ మంగళవారం బహిరంగ ప్రకటన జారీ చేసింది. సంబంధిత అంశాల్లో అవగాహన, అనుభవం, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, సంస్థలు 10 రోజుల్లోగా లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. cio2024.power@gmail.com కి మెయిల్ ద్వారా లేదా తమ కార్యాలయానికి (7వ అంతస్తు, బీఆర్కేఆర్ భవన్, ఆదర్శ్ నగర్, హైదరాబాద్– 500004) పోస్టు ద్వారా పంపాలని సూచించింది. విచారణ కమిషన్‌కు పంపించే విజ్ఞాపనల్లో వ్యక్తులపై ఎలాంటి రాజకీయపరమైన ఆరోపణలు చేయరాదని కోరింది. ఎవరైనా కమిషన్ ముందు హాజరై మౌఖికంగా ఆధారాలు సమరి్పంచాలని భావిస్తే, ఏ విషయంలో వారు హాజరుకావాలని కోరుకుంటున్నారో తెలియజేయాలంది. సంబంధిత నిర్ణయాల్లో తప్పులను గుర్తించడంతోపాటు రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టాన్ని నిర్ధారించడం, బాధ్యులను గుర్తించడం కోసం న్యాయవిచారణ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. -
టీఎస్ఆర్టీసీ ఆఫర్.. ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేయనుంది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో బుధవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. అనంతరం బిజినెస్ హెడ్ (లాజిస్టిక్స్) పి.సంతోష్ కుమార్‌కు రూ.116 చెల్లించి రశీదును ఆయన స్వీకరించారు. తొలి బుకింగ్ చేసుకుని తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు. ‘భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని గత ఏడాది టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. తమ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. గత ఏడాది దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను అందజేశాం. తద్వారా రూ.71 లక్షల రాబడి వచ్చింది. గత ఏడాది డిమాండ్ దృష్ట్యా ఈ శ్రీరామ నవమికి భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను కోరుకునే భక్తులకు అందజేయబోతున్నాం. ఈ సారి రాములోరి కల్యాణంతో పాటు 12 ఏళ్లకో సారి నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలి. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్ కుమార్, మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సి.టి.ఎం (ఎం అండ్ సి) విజయ్‌కుమార్, సీఎంఈ రఘునాథ రావు, సీఎఫ్ఎం విజయ పుష్ప, నల్లగొండ ఆర్ఎం శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. -
భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌కు మోక్షం!
పర్యావరణ అనుమతుల జారీకి కేంద్ర పర్యావరణ శాఖ సిఫారసు మరో వారం రోజుల్లో అనుమతుల జారీకి అవకాశం సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. రెండేళ్లుగా చిక్కుల్లో ఉన్న ఈ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులు జారీ చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గత నెల 20న సమావేశమైన ఈఏసీ.. ఈ మేరకు చేసిన సిఫారసులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. మరోవారం రోజుల్లో పర్యావరణ అనుమతులు జారీ కావచ్చని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి. విద్యుత్ కొరతను అధిగమించేందుకు బీహెచ్ఈఎల్ వద్ద అందుబాటులో ఉన్న సబ్ క్రిటికల్ బాయిలర్లు ఉపయోగించి తక్కువ కాలంలో 1080 (4‘‘270) మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి థర్మల్ విద్యు త్ కేంద్రం నిర్మించాలని రెండేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.7,290.60 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు బీహెచ్ఈఎల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగూడెం జిల్లా మణుగూరు, పినపాక మండలాల పరిధిలోని రామానుజవరం, ఎద్దులబయ్యారం, సీతారాంపురం గ్రామాల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) అప్పట్లో శంకుస్థాపన కూడా నిర్వహించింది. 2016 డిసెంబర్ 31 లోగా ప్లాంటును నిర్మిస్తామని అప్పట్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా అసెంబ్లీ ప్రకటన చేశారు. అయితే అధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కాకుండా కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఆదిలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పర్యావరణ అనుమతులు రాకముందే భద్రాద్రి ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టారని ఓ స్వచ్ఛంద సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)ను ఆశ్రయించడంతో ప్రాజెక్టు మరింత చిక్కుల్లో పడింది. కొంత కాలం తర్వాత ఎన్జీటీ కేసు నుంచి ఉపశమనం లభించినా, పర్యావరణ అనుమతుల కష్టాలు మాత్రం కొనసాగాయి. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నందున ఈ విద్యుత్ కేంద్రాన్ని జాబితా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గతేడాది చివర్లో ప్రకటించడంతో భద్రాద్రి ప్లాంట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అప్పటికే ప్లాంట్‌పై జెన్కో రూ.1,000 కోట్లకు పైగా వ్యయం చేయడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. వరుస వివాదాలు, చిక్కులతో ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు పూర్తయింది. ఈ క్రమంలో సీఎం కె.చంద్రశేఖర్ రావు స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్‌తో సమావేశమై సబ్ క్రిటికల్ నిబంధన విషయంలో భద్రాద్రి ప్లాంట్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని కోరగా, సానుకూల నిర్ణయం వచ్చింది. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 2017 డిసెంబర్‌లోగా నిర్మించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ అనుమతించగా, దీని ఆధారంగానే తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈఏసీ.. పర్యావరణ అనుమతుల జారీకి సిఫారసు చేసింది. ఏడాదిలోగా పూర్తి చేస్తాం.. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతులు జారీ చేయాలని ఈఏసీ సిఫారసు చేస్తుందని ముందే ఊహించాం. నిర్ణయం సానుకూలంగా వచ్చింది. అనుమతులు అందిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి యుద్ధప్రాతిపదికన ఏడాదిలోగా ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తాం. – జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు -
జెన్కోకు మళ్లీ చుక్కెదురు!
భద్రాద్రి పవర్ ప్లాంట్‌పై స్టే యథాతథం ♦ స్టే ఎత్తివేతకు నిరాకరించిన గ్రీన్ ట్రిబ్యునల్ ♦ కేంద్రం తప్పుడు నివేదిక ఇచ్చిందని ♦ అఫిడవిట్ దాఖలు చేసిన జెన్కో సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా మణుగూరులో 1080(270x4) మెగావాట్ల సామర్థ్యంతో తలపెట్టిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)కు మళ్లీ చుక్కెదురైంది. ఈ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయకుండా యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు ఈ నెల 2న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉప సంహరించుకోవాలని జెన్కో చేసిన విజ్ఞప్తిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) తోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండానే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను జెన్కో ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ హ్యూమన్ రైట్స్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం చెన్నైలోని దక్షిణ ప్రాంత ఎన్జీటీ విచారణ జరిపింది. గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు గతేడాది డిసెంబర్ 14నే ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలుపుదల చేసినా... పనులు కొనసాగించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తప్పుడు విచారణ నివేదిక సమర్పించిందని జెన్కో ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేసింది. జెన్కో అఫిడవిట్‌పై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్జీటీ ధర్మాసనం ఫిర్యాదుదారులను ఆదేశిస్తూ కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండానే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను జెన్కో ప్రారంభించిందని హ్యూమన్ రైట్స్ ఫోరం గతేడాది ఫిర్యాదు చేయడంతో ఎన్జీటీ తీవ్రంగా స్పందించింది. ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని అప్పట్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి జెన్కో నిర్మాణ పనులను కొనసాగిస్తోందని ఫిర్యాదుదారులు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో ఎన్జీటీ విచారణ జరిపించింది. పర్యావరణ అనుమతి పొందకుండానే జెన్కో ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించిందని, ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత సైతం పనులు కొనసాగించి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుడు ఎన్జీటీకి నివేదిక సమర్పించారు. జెన్కో ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించిన ఎన్జీటీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు భద్రాద్రి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని గత ఏప్రిల్ 7న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఈ నెల 2న జరిగిన విచారణ సందర్భంగా జెన్కో చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్జీటీ..తాజాగా మంగళవారం జరిగిన విచారణలో సైతం అందుకు నిరాకరించింది.