జెన్‌కోకు మళ్లీ చుక్కెదురు!
భద్రాద్రి పవర్ ప్లాంట్‌పై స్టే యథాతథం
♦ స్టే ఎత్తివేతకు నిరాకరించిన గ్రీన్ ట్రిబ్యునల్
♦ కేంద్రం తప్పుడు నివేదిక ఇచ్చిందని
♦ అఫిడవిట్ దాఖలు చేసిన జెన్‌కో
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా మణుగూరులో 1080(270x4) మెగావాట్ల సామర్థ్యంతో తలపెట్టిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)కు మళ్లీ చుక్కెదురైంది. ఈ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయకుండా యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు ఈ నెల 2న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉప సంహరించుకోవాలని జెన్‌కో చేసిన విజ్ఞప్తిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) తోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండానే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను జెన్‌కో ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ హ్యూమన్ రైట్స్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం చెన్నైలోని దక్షిణ ప్రాంత ఎన్జీటీ విచారణ జరిపింది.
గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు గతేడాది డిసెంబర్ 14నే ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలుపుదల చేసినా... పనులు కొనసాగించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తప్పుడు విచారణ నివేదిక సమర్పించిందని జెన్‌కో ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేసింది. జెన్‌కో అఫిడవిట్‌పై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్జీటీ ధర్మాసనం ఫిర్యాదుదారులను ఆదేశిస్తూ కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండానే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను జెన్‌కో ప్రారంభించిందని హ్యూమన్ రైట్స్ ఫోరం గతేడాది ఫిర్యాదు చేయడంతో ఎన్జీటీ తీవ్రంగా స్పందించింది.
ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని అప్పట్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి జెన్‌కో నిర్మాణ పనులను కొనసాగిస్తోందని ఫిర్యాదుదారులు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో ఎన్జీటీ విచారణ జరిపించింది. పర్యావరణ అనుమతి పొందకుండానే జెన్‌కో ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించిందని, ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత సైతం పనులు కొనసాగించి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుడు ఎన్జీటీకి నివేదిక సమర్పించారు. జెన్‌కో ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించిన ఎన్జీటీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు భద్రాద్రి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని గత ఏప్రిల్ 7న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఈ నెల 2న జరిగిన విచారణ సందర్భంగా జెన్‌కో చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్జీటీ..తాజాగా మంగళవారం జరిగిన విచారణలో సైతం అందుకు నిరాకరించింది.