సాక్షి, హైదరాబాద్: గోదావరి జల వివాదాల (బచావత్) ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే నాటికి గోదావరిలో మొత్తం 4,535.1 టీఎంసీల లభ్యత ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా అంచనా వేసింది. ఇక 75 శాతం లభ్యత ఆధారంగా గోదావరిలో 3,396.9 టీఎంసీల లభ్యత ఉందని తేల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా 1,430 టీఎంసీల లభ్యత ఉందని 2004లో వ్యాప్కోస్ తేల్చగా.. సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా 1,435 టీఎంసీల లభ్యత ఉందని తేల్చింది.
వ్యాప్కోస్ అంచనా వేసిన దానికంటే ఐదు టీఎంసీలు అధికంగా ఉన్నట్లు తేల్చింది. నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో 1941–42 నుంచి 1979–80 వరకూ వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా గోదావరిలో నీటి లభ్యతపై తాజాగా సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. గోదావరిలో ఉప నదీ పరీవాహక ప్రాంతాల(సబ్ బేసిన్) వారీగా నీటి లభ్యత, బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను తేల్చింది.
ఈ అధ్యయనం ప్రకారం ఉమ్మడి మధ్యప్రదేశ్‌కు 679.6, మహారాష్ట్రకు 951, కర్ణాటకకు 37.8, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,435, ఒడిశాకు 293.6 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించినట్లు అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను గోదావరి బోర్డు (జీఆర్‌ఎంబీ)కు సీడబ్ల్యూసీ ఇటీవల సమర్పించింది. ఈ నివేదికపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయాలను జీఆర్‌ఎంబీ కోరింది.
తాజా అధ్యయన నేపథ్యం ఇదీ..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలోని గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా 1,430 టీఎంసీల (70 టీఎంసీల పునరుత్పత్తి జలాలు) 2004లో వ్యాప్కోస్ తేల్చింది. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు 1,238.46 టీఎంసీలు (902.46 నికర, 336 మిగులు) అవసరమని గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం అనేక సందర్భా లలో స్పష్టం చేసింది.
ఇక తెలంగాణ సర్కార్ కూడా ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టే ప్రా జెక్టులకు 1,767 టీఎంసీలు (967 నికర, 800 మిగులు) అవసరమని తెలిపింది. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటే 3,005.46 టీఎంసీలు అవసరం. ఈ నేపథ్యంలో.. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి, 2 రాష్ట్రాలకు కేటాయింపులు చేశాకే.. కొత్త ప్రాజెక్టులకు అనుమతివ్వాలని జనవరి 3న జరిగిన సర్వసభ్య సమావేశంలో గోదావరి బోర్డును రెండు రాష్ట్రాలు కోరాయి.
గోదావరిలో సబ్ బేసిన్ల వారీగా నీటి లభ్యతను తేల్చకుండానే.. అప్పట్లో రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ జలాలను పంపిణీ చేసింది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చా లని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అటు కేంద్ర జల్ శక్తి శాఖను.. ఇటు గోదావరి బోర్డును కోరుతూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే నాటికి గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. నివేది క ఇవ్వాలని గత జనవరి 19న సీడబ్ల్యూసీకి గోదావరి బోర్డు లేఖ రాసింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది.
40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా..
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద పురుడుపోసుకునే గోదావరి 1,465 కిలోమీటర్ల పొడవున ప్రవహించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో 3,12,150 చ.కి. మీ. పరిధిలో ఈ నదీ పరీవాహక ప్రాంతం ఉంది.
ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతంతో సమానం. గోదావరి జలాలను బేసిన్ పరిధిలోని రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ 1980, జూ లై 7న బచావత్ ట్రిబ్యునల్ కేంద్రానికి నివేదిక ఇచ్చి ంది. అదే ఏడాది ఆ అవార్డును కేంద్రం అమల్లోకి తెచ్చి ంది. ఈ నేపథ్యంలో 1941–42 నుంచి 1979–80 వరకూ అంటే 40 ఏళ్లు గోదావరి బేసిన్‌లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ తాజాగా అధ్యయనం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment