సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరిపై చేపట్టిన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. సీతమ్మ సాగర్ నిర్మాణ పనులకు సంబంధించి అభ్యంతరాలను లేవనెత్తుతూ కొందరు వేసిన పిటిషన్‌పై గ్రీన్ ట్రిబ్యునల్ ద్విసభ్య కమిటీని నియమించింది. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏమైనా పనులు జరుగుతున్నాయా? లేదా ? అనే అంశాలను ద్విసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. దీంతో బ్యారేజీ నిర్మాణ పనులు నిలిపివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పని ప్రదేశం నుంచి కొంత మిషనరీ, కార్మికులను వెనక్కి రప్పించింది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో పనులు నిలిపివేయనుంది.
బాధితుల ఫిర్యాదుతో..
గ్రీన్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు సీడబ్ల్యూసీ నుంచి పూర్తి స్థాయిలో అనుమతి పొందేందుకు తుది డీపీఆర్‌ను సిద్ధం చేశారు. అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలమైన వేసవికాలం వృధా కాకూడదనే ఉద్దేశంతో బ్యారేజీ అనుబం«ధ పనులు కొనసాగిస్తూ వచ్చారు. దీంతో బాధితులు మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
పనులకు సంబంధించి కొన్ని ఫొటోలను సైతం సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ట్రిబ్యునల్ ద్విసభ్య కమిటీని నియమించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్ రీజనల్ డైరెక్టర్ (హైదరాబాద్), గోదావరి బోర్డులో ఎస్‌ఈ ర్యాంక్‌కు తక్కువ కాని వారు సభ్యులుగా ఉండాలని ఆదేశించింది. సభ్యుల ఎంపిక పూర్తయిన తర్వాత కమిటీ జూన్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనుంది. జూలై 12లోగా ఈ కమిటీ తమ నివేదికను అందించాల్సి ఉంటుంది.
ఆ ముద్ర పడకూడదని..
తెలంగాణాలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తోందనే ఆరోపణలు మొదట్నుంచీ ఉన్నాయి. ముఖ్యంగా ‘సీతారామ’డిజైన్ల విషయంలో కోర్రీల మీద కొర్రీలు వేస్తూ వస్తోంది. ఈ సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారనే ముద్ర పడటం మంచిది కాదనే అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగానే బ్యారేజీ, కరకట్టల దగ్గర జరుగుతున్న పనులు ఆపేయాలంటూ నిర్మాణ సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై వివరణ కోసం సీతారామ ఇంజనీర్లను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
ఏప్రిల్‌లో స్టే..
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం – దుమ్ముగూడెం మండలాల మధ్య గోదావరి నదిపై బ్యారేజీ నిర్మిస్తోంది. అయితే బ్యారేజీ నిర్మాణం కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయనే ఆందోళన నెలకొంది.
మరోవైపు నష్టపరిహారం సైతం తగు మొత్తం చెల్లించడం లేదంటూ రైతులు నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు బాధితుల్లో కొందరు సరైన అనుమతులు తీసుకోకుండా బ్యారేజీ నిర్మాణ పనులు చేస్తున్నారంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 26న గ్రీన్ ట్రిబ్యునల్ పనులపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆగిన ‘సీతమ్మ సాగర్’ పనులు
Published Tue, May 30 2023 4:29 AM | Last Updated on Tue, May 30 2023 4:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment