TSRTC Home Delivery Service For Bhadradri Sri Seetha Rama Kalyanam Talambralu - Sakshi
Sakshi News home page

టీఎస్‌ఆర్టీసీ ఆఫర్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

Published Wed, Mar 15 2023 6:33 PM | Last Updated on Thu, Mar 16 2023 3:35 PM

TSRTC Home Delivery Bhadradri Sri Seetha Rama Kalyanam Talambralu - Sakshi

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేయనుంది.

హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో బుధవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు ఆవిష్కరించారు. అనంతరం బిజినెస్‌ హెడ్‌ (లాజిస్టిక్స్‌) పి.సంతోష్‌ కుమార్‌కు రూ.116 చెల్లించి రశీదును ఆయన స్వీకరించారు. తొలి బుకింగ్‌ చేసుకుని తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు. 

‘భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని గత ఏడాది టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. తమ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారు. గత ఏడాది దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను అందజేశాం. తద్వారా రూ.71 లక్షల రాబడి వచ్చింది.

గత ఏడాది డిమాండ్‌ దృష్ట్యా ఈ శ్రీరామ నవమికి భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను కోరుకునే భక్తులకు అందజేయబోతున్నాం. ఈ సారి రాములోరి కల్యాణంతో పాటు 12 ఏళ్లకో సారి నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగే  శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలి. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందాలి’ అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌, ఐపీఎస్‌ కోరారు.

రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్ కుమార్, మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సి.టి.ఎం (ఎం అండ్ సి) విజ‌య్‌కుమార్, సీఎంఈ రఘునాథ రావు, సీఎఫ్ఎం విజయ పుష్ప, నల్లగొండ ఆర్‌ఎం శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement