ఎస్‌ఎఫ్‌సీ నిధులివ్వని రాష్ట్రం రూ.50 కోట్ల ఎగవేత
ఆర్థిక సంఘం నిధుల్లో కోతపెట్టిన కేంద్రం
మొక్కుబడిగా ట్యాక్స్, నాన్‌ట్యాక్స్ వసూళ్లు
నిధులు లేక నీరసిస్తున్న గ్రామ పంచాయతీలు
రాష్ట్రప్రభుత్వం నిధులివ్వక.. 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కేంద్రప్రభుత్వం కోతవిధించి.. గ్రామపంచాయతీల పరిధిలో పన్నులు వసూళ్లుగాక.. పంచాయతీలు నీరసించి పోతున్నాయి. అభివృద్ధి సంగతి దేవుడెరుగు కనీసం విద్యుత్ బకాయిలు కూడా చెల్లించలేక చతికిలపడుతున్నాయి.
చిత్తూరు: జిల్లాలోని 66 మండలాల పరిధిలో 1,363 గ్రామపంచాయతీల పరిస్థితి దారుణంగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడం, పన్ను బకాయిలు పేరుకుపోతుండడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి.
వసూలు కాని పన్నులు
చిత్తూరు డివిజన్‌లో ఇంటి పన్నులు పాత బకాయిలతో కలిపి రూ.4,12,39,958 వసూలు కావాల్సి ఉండగా, రూ.2,19,40,594 (53.20శాతం) మాత్రమే వసూలైంది. ఇదే డివిజన్‌లో నాన్ ట్యాక్స్ (కొళాయి ఫీజు, లెసైన్సు ఫీజు, రూమ్ రెంట్, మార్కెట్, బస్టాండు తదితర) రూ. 81,39,793 వసూలు కావాల్సి ఉండగా, రూ. 71,74,688 వసూలైంది. తిరుపతి డివిజన్‌లో ఇంటి పన్నులు (ట్యాక్స్) రూ.13,40,60,719 వసూలు కావాల్సిఉండగా, 8,02,65,270 వసూలైంది. ఇదే డివిజన్‌లో నాన్ ట్యాక్స్ రూ.11,16,62,744 వసూలు కావాల్సి ఉండగా రూ.10,35,66,540 వసూలైంది.
మదనపల్లె డివిజన్‌లో ఇంటి పన్నులు (ట్యాక్స్) రూ.10,32,24,543 వసూలు కావాల్సి ఉండగా, రూ.6,01,98,279 వసూలైంది. నాన్ ట్యాక్స్ పరిధిలో రూ.8,76,19,354 వసూలు కావాల్సి ఉండగా రూ.7,11,95,098 వసూలైంది. జిల్లా వ్యాప్తంగా ఇంటి పన్నులు (ట్యాక్స్) రూ.27,85,25,220 వసూలు కావాల్సి ఉండగా రూ.16,24,04,143 (58.31శాతం) వసూలైంది. నాన్ ట్యాక్స్ కింద రూ.20,74,21,891 వసూలు కావాల్సి ఉండగా రూ.18,19,36,326 మాత్రమే వసూలైంది.
మొత్తం 48,59,47,111 రూపాయలు వసూలు కావాల్సి ఉండగా, రూ.34,43,40,469 వసూలైంది. ఇంటిపన్ను (ట్యాక్స్) రూ.27.85 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉండగా, ఇందులో 58.31 శాతం మాత్రమే వసూలైంది. పంచాయతీల పరిధిలో జిల్లావ్యాప్తంగా నెలకు రూ.15 కోట్ల మేరకు విద్యుత్ బిల్లు వస్తోంది. ప్రస్తుతం రూ.150 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి.
ఆర్థిక సంఘం నిధుల్లో కోత
గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కోతపెట్టింది. 2014-15లో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.137.67 కోట్లు ఇచ్చిన కేంద్రం ఈ ఏడాది రూ.88 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ నిధులను సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులకు వెచ్చించాల్సి ఉండగా గ్రామపంచాయతీలు విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు ఖర్చు చేస్తున్నారు.
నిధులివ్వని రాష్ట్రం
2015-16 ఏడాదికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫిషనల్ ట్యాక్స్, యునానిమస్ గ్రాంట్, సీనరైజస్ చార్జెస్, ఫర్ క్యాపిటా గ్రాంట్ మొత్తం కలిపితే కేవలం రూ.22,00,57,000 నిధులిచ్చింది. ఇక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి జిల్లాకు రూ.50కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉన్నా ఒక్క పైసా చెల్లించలేదు. విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్‌శాఖ కనెక్షన్లు తొలగించేపనిలో పడింది. అధికారులు ఉపాధి హామీ నిధులుతో అరకొరగా సిమెంట్ రోడ్లు నిర్మించి మమ.. అనిపిస్తున్నారు.