సాక్షి, అమరావతి: చౌక విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు(డిస్కంలు) మరో ముందడుగు వేశాయి. యూనిట్ రూ.2.70కే సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయబోతున్నాయి. ఈ ప్రతిపాదనలు తుది దశలో ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కడప, అనంతపురం జిల్లాల్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ సంయుక్త భాగస్వామ్యంతో సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. ఈ రెండింటి నుంచి 1,500 మెగావాట్ల కరెంటు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిపై ఇటీవల విద్యుత్ సమన్వయ కమిటీ సమీక్షించింది. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకుని, ఈ విద్యుత్‌ను తీసుకోవడం ఉపయోగకరమని కమిటీ నిర్ణయానికొచ్చింది.
2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్‌ను యూనిట్ రూ.6.25 చొప్పున కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 2018 వరకూ అధిక రేట్లతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) జరిగాయి. దీనివల్ల విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం పడింది. అందువల్ల చౌకగా లభించే విద్యుత్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి రోజుకు 1.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభించే వీలుంది. యూనిట్ రూ.2.70 చొప్పున చూస్తే.. దీని ఖరీదు రూ.32 లక్షలు. 2015లోయూనిట్ ధర రూ.6.25 ప్రకారం చూస్తే రోజుకు రూ.75 లక్షలు అవుతుంది. అంటే రోజుకు రూ.43 లక్షలు ప్రభుత్వానికి ఆదా కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతోపాటు సోలార్ ప్యానళ్ల ధరలు తగ్గడం వల్ల సోలార్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గుతున్నట్టు అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment