financial community
-
నిధుల కోసం నిరీక్షణ... మూణ్నెళ్లుగా జమకాని ఎస్ఎఫ్సీ ఫండ్
సుభాష్‌నగర్ : గ్రామ పంచాయతీల్లో నిధుల కటకట నెలకొంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్ఎఫ్సీ, ఆర్థిక సంఘం నిధులు మరో రూ.30 కోట్లు జమ కావాల్సి ఉంది. ఇటీవల పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కూడా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలకు రూ.1150 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రకటించిన నాటి నుంచి సర్పంచులు నిధుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఒక్కో నెల పంచాయతీ కార్మికులు, సిబ్బంది జీతాలను కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అప్పులు తెచ్చి అరకొర వేతనాలు చెల్లిస్తున్నారు. వేతనాలకూ ఇబ్బందులు జిల్లావ్యాప్తంగా 530 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ప్రతినెలా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీ ఖాతాల్లో నిధులు జమయ్యేవి. ఈ నిధులతోనే పంచాయతీలో అభివృద్ధి పనులతోపాటు సిబ్బంది, కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లులు, ఇతరత్ర ఖర్చులు చెల్లించేవారు. ఇప్పటికే అన్ని జీపీల్లో అప్పులు తెచ్చి పనులు కొనసాగిస్తున్నారు. ఒక్కో నెల వేతనాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచులు వాపోతున్నారు. తప్పని ఎదురుచూపులు ఎస్ఎఫ్సీ, ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయని రోజుల తరబడి సర్పంచులు, కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్పంచులు అప్పులు తెచ్చి కార్మికులు, సిబ్బంది జీతాలు చెల్లిస్తున్నారు. పంచాయతీల్లో చిన్న చిన్న పనులకు కూడా డబ్బులను సర్దుబాటు చేస్తున్నారు. అలాగే గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సైతం బిల్లుల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే చాలా పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. జీపీ ఖాతాల్లో జమ అయిన నిధులకు కూడా ఫ్రీజింగ్ చేయడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రెజరీలో ఒక్క చెక్కు కూడా పాస్ కావడం లేదని వాపోతున్నారు. అభివృద్ధి పనుల బిల్లులు సహా పంచాయతీలకు మొత్తం రూ.100 కోట్లకుపైగా రావాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. పది రోజుల్లో జమయ్యే అవకాశం గ్రామపంచాయతీలకు పది రోజుల్లో నిధులు విడుదల య్యే అవకాశముంది. ఆర్థిక సంఘంతోపాటు, ఎస్ఎఫ్సీ నిధులు కూడా జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఈ మేరకు సమాచారం అందింది. సర్పంచులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్న మాట వాస్తవమే. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – జయసుధ, జిల్లాపంచాయతీ అధికారి రూ.45 కోట్ల బకాయిలు.. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధుల కోసం సర్పంచ్, ఉపసర్పంచ్ జాయింట్ ఖాతాతో డిజిటల్ టోకెన్ ప్రక్రియను 13 నెలల క్రితమే పూర్తిచేసింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.15కోట్ల వరకు రావాల్సి ఉంది. అలాగే ఎస్ఎఫ్సీ మూడు నెలలుగా జమ చేయడం లేదు. గతేడాదికి సంబంధించి పూర్తిగా విడుదల చేసినా.. ఈ సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి విదిల్చలేదు. గతేడాది, ఈయేడాదికి సంబంధించి ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నుంచి మొత్తం రూ.45కోట్ల వరకు జమ కావాల్సి ఉంది. -
క్రిప్టో కరెన్సీలో దిట్ట.. 13 ఏళ్ల మన భారతీయ బిడ్డ!
వర్చువల్ కరెన్సీ వ్యాపారంలో ఇండియాకు చెందిన గజేశ్నాయక్ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇంకా పదో తరగతి పూర్తి చేయకముందే కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని పనితీరు మెచ్చి ప్రపంచ కుబేరులు అతని సంస్థలో పెట్టుబడులు పెడుతున్నారు. సాక్షి, వెబ్‌డెస్క్: గజేశ్ నాయక్, వయస్సు 13 ఏళ్లు, చదివేది 9వ తరగతి, నివసించేది గోవా. ఇవేమీ అతని ప్రత్యేకతలు కావు. కానీ అతను నెలకొల్పిన బిజినెస్ యాప్ ఆర్థిక కార్యకలాపాల విలువ అక్షరాల యాభై కోట్ల రూపాయలకు పైమాటే. పదో తరగతి కూడా పాస్ కాకుండానే గజేశ్ ఈ ఘనత సాధించాడు. ఇండియాలో మొగ్గదశలోనే ఉన్న క్రిప్టో కరెన్సీ కార్యకలాపాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాడు. కరోనా సంక్షోభంలో స్టార్టప్‌లు ఇబ్బందులు పడుతుంటే అందుకు భిన్నంగా ముందుకెళ్తున్నాడు గజేశ్. చదువులో దిట్ట గోవా రాజధాని పనాజీలోని పీపుల్స్ హై స్కూల్ చెందిన గజేశ్ నాయక్ చిన్నప్పటి నుంచే చదువులో దిట్ట, గణితంలో మేటి. చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. అందువల్లే కరోనా కారణంగా పాఠశాలు మూత పడినప్పుడు, తన కంటే కింది తరగతి విద్యార్థుల కోసం స్టడీ కంటెంట్ రెడీ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచాడు. పాఠశాలలు తెరుచుకోపోవడంతో న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేశాడు. సీ, సీ ప్లస్, జావా స్క్రిప్ట్, సోలిడిటీలలో ఆరితేరాడు. క్రిఫ్టోకరెన్సీపై ఫోకస్ గోవాలో 2018లో జరిగిన ఇంటర్నేషనల్ బ్లాక్ చెయిన్ సమావేశాల్లో గజేశ్ పాల్గొన్నాడు. అప్పటి నుంచే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఆర్టిపీషియల్ ఇంటిలిజెన్స్‌పై ఆసక్తి పెరిగింది. లాక్డౌన్ టైంలో నేర్చుకున్న కొత్త కోర్సులను తన ఆసక్తికి జత చేశాడు. కోడింగ్ రాయడం సుళువైంది. ఆ తర్వాత వర్చువల్ కరెన్సీ మార్కెటైన క్రిప్టో కరెన్సీపై ఫోకస్ చేశాడు. క్రిప్టో కరెన్సీపై అనుభవం ఉన్న నిపుణులతో చర్చలు జరిపాడు. అనంతరం తనే స్వంతంగా పాలీగజ్ పేరుతో కొత్త డీయాప్‌ను రూపొందించాడు. డీ సెంట్రలైజ్డ్ పాలిగాన్ బ్లాక్‌చైయిన్ టెక్నాలజీపై డీఫై ప్రోటోకాల్ ఆధారంగా గజేశ్ రూపొందించిన పాలిగజ్ డీయాప్ క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వ్యవహరాలను నిర్వహిస్తుంది. ఇందులో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిజినెస్‌ని ఎటువంటి చట్టపరమైన అనుమతులు, మధ్యవర్తులు, దళారులు లేకుండానే నిర్వహించవచ్చు. ఈ పద్దతిలో వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలపై ఏ ఒక్కరి పెత్తనం ఉండదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రోటోకాల్‌లోనే అన్ని వ్యవహరాలు ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటాయి. 7 మిలియన్ డాలర్లు పాలిగజ్లో డీయాప్పై ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే దీని నిర్వాహాణ సామర్థ్యం వన్ మిలియన్ డాలర్లకి చేరుకుంది. పాలిగజ్ యాప్ పనితీరు నచ్చడంతో ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబన్ ఆసక్తి చూపించారు. తాను పెట్టుబడులు పెట్టారు. దీంతో ఇప్పుడు పాలిగజ్ నిర్వాహణ సామర్థ్యం 7 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒక 13 ఏళ్ల భారతీయ బాలుడు స్థాపించిన పాలిగజ్ యాప్ అమెరికన్లు సైతం ఆశ్చర్యపరిచే రీతిలో పెర్ఫ్మామ్ చేస్తోంది. డీఫై ప్రోటోకాల్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. -
ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.68,12,739 కోట్లు!
సాక్షి, అమరావతి: వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.68,12,739 కోట్లకు చేరుతుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. ఇదే కాలంలో ఏకంగా రూ.1,32,967 కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఐదేళ్లలో పెన్షన్ కింద రూ.80,627 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయం ఇలా ఉంటుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. -
మండల, జిల్లా, పరిషత్‌లకు ఊరట
సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా పరిషత్‌ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం తలసరి నిధుల్లో గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు కూడా నిధులను కేటాయించింది. ఈ మేరకు ఇప్పటికే ఖరారు చేసిన నిష్పత్తి ఆధారంగా తొలి త్రైమాసికానికి సంబంధించిన నిధులను రాష్ట్రానికి విడుదల చేయగా.. వాటిని జనాభా ప్రాతిపదికన జిల్లాలకు పంపిణీ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది రూ.1,847 కోట్లు ఖరారు చేయగా.. ఇందులో మొదటి విడత (తొలి త్రైమాసికం)గా రూ.308 కోట్లు విడుదల చేసింది. జెడ్పీ 5%, ఎంపీపీలకు 10% నిధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. 2014–15లో అమలు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. దీంతో మండల, జిల్లా పరిషత్‌లకు నిధుల కొరత ఏర్పడింది. కేవలం సీనరేజీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులపైనే ఆధారపడాల్సి వచ్చింది. నిధుల కటకటతో నీరసించిన జెడ్పీ, ఎంపీపీలకు కూడా కొంతమేర కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయడంతో వీటికి ఊరట లభించింది. గ్రామ పంచాయతీలకు 75 శాతం, మండల పరిషత్‌లకు 10 శాతం, జిల్లా పరిషత్‌లకు 5 శాతం నిష్పత్తిలో నిధులు పంచాలని నిర్ణయించింది. దీంతో తొలి త్రైమాసికానికి సంబంధించి రూ.461.75 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతి మంజూరు చేసిన కేంద్రం.. టైడ్ గ్రాంట్ కింద రూ.308 కోట్లు విడుదల చేసింది. వీటిలో జిల్లా పరిషత్‌లకు రూ.1,026.11 లక్షలు, మండల పరిషత్‌లకు రూ.2,052.20 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.27,721.67 లక్షలను నిర్దేశించింది. వీటిని సాధారణ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ల కింద వినియోగించుకోవాలని సూచించింది. ఈ నిధులతో తాగునీటి సౌకర్యాల కల్పన, వాననీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, డోర్‌టుడోర్ చెత్త సేకరణ, కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రం, ప్లాస్టిక్ సేకరణ, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్‌రావు ఆదేశించారు. -
మార్కెటింగ్ సంస్కరణలతో రైతులకు లబ్ధి
సాక్షి, అమరావతి: పంటలకు మెరుగైన ధరలు కల్పించడంతో పాటు రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు 2021–22 ఆర్ధిక సంవత్సరం నుంచి ప్రత్యేకంగా గ్రాంట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ గ్రాంట్లు పొందాలంటే 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలను చేయాల్సి ఉంటుందని షరతు విధించింది. ఈ మేరకు మధ్యంతర నివేదికను విడుదల చేసింది. పంటలకు మెరుగైన ధరలు లభించేలా మార్కెటింగ్ వ్యవస్థను సరళీకరించాలని, దళారీ వ్యవస్థను నిర్మూలించాలని, ప్రైవేట్ వ్యాపారుల మధ్య పోటీతత్వం పెంచాలని స్పష్టం చేసింది. 15వ ఆర్థిక సంఘం ఇంకా ఏయే సిఫార్సులు చేసిందంటే... - రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయించుకునేలా మార్కెటింగ్ రంగంలో సంస్కరణలు తీసుకురావాలి. - ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 2016, 2017, 2018లో రూపొందించిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. ఇందుకోసం ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లులను పాస్ చేయాలి. - మార్కెటింగ్ వ్యవస్థలోకి ప్రైవేట్ పెట్టుబడులను తీసుకురావడంతో వ్యవసాయంలో వృద్ధిసాధించొచ్చు. - కేంద్ర మోడల్ చట్టాలకు వీలుగా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభల్లో బిల్లులను ఆమోదిస్తే 2021–22 నుంచి ఆయా రాష్ట్రాలకుగ్రాంట్లు మంజూరు చేస్తాం. విద్య, వైద్య రంగాలకు రాయితీలు అప్పర్ ప్రైమరీ స్కూళ్ల నుంచి సెకండరీ స్కూళ్లకు వచ్చే సరికి చదువుకునే బాలికల సంఖ్య తగ్గిపోతోందని 15వ ఆర్థిక సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. చిన్న వయసులోనే బాలికలు వివాహాలు చేసుకోవడం, గర్భం దాల్చడంతో తల్లీబిడ్డల్లో పౌష్టికాహార లోపాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఈ పరిస్థితిని మార్చడంలో అత్యుత్తమ ఫలితాలు సాధించే రాష్ట్రాలకు 2021–22 నుంచి రాయితీలను సిఫార్సు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు ఇండికేటర్స్‌ను నిర్ధారించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. జాతీయ విద్యా విధానం–2019 ప్రకారం ప్రీ ప్రైమరీ విద్యను అమలు చేసే రాష్ట్రాలకు కూడా రాయితీలను సిఫార్సు చేయనున్నట్లు వెల్లడించింది. - ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. ప్రభుత్వ రంగంలోని ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకునే రాష్ట్రాలకు 2021–22 నుంచి గ్రాంట్లు మంజూరు చేస్తామని వివరించింది. - 2021–22లో పోలీసుల శిక్షణ కేంద్రాల ఏర్పాటు, పోలీసుల గృహ నిర్మాణాలకు గాను గ్రాంట్ల మంజూరుకు సిఫార్సులు చేస్తామని, ఈలోగా 2020–21లో పోలీసు శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు స్థలాలను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ పటిష్టానికి నిధులు కేసుల సత్వర పరిష్కారానికి న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తుది నివేదికలో గ్రాంట్లు మంజూరు చేస్తామని 15వ ఆర్థిక సంఘం వెల్లడించింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, లాయర్స్ హాల్స్, సమాచార కేంద్రాలు, జస్టిస్ క్లాక్స్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వివాదాల పరిష్కార కేంద్రాలు, విలేజ్ లీగల్ ఎయిడ్ క్లినిక్స్, జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అధారిటీల సామర్థ్యం పెంపునకు గ్రాంట్లను సిఫార్సు చేస్తామని పేర్కొంది. - వాణిజ్య ఎగుమతులను పెంచే రాష్ట్రాలకు రాయితీలను సిఫార్సు చేయాలని ఆర్థిక సంఘం నిర్ణయించింది. ఈ మేరకు నిర్దిష్ట సూచికలను రూపొందించాలని నీతి ఆయోగ్‌కు సూచించింది. - జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఉత్తమ పనితీరును సాధించిన రాష్ట్రాలకు ఫెర్ఫార్మెన్స్ రాయితీలను ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. ఈ రాయితీలను 2021–22 నుంచి మంజూరు చేయనున్నట్లు పేర్కొంది. -
విభజనతో నష్టపోయాం..
-
మానని గాయం.. అందించండి సాయం
సాక్షి, అమరావతి : విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ బాగా దెబ్బతిందని.. అశాస్త్రీయంగా, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల రాజధానిని కోల్పోయామని 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. విభజన వల్ల రాజధానిని కోల్పోయిన రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనని స్పష్టం చేసింది. అన్ని రంగాల్లో రాష్ట్రం కోలుకోవాలంటే ఉదారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు అందేలా సిఫార్సులు చేయాలని కోరింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక, సేవ, ఆరోగ్య, విద్యా, మౌలిక రంగాలపై అధికారులు సమగ్ర వివరాలు అందించారు. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్, కార్యదర్శి అరవింద్ మెహతా, రవి కోటా తదితరులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ తదితర అధికారులు ఆయా రంగాలపై సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదీ ప్రభుత్వ పని తీరు పౌష్టికాహార లోపం నివారణపై దృష్టి బియ్యం నాణ్యతను పెంచాం. స్వర్ణ రకం బియ్యాన్ని అందిస్తున్నాం. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాం. వచ్చే ఏప్రిల్ నాటికి అన్ని జిల్లాల్లో అందిస్తాం. బియ్యాన్ని ప్యాక్ చేసి ఇస్తున్నాం. ఈ బియ్యంలో ఖనిజ లవణాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్యాక్ చేసేచోటే వీటిని బియ్యంలో కలిపేలా ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో పౌష్టికాహారం లోపం అధికంగా ఉన్న 77 గిరిజన సబ్ ప్లాన్ మండలాల్లో మంచి పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నాం. కేంద్రం ఇస్తున్న దానికంటే మరో 3 రెట్లు రాష్ట్ర ప్రభుత్వం దీనికి నిధులు ఖర్చు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో కనీస సదుపాయాలను మెరుగు పరుస్తున్నాం. 9 రకాల సదుపాయాల్ని కల్పిస్తున్నాం. ఇంగ్లిష్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో నాడు– నేడు కింద వీటిని చేపడుతున్నాం. వచ్చే విద్యా సంవత్సరం.. 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభిస్తున్నాం. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళతాం. ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లిష్ మీడియం స్కూల్‌గా మారుస్తున్నాం. నిరక్షరాస్యతను నిర్మూలించడానికి పిల్లల తల్లుల్లో స్ఫూర్తి నింపేలా చర్యలు తీసుకుంటున్నాం. అమ్మ ఒడి కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడుతున్నాం. పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తాం. దీనివల్ల డ్రాప్ అవుట్ శాతం పూర్తిగా తగ్గుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో కూడా మార్పులు తీసుకువస్తున్నాం. ప్రతి కోర్సు కూడా ఉద్యోగం, ఉపాధి నిచ్చేలా పాఠ్యప్రణాళికను రూపొందిస్తున్నాం. పేద విద్యార్థులు ఎంత వరకు చదువుకుంటే అంత వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. దీనికి తోడు హాస్టల్, వసతి కోసం ఏటా రూ.20 వేలు ఇస్తున్నాం. పరిపాలనలో సంస్కరణలు గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకు వచ్చాం. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉంది. ప్రభుత్వ పాలన అనేది నేరుగా గ్రామాలకు చేరింది. 10 మంది ఉద్యోగులు ఈ సచివాలయాల్లో ఉంటారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేశాం. 1.3 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. 2.6 లక్షలమంది వలంటీర్లు ఉన్నారు. ప్రతి పథకం ప్రజల గడపకు చేర్చడమే వారి పని. ప్రతి కార్యక్రమం కూడా పారదర్శకతతో, సంతృప్త స్థాయిలో చేయడానికి వీళ్లంతా తోడ్పడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కూడా జరుగుతుంది. అవినీతి లేకుండా, వివక్షకు తావు లేకుండా చేస్తున్నాం. స్కూలుకు టీచర్ వెళ్లకపోతే.. కచ్చితంగా వీళ్లంతా పరిశీలిస్తారు. మహిళా పోలీసులను కూడా పెడుతున్నాం. ఆరోగ్య రంగానికి పెద్ద పీట వైద్యం ఖర్చు వేయి దాటితే ఆరోగ్య శ్రీని అందిస్తున్నాం. సబ్ సెంటర్లు, పీహెచ్సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం. టీచింగ్ ఆస్పత్రులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. మొత్తంగా రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. (చాలా దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలు పారా మెడికల్ సిబ్బందిపై ఆధారపడి ఉన్నాయని ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ పేర్కొనగా.. దీనిని దృష్టిలో ఉంచుకునే బోధనాసుపత్రుల్లో నర్సింగ్ కాలేజీలను పెడుతున్నామని సీఎం వివరించారు.) ఇళ్ల పట్టాలు, ఇళ్లు వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నాం. ఏటా ఆరు లక్షల చొప్పున ఇళ్లు కడతాం. ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదన్నది లక్ష్యం. గోదావరి – పెన్నా అనుసంధానం రాయలసీమ ప్రాజెక్టులకు వరద జలాలను తీసుకెళ్లే కాల్వలను విస్తరించాల్సి ఉంది. కృష్ణా నదికి వరద వచ్చే ఆ కొద్ది రోజుల్లోనే ప్రాజెక్టులు నింపాలి. ఇందు కోసం రూ.23 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. మరోవైపు గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని కరువు ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. కృష్ణా నదిలో శ్రీశైలానికి వచ్చే నీరు.. 47 సంవత్సరాల సగటు చూస్తే దాదాపు 1200 టీఎంసీలు ఉంది. గత 10 సంవత్సరాల సగటు చూస్తే శ్రీశైలంలోకి కృష్ణా నీరు 600 టీఎంసీలకు పడిపోయింది. గత ఐదేళ్లలో చూస్తే 600 టీఎంసీలు కూడా రావడం లేదు. 400 టీఎంసీలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో గోదావరి నుంచి నీటిని బొల్లాపల్లికి, అక్కడ నుంచి బనకచర్లకు తరలించాల్సి ఉంటుంది. దీనికోసం రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు. అలాగే పోలవరం ఎడమ కాల్వ నుంచి ఉత్తరాంధ్రకు నీళ్లు అందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి రూ.15 వేల కోట్లు అవసరం. విద్యుత్ సంస్కరణలు.. ఇతర పనులు డిస్కంలు రూ.20 వేల కోట్ల రుణ భారంతో ఇబ్బంది పడుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 18.5 లక్షల పంపు సెట్ల ద్వారా రైతులు ఉచిత విద్యుత్ పొందుతున్నారు. ఏటా విద్యుత్ సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లను ట్రాన్స్‌కోకు చెల్లిస్తోంది. ఈ మేరకు 10 వేల మెగావాట్లతో సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకుంటే రూ.32 వేల కోట్లకుౖపైగా ఖర్చు అవుతుందని అంచనా. దీనివల్ల ప్రభుత్వంపై సబ్సిడీల భారం తగ్గుతుంది. ఆ దిశగా ఆలోచిస్తున్నాం. మరోవైపు భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. తాగు నీటి కోసం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపడుతున్నాం. తొలిదశలో రూ.11,150 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2049 – 50 నాటి డిమాండ్‌కు అనుగుణంగా దశల వారీగా చేపట్టే పనుల కోసం రూ.47,937 కోట్లు ఖర్చు చేయనున్నాం. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. నిర్మాణ పనుల కోసం సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఆర్ అండ్ ఆర్ కోసం రూ.33 వేల కోట్లు అవసరం. నిర్మాణ పనులు ఒక వైపు పూర్తి చేస్తున్న కొద్దీ.. మరోవైపు పునరావాస చర్యలను అంతే వేగంగా చేపట్టాల్సి ఉంటుంది. నీటి మట్టం 41.15 మీటర్ల ఎత్తుకు చేరింది. వరదలు వచ్చినప్పుడు చాలా ప్రాంతాలు మునిగి పోతున్నాయి. పనులు జరుగుతున్న సమయంలోనే ఇక్కడ పునరావాస పనులు కూడా చేపట్టాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పునరావాస పనుల కోసం రూ.10 వేల కోట్లు, ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం రూ.6 వేల కోట్లు (మొత్తం రూ.16 వేల కోట్లు) కావాలి. బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఇదీ రాష్ట్ర పరిస్థితి.. ►రాష్ట్ర విభజన వల్ల పారిశ్రామిక రంగం వాటా 25.2 నుంచి 23.4 శాతానికి, సేవా రంగం వాటా 44.6 నుంచి 43.0 శాతానికి పడిపోయింది. ►తలసరి ఆదాయం కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలతో పోలిస్తే ఏపీకి తక్కువ. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,05,696 అయితే ఏపీలో రూ.1,64,025 మాత్రమే. రెవెన్యూ షేర్ ఏపీలో 46 శాతం, తెలంగాణలో 54 శాతం. ►షెడ్యూలు 9లో ఉన్న ఆస్తుల విభజన ఇంకా జరగలేదు. షెడ్యూల్ 10లో 142 ఆస్తులు ఉంటే తెలంగాణకు 107, ఏపీకి 15 మాత్రమే వచ్చాయి. ఇంకా 20 ఆస్తులు తెలంగాణ, ఆంధ్ర చేతుల్లో ఉమ్మడిగా ఉన్నాయి. ఏపీ భవన్ విభజన కూడా ఇంకా జరగలేదు. ►ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇక్రిశాట్ లాంటి ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, హెచ్ఏఎల్ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆ రాష్ట్రంలోనే ఉండిపోయాయి. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. 15 – 29 ఏళ్ల వయసున్న వారిలో నిరుద్యోగ శాతం ఏపీలో 22.8 శాతం ఉంటే.. దేశం మొత్తం మీద ఇది 20.6 శాతం మాత్రమే. ►తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన రూ.5,127 కోట్లు, దీనిపై వడ్డీ రూ. 604.7 కోట్లు ఇంకా రాలేదు. ►మొత్తంమీద రాష్ట్రం ఆర్థిక అసమతుల్యతను ఎదుర్కొంటోంది. మిగులు నిధుల నుంచి లోటు ఎదుర్కొనే పరిస్థితిలోకి వచ్చాం. రాష్ట్రాన్ని పునర్ నిర్మించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సిఫార్సు చేయాలి. భౌగోళికంగా రాష్ట్రానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. రాయలసీమ లాంటి ప్రాంతాలు నిరంతరం కరువుతో అల్లాడుతున్నాయి. కోస్తా ప్రాంతంలో 8 జిల్లాలపై తుపాన్లు తరచుగా దండెత్తుతున్నాయి. ►పట్టణీకరణ దేశ సగటుతో పోలిస్తే తక్కువ. దేశంలో పట్టణ జనాభా సగటున 31.16 శాతం అయితే ఏపీలో 29.6 శాతం మాత్రమే. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ, జీఎస్డీపీలో 34 శాతం. రాష్ట్రంలో 31.9 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ►రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.18,969.26 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకూ రూ.3,979 కోట్లు మాత్రమే వచ్చాయి. వెనకబడిన జిల్లాల్లో చాలా ప్రాంతాలకు సాగు, రక్షిత తాగు నీరు లేదు. అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. ఆరోగ్య ప్రమాణాలు సరిగా లేవు. వెనుకబడిన జిల్లాలకు రూ.24,350 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.1,050 కోట్లు మాత్రమే వచ్చాయి. ►విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నంలో పోర్టు నిర్మించాల్సి ఉంది. 2018 కల్లా ఫేజ్–1 పూర్తి చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. దీనికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వండి. రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించాం. తగిన సహాయం కోసం సిఫార్సు చేయాలి. ►ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్‌లు, ట్యాక్స్ మినహాయింపులు కూడా చట్టంలో పెట్టారు. వాటిని వెంటనే అమలు చేసేలా చూడాలి. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటును ప్రకటించాలి. ►విభజన హామీల అమలు కోసం కేంద్రంలో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటుకు సిఫార్సు చేయాలి. 2013 – 14 లో రాష్ట్రం అప్పు రూ.1,23,586 కోట్లు. 2018–19లో రాష్ట్రం అప్పు రూ.2,60,330 కోట్లు. జీఎస్డీపీలో రెవిన్యూ లోటు శాతం 2013 –14లో 2.4 శాతం, ఇప్పుడు 3.6 శాతం. జీఎస్డీపీలో రుణ నిష్పత్తి 2013–14లో 22.2 శాతం కాగా, ఇప్పుడు 28.2 శాతం ఉంది. -
పంచాయతీల సొమ్ములపై ప్రభుత్వ పెత్తనం
-
మీ నిధులు.. మా ఇష్టం
పంచాయతీల సొమ్ములపై రాష్ట్రప్రభుత్వ పెత్తనం.. 14వ ఆర్థిక సంఘం నిధులపై ఆంక్షలు.. రాజ్యాంగాన్ని పరిహసిస్తూ ఉత్తర్వులు - ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెడితేనే నిధులు - ఇంటి పన్నుల రూపంలో వసూలైన సొమ్ముపైనా అదుపు - గ్రామాల్లో చెత్త సేకరణకు షెడ్లు నిర్మించాలి - ఫొటోలిస్తేనే నిధులు - నిధులు అందుబాటులో లేక పంచాయతీల అవస్థలు - ఆంక్షలపై సర్పంచ్ల ఆగ్రహం సాక్షి, అమరావతి: ఆర్థిక సంఘం నిధులనేవి గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. గ్రామ పంచాయతీలకు ఆర్ధిక సంఘం ద్వారా కేంద్ర నిధులందాలని, అపుడే అవి పరిపుష్టమై గ్రామ స్వరాజ్య స్వప్నం సాకారమౌతుందని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. 1994లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరహాలో గ్రామ పంచాయతీలకు సైతం స్వయం ప్రతిపత్తిని కల్పించారు. కేంద్రం ఇచ్చే నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కూ ఉండదు. దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాజ్యాంగ స్ఫూర్తిని పట్టపగలే పరిహాసం చేస్తోంది. 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులపై పెత్తనమంతా తమదే అంటోంది. తాము చెప్పినట్లు చేస్తేనే ఆ నిధులు తీసుకోవాలంటూ ఆంక్షలు విధిస్తోంది. దీంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేక సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు. ఇవెక్కడి ఆంక్షలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికసంఘం నిధులు సర్పంచ్‌లకు ఇవ్వొద్దు.. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను సంబంధిత సర్పంచులకు ఇవ్వొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల్లో వసూలు చేసి, ట్రెజరీల్లో జమ చేసిన ఇంటి పన్నుల సొమ్ము వినియోగంపైనా ఆంక్షలు విధించింది. కేంద్రం విడుదల చేసిన నిధులను, పంచాయతీల సొంత సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులు, గ్రామాల్లో వసూలు చేసిన ఇంటి పన్నుల డబ్బును గ్రామ పంచాయతీల తీర్మానాలకు అనుగుణంగా ఖర్చు పెట్టుకోవడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సర్పంచ్‌లకు చెక్ పవర్‌ను కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కును హరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. షెడ్ల నిర్మాణం పంచాయతీల పనేనట! ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సేకరించిన చెత్తను ఒక చోట చేర్చేందుకు షెడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ షెడ్లను పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నిర్మించాల్సి ఉంటుంది. కానీ, కేంద్రం ఇచ్చిన నిధులతోపాటు పంచాయతీల సొంత నిధులను వీటి నిర్మాణం కోసం వెచ్చించాలని ప్రభుత్వం అధికారుల ద్వారా సర్పంచ్‌లపై ఒత్తిడి తీసుకొచ్చింది. అత్యధిక శాతం సర్పంచులు దీన్ని వ్యతిరేకించడంతో ఆంక్షలను తెరపైకి తెచ్చింది. గ్రామ పంచాయతీల పేరిట ఉన్న నిధులను ఆయా సర్పంచ్‌లు డ్రా చేసుకునే వీల్లేకుండా ట్రెజరీలపై ఆంక్షలు విధించింది. ఇందుకు సంబంధించి కొన్ని జిల్లాల్లో మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్పష్టమైన ఉత్తర్వులిచ్చేశారు. ట్రెజరీల్లో పంచాయతీల సొమ్ము రూ.1,449 కోట్లు రాష్ట్రంలోని 12,920 గ్రామ పంచాయతీల పేరుతో ప్రస్తుతం ఖజానాలలో(ట్రెజరీ) దాదాపు రూ.1,449 కోట్ల నిధులున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2016–17లో కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు దాదాపు రూ.1,463 కోట్లు నేరుగా విడుదల చేసింది. ఈ నిధుల్లో ఎక్కువ భాగం ఆర్థిక సంవత్సరం చివరన అంటే ఈ ఏడాది మార్చిలో ఇచ్చింది. సర్పంచ్‌లు ఇప్పటిదాకా డ్రా చేసిన నిధులు పోగా.. ప్రస్తుతం దాదాపు రూ.900 కోట్లు గ్రామ పంచాయతీల పేరిట ట్రెజరీల్లో ఉన్నట్లు సమాచారం. దీనికితోడు గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను రూపంలో వసూలు చేసిన రూ.549 కోట్లను మార్చి నెలలోనే ట్రెజరీల్లో జమ చేశాయి. కేంద్రం ఇచ్చినవాటితో పాటు పంచాయతీల సొంత నిధులను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెడితేనే వాటిని ట్రెజరీల నుంచి పొందే అవకాశం కల్పిస్తామంటూ సర్కార్ ఆంక్షల అడ్డుగోడ నిర్మించింది. చెల్లింపులు నిలిపివేత గ్రామ పంచాయతీల నిధుల చెల్లింపులపై జూలై 27వ తేదీ నుంచి ట్రెజరీల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ సర్పంచ్‌లకు నిధులు విడుదల చేయొద్దంటూ ప్రభుత్వం తేల్చిచెప్పింది. సాధారణ నిధుల నుంచి పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల చెల్లింపులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. చెత్త సేకరణ షెడ్ల నిర్మాణం పూర్తి చేసి, సంబంధిత ఫోటోలను సమర్పిస్తేనే ట్రెజరీల నుంచి నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే.. షెడ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి, వాటిని ఫొటోలు తీసి ఇస్తేనే ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల చేతికొస్తాయన్నమాట! వర్షాకాలంలో గ్రామాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా, వ్యాధులు ప్రబలకుండా మురుగు కాల్వలను శుభ్రం చేసుకోవడానికి కూడా నిధులు అందుబాటులో లేకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేశ్ వింత నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్ పంచాతీయరాజ్ శాఖ మంత్రిగా కుర్చీ ఎక్కాక ఈ శాఖలో ఎన్నడూ లేని వింత పోకడలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి లోకేశ్ తన మనసుకు తోచిందే తడవుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారులు ఆయనకు ఎదురు చెప్పలేక ప్రతి నిర్ణయానికీ తలూపుతున్నారు. అందుకే రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. -
పంచాయతీలకు షాక్
► కరెంట్ బిల్లులు రూ.34 కోట్లు ►ఆర్థిక సంఘం నిధుల నుంచి ఇప్పటికే పది శాతం చెల్లింపు ►రెండో విడతలో 30 శాతం చెల్లించాలంటున్న విద్యుత్ అధికారులు ►నోటీసులు జారీ ఆదిలాబాద్ : జిల్లాలోని గ్రామ పంచాయతీలకు కరెంట్ బిల్లు బకాయిల షాక్ తగులుతోంది. ఇప్పటికే ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి పది శాతం చెల్లించగా.. రెండో విడత నిధుల్లో 30 శాతం చెల్లించాలని విద్యుత్‌శాఖ పట్టుబడుతోంది. ఆ శాఖ ఏఈల ద్వారా గ్రామ పంచాయతీలకు నోటీసులూ జారీ చేసింది. దీంతో పనుల నిర్వహణ కోసం ఉపయోగించే నిధులను కరెంటట్ బిల్లులకు చెల్లించాల్సి రావడంతో సర్పంచుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో గ్రామపంచాయతీలకు కరెంట్ బిల్లు గుదిబండగా మారింది. గ్రామపంచాయతీల్లో పనుల కోసం జనవరిలో 14వ ఆర్థిక సంఘం నిధులు మొదటి విడతలో రూ.10 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో నుంచి పది శాతం పంచాయతీల కరెంట్ బిల్లులు చెల్లించారు. జనవరిలో రూ.9.91 లక్షలు, ఫిబ్రవరిలో 24.33 లక్షలు కరెంట్ బిల్లు చెల్లించినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండో విడత ఆర్థిక సంఘం నిధుల్లోంచి 30 శాతం నిధుల చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పత్రాలను పంచాయతీ అధికారులకు అందజేశారు. విద్యుత్‌శాఖ ఏఈల ద్వారా గ్రామపంచాయతీలకు నోటీసులు కూడా అందించారు. రూ.34 కోట్ల బకాయిలు.. జిల్లాలోని గ్రామపంచాయతీల్లో విద్యుత్ బకాయి బిల్లులు రూ.కోట్ల లో పేరుకుపోయాయి. గ్రామాలకు తగినన్ని నిధులు లేకపోవడంతో బిల్లులు చెల్లించడం లేదు. గ్రామపంచాయతీల్లో వీధి దీపాలు, నీటి సరఫరా, పంచాయతీ కార్యాలయాలకు కలిపి మొత్తం జిల్లా వ్యాప్తంగా రూ.34.80 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నాయి. వీటిని చెల్లించాలని విద్యుత్ శాఖ నుంచి జనవరిలోనే నోటీసులు అందాయి. కానీ నిధులు లేకపోవడంతో అవి పెండింగ్‌లోనే ఉండిపోయాయి. జిల్లాలో 18 మండలాల్లో 243 గ్రామçపంచాయతీలు, 508 గ్రామాలున్నాయి. అంతర్గత ఆదా య వనరులు లేకపోవడం.. ప్రభుత్వ పరంగా అవసరాలకు సరిపడా నిధులు రాకపోవడంతో గ్రామపంచాయతీల్లో పాలన కత్తిమీద సాములా మారింది. తాగునీటి పథకాలు, వి ద్యుత్ బిల్లుల భారం గ్రామపంచాయతీ ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో బిల్లులు భారంగా మారుతున్నాయి. పంచాయతీల్లో విద్యుత్ బిల్లులు ఎక్కువగా రావడానికి నియంత్రణ లేకపోవడం ఓ కారణంగా చెప్పవచ్చు. కొన్ని గ్రామాల్లో విద్యుత్ బల్బులు నిరంతరం వెలుగుతుంటాయి. దీని వల్ల విద్యుత్తు వృథా కావడంతో బిల్లులు పేరుకుపోతున్నాయి. సిబ్బంది ద్వారా గ్రామాల్లో పర్యవేక్షణ ఉంటే విద్యుత్ వృథాను అరికట్టవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండకుండా ప్రతీనెల ఎంతో కొంత చెల్లించ డం ద్వారా భారం తగ్గే అవకాశముంది. 30 శాతం చెల్లించాల్సిందే.. గ్రామపంచాయతీల్లో పేరుకపోయిన విద్యుత్ బిల్లులు 14వ ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి చెల్లించాలి. మొదటి విడత నిధుల్లో 10 శాతం మాత్రమే చెల్లించారు. రెండో విడతలో 30 శాతం చెల్లించాలి్సందే. ఇప్పటికే దీనికి సంబంధించిన పత్రాలను డీపీవోకు అందజేశాం. ఏఈల ద్వారా పంచాయతీలకు నోటీసులు ఇచ్చాం. – సి.శ్రీనివాస్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, విద్యుత్‌శాఖ -
ఆర్థిక సంఘానికి హోదాకు సంబంధం లేదు
-
ఆర్థిక సంఘానికి హోదాకు సంబంధం లేదు
- ‘మంథన్ సంవాద్’ సదస్సులో ఆర్బీఐ మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి స్పష్టీకరణ - ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం పాటించాలనే నిబంధనేమీ లేదు - విభజన తరువాత ఏపీ లోటులోకి వెళ్లిపోయింది - కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి - జీఎస్టీతో ఇంకా మారే అవకాశముంది సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంఘానికి(ఫైనాన్స్ కమిషన్), ప్రత్యేక హోదాకు ఎటువంటి సంబంధం లేదని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) మాజీ గవర్నర్, 14వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా పనిచేసిన డాక్టర్ వై.వి.రెడ్డి స్పష్టంచేశారు. ఆర్థిక సంఘం సిఫార్సులను ప్రభుత్వం పాటించాలన్న నిబంధన ఏమీ లేదని ఆయన తేల్చిచెప్పారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మంథన్ సంస్థ ఆదివారం వివిధ అంశాలపై ‘మంథన్ సంవాద్’ పేరిట భారీ సదస్సును హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించింది. ఈ సందర్భంగా ‘కేంద్ర, రాష్ట్ర సంబంధాలు’ అనే అంశంపై డాక్టర్ వై.వి.రెడ్డి మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదా, సాధారణ రాష్ట్రాలు అంటూ తేడా లేదని మాత్రమే ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా రాష్ట్రాలన్నింటినీ ఆర్థిక సంఘం ఒకేలా చూస్తుందన్నారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉందని, ఆంధ్రప్రదేశ్ లోటులోకి వెళ్లిపోయిందని ఆయనీ సందర్భంగా అన్నా రు. తాను పనిచేస్తున్న సమయంలో ఆర్థిక సంఘం ఏ రాష్ట్రాన్నీ... ఎవ్వరినీ సంతృప్తి పరచలేదని... కాబట్టి సమానంగా అసంతృప్తితో ఉంచడమే పనిగా వ్యవహరించామని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో మార్పులు సహజం.. కేంద్రం అనే పదం రాజ్యాంగంలో లేదని... యూనియన్ గవర్నమెంట్ అని మాత్రమే ఉందని వైవీరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాలమధ్య సంబంధాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయని, ఒక్కోసారి ఒక్కోవిధంగా ఉందని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వల్ల కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇంకా మారుతాయన్నారు. కేంద్రం మరింత బలపడుతుందన్నారు. ‘‘నెహ్రూ హయాంలో కేంద్రానికి రాష్ట్రాలతో మంచి సంబంధాలుండేవి. నెహ్రూ సీఎంలతో తరచూ మాట్లాడుతూ ఉండేవారు. అయితే రాజ్యాంగం ఏర్పడిన 30 ఏళ్ల తర్వాత కేంద్రంపై రాష్ట్రాల వ్యతిరేకత పెరిగింది. రాష్ట్రాలు కీలకంగా మారాయి. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యాక జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడింది. ఒక ప్రాంతీయ పార్టీ అలా రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ప్రాంతీయ పార్టీలకు, రాజకీయవేత్తలకు తమకంటూ సొంత విధానాలుండేవి.. ఇవి కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపాయి’’ అని అన్నారు. ఏపీలో ఆర్థిక వ్యవహారాలు మొదలు ఆర్బీఐ గవర్నర్‌గా, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవాల్ని వైవీరెడ్డి ఈ సందర్భంగా వివరించారు. ఎవరి ఆహార అలవాట్లు వారివి.. దేశంలో ఎవరి ఆహార అలవాట్లు వారివని... శాకాహారి అంటే ఏదో ప్రత్యేకంగా చూడడం సరికాదని మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ అన్నారు. బీఫ్ తినేవారికి అది వారి ఆహార అలవాటన్నారు. సఫాయి కర్మచారి వృత్తిని రద్దు చేయడంలో ఇప్పటికీ ప్రభుత్వాలు విజయం సాధించలేకపోయాయన్నారు. గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ ఉన్నప్పుడు సఫాయి కర్మచారి పని ఎంతో పవిత్రమైందనే అర్థంలో వ్యాఖ్యానించారంటూ.. దాన్ని తాను ఖండించిన విషయాన్ని విల్సన్ ప్రస్తావించారు. స్మార్ట్ సిటీలే కాదు.. స్మార్ట్ శానిటేషన్ తీసుకురావాలన్నారు. స్వచ్ఛభారత్ కాదని... మన మనస్సులు స్వచ్ఛంగా ఉండాలన్నారు. కులంతో సంబంధం లేకుండా దేశంలో అందరి మనస్సుల్లో బ్రాహ్మణిజం పేరుకుపోయిందన్నారు. దళితుడు సీఎం, రాష్ట్రపతి, న్యాయమూర్తి అయితే దళితుడు అని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని... ఇతర కులాలవారు ఆ స్థాయికొస్తే అలా చెప్పరన్నారు. కలెక్టర్ అయినా కులంతోనే చూసే పరిస్థితి నెలకొందన్నారు. పోషకాహార లోపంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టట్లేదు: ఆకార్ పటేల్ దేశంలో పోషకాహార లోపంతో ఏటా 5 లక్షలమంది చిన్నారులు మృత్యువాత పడుతున్నా.. ప్రభుత్వాల దృష్టికి రావట్లేదని ప్రముఖ కాలమిస్ట్ ఆకార్ పటేల్ పేర్కొన్నారు. సమాచారం చేరవేతకు ఆంగ్ల భాషను వినియోగిస్తున్న ఉన్నత వర్గాలకు చెందిన 2.5 శాతం మందే దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యారంగంలో సంస్కరణలు రావాల్సిన అవసరముందని అశోక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు ప్రమత్‌రాజ్ సిన్హా అన్నారు. దేశంలో వృద్ధాప్య పింఛన్ తీసుకోవాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని పరిశోధన జర్నలిస్టు అవార్డు గ్రహీత జోసే జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ర్యాపర్, యాక్టివిస్ట్ సోఫియా అషఫ్,్ర మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్ మనోజ్ సక్సేనా మాట్లాడారు. -
సమస్యలు దండి.. నిధులు లేవండి!
ఎస్ఎఫ్సీ నిధులివ్వని రాష్ట్రం రూ.50 కోట్ల ఎగవేత ఆర్థిక సంఘం నిధుల్లో కోతపెట్టిన కేంద్రం మొక్కుబడిగా ట్యాక్స్, నాన్‌ట్యాక్స్ వసూళ్లు నిధులు లేక నీరసిస్తున్న గ్రామ పంచాయతీలు రాష్ట్రప్రభుత్వం నిధులివ్వక.. 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కేంద్రప్రభుత్వం కోతవిధించి.. గ్రామపంచాయతీల పరిధిలో పన్నులు వసూళ్లుగాక.. పంచాయతీలు నీరసించి పోతున్నాయి. అభివృద్ధి సంగతి దేవుడెరుగు కనీసం విద్యుత్ బకాయిలు కూడా చెల్లించలేక చతికిలపడుతున్నాయి. చిత్తూరు: జిల్లాలోని 66 మండలాల పరిధిలో 1,363 గ్రామపంచాయతీల పరిస్థితి దారుణంగా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడం, పన్ను బకాయిలు పేరుకుపోతుండడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. వసూలు కాని పన్నులు చిత్తూరు డివిజన్లో ఇంటి పన్నులు పాత బకాయిలతో కలిపి రూ.4,12,39,958 వసూలు కావాల్సి ఉండగా, రూ.2,19,40,594 (53.20శాతం) మాత్రమే వసూలైంది. ఇదే డివిజన్లో నాన్ ట్యాక్స్ (కొళాయి ఫీజు, లెసైన్సు ఫీజు, రూమ్ రెంట్, మార్కెట్, బస్టాండు తదితర) రూ. 81,39,793 వసూలు కావాల్సి ఉండగా, రూ. 71,74,688 వసూలైంది. తిరుపతి డివిజన్లో ఇంటి పన్నులు (ట్యాక్స్) రూ.13,40,60,719 వసూలు కావాల్సిఉండగా, 8,02,65,270 వసూలైంది. ఇదే డివిజన్లో నాన్ ట్యాక్స్ రూ.11,16,62,744 వసూలు కావాల్సి ఉండగా రూ.10,35,66,540 వసూలైంది. మదనపల్లె డివిజన్లో ఇంటి పన్నులు (ట్యాక్స్) రూ.10,32,24,543 వసూలు కావాల్సి ఉండగా, రూ.6,01,98,279 వసూలైంది. నాన్ ట్యాక్స్ పరిధిలో రూ.8,76,19,354 వసూలు కావాల్సి ఉండగా రూ.7,11,95,098 వసూలైంది. జిల్లా వ్యాప్తంగా ఇంటి పన్నులు (ట్యాక్స్) రూ.27,85,25,220 వసూలు కావాల్సి ఉండగా రూ.16,24,04,143 (58.31శాతం) వసూలైంది. నాన్ ట్యాక్స్ కింద రూ.20,74,21,891 వసూలు కావాల్సి ఉండగా రూ.18,19,36,326 మాత్రమే వసూలైంది. మొత్తం 48,59,47,111 రూపాయలు వసూలు కావాల్సి ఉండగా, రూ.34,43,40,469 వసూలైంది. ఇంటిపన్ను (ట్యాక్స్) రూ.27.85 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉండగా, ఇందులో 58.31 శాతం మాత్రమే వసూలైంది. పంచాయతీల పరిధిలో జిల్లావ్యాప్తంగా నెలకు రూ.15 కోట్ల మేరకు విద్యుత్ బిల్లు వస్తోంది. ప్రస్తుతం రూ.150 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. ఆర్థిక సంఘం నిధుల్లో కోత గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కోతపెట్టింది. 2014-15లో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.137.67 కోట్లు ఇచ్చిన కేంద్రం ఈ ఏడాది రూ.88 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ నిధులను సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులకు వెచ్చించాల్సి ఉండగా గ్రామపంచాయతీలు విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు ఖర్చు చేస్తున్నారు. నిధులివ్వని రాష్ట్రం 2015-16 ఏడాదికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫిషనల్ ట్యాక్స్, యునానిమస్ గ్రాంట్, సీనరైజస్ చార్జెస్, ఫర్ క్యాపిటా గ్రాంట్ మొత్తం కలిపితే కేవలం రూ.22,00,57,000 నిధులిచ్చింది. ఇక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి జిల్లాకు రూ.50కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉన్నా ఒక్క పైసా చెల్లించలేదు. విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్‌శాఖ కనెక్షన్లు తొలగించేపనిలో పడింది. అధికారులు ఉపాధి హామీ నిధులుతో అరకొరగా సిమెంట్ రోడ్లు నిర్మించి మమ.. అనిపిస్తున్నారు. -
ఆర్థిక సంఘం నిధులపై అయోమయం
♦ రూ.294 కోట్ల నిధులను వెనక్కి పంపుతామన్న ట్రెజరీ సిబ్బంది ♦ విడుదల చేసి వారం కాకుండానే ఎలా ఖర్చు చేస్తామంటున్న సర్పంచ్‌లు సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సర్కారు ఆంక్షలు విధించిందేమోనని రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. చేతిదాకా వచ్చిన సొమ్ము(14వ ఆర్థిక సంఘం నిధులు) చేజారిపోతుండడంతో వారంతా లబోదిబోమంటున్నారు. మార్చి 31లోగా వినియోగించని నిధులను జీవో 42 ప్రకారం వెనక్కి పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని ట్రెజరీ సిబ్బంది చెబుతుండగా, అటువంటిదేమీ లేదని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గత నెల 24న రెండో విడతగా విడుదల చేసిన రూ.294 కోట్ల వినియోగంపై అంతటా అయోమయం నె లకొంది. వాస్తవానికి 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి రూ.588 కోట్లు మంజూరు చేసింది. ఇందులో తొలివిడత వచ్చిన రూ.294 కోట్ల నిధులను ఆయా గ్రామ పంచాయతీలు గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయగా, రెండో విడతగా తాగునీరు, పారిశుధ్యం, పంచాయతీల నిర్వహణ నిమిత్తం మరో రూ.294 కోట్లను కేంద్రం ఇటీవల విడుదల చేసింది. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత నెల 14 నుంచే అన్ని గ్రామ పంచాయతీల ఖాతాలను స్థానిక ట్రెజరీ సిబ్బంది నిలుపుదల చేశారు. నిలుపుదల చేసిన గ్రామ పంచాయతీల ఖాతాలకు ఆర్థిక సంఘం నిధులు జమా అయినా సర్పంచ్‌లు వాటిని డ్రా చేసి వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మార్చి 31లోగా వినియోగించని అన్ని నిధులను వెనక్కి పంపుతున్నామని ట్రెజరీ అధికారులు స్పష్టం చేశారు. స్పష్టత లేకనే భయాందోళనలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టత లేకపోవడంతోనే ట్రెజరీ అధికారులు సర్పంచ్‌లను భయాందోళనకు గురి చేస్తున్నారు. మార్చి 14న నిలుపుదల చేసిన ఖాతాలకు 24న నిధులు జమచేస్తే వినియోగించుకోవడమెలాగో అర్థం కాని పరిస్థితి సర్పంచ్‌లది. ఇప్పటికే రాష్ట్రమంతటా అన్ని గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సర్పంచ్‌లకు ఇది శరాఘాతంగా మారింది. - పురుషోత్తమ్‌రెడ్డి, తెలంగాణ సర్పంచ్ల సంఘం కన్వీనర్ ఆ నిధులు ఎప్పటికీ మురిగిపోవు గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు ‘ఎ’కేట గిరి కిందకు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ‘సి’ కేటగిరీ కిందకు వస్తాయి. ‘ఎ’ కేటగిరీ కిందకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు గడువు దాటినా ఎంతమాత్రం మురిగిపోవు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ఆర్థిక సంఘం నిధులకు వర్తించదు కనుక వాటిని ట్రెజరీ అధికారులు వెనక్కి పంపాల్సిన అవసరం లేదు. గ్రామ పంచాయతీలకు నిధులను ఆపొద్దని ఇప్పటికే అన్ని జిల్లాల ట్రెజరీలకు ఆర్థికశాఖ నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. - అనితా రాంచంద్రన్, పంచాయతీరాజ్ విభాగం డెరైక్టర్ -
ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పెంపు
♦ రెవెన్యూ లోటు లేని రాష్ట్రాలకు వెసులుబాటు ♦ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం ♦ తెలంగాణకు రూ.2,300 కోట్ల అదనపు రుణానికి అవకాశం సాక్షి, హైదరాబాద్: ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం(ఎఫ్ఆర్బీఎం) రుణ పరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ లోటు లేని రాష్ట్రాలకు ఈ వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ)లో 3శాతం రుణాలు తీసుకునే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ఈ పరిమితి 3 నుంచి 3.5 శాతానికి పెరగనుంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర కేబినేట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణకు అదనంగా రూ.2,300 కోట్లు అప్పు తెచ్చుకునే వెసులుబాటు కలుగుతుంది. ఏడాదిన్నరగా ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. గుజరాత్ తర్వాత రెవెన్యూ మిగులున్న రాష్ట్రం తెలంగాణ అని, రుణ పరిమితి పెంచాలని లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల అమలుకు ఆర్థికంగా ఒత్తిడిని అధిగమించేందుకు అదనపు ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు వార్షిక రుణ పరిమితిని పెంచాలని, ఈ అప్పును చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉన్నందున కేంద్ర ప్రభుత్వంపై భారం పడే ప్రసక్తి లేదని అందులో పేర్కొంది. ఎట్టకేలకు కేంద్రం ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని సడలించే నిర్ణయం తీసుకోవటం తెలంగాణకు ఊరటనిచ్చే పరిణామం. ఇటీవల ప్రవేశపెట్టిన 2016-17 వార్షిక బడ్జెట్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పెరుగుతుందనే అశాభావంతోనే కేటాయింపులు చేసుకోవటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును రూ.23,467.29 కోట్లుగా చూపించిం ది. రాష్ట్ర జీఎస్డీపీలో ఇది 3.5 శాతంగా అంచనా వేసింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అంచనాకు అనుగుణంగా అప్పులు తెచ్చుకునే వెసులుబాటు రాష్ట్రానికి లభించనుంది. గత ఏడాది సైతం 3.49 శాతం మేరకు ద్రవ్యలోటు చూపించిన రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పెంపునకు కేంద్రం అనుమతించకపోవటం భంగపడింది. -
14వ ఆర్థిక సంఘం నిధుల్లో కోత!
57 పురపాలికలకు 158 కోట్లు విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరగని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వ నిధుల్లో మళ్లీ కోత పడింది. జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులతో కలిపి రాష్ట్రంలో 69 పురపాలికలు ఉండగా... ఎన్నికలు జరిగిన 57 పురపాలికలకు మాత్రమే తాజాగా 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.158.03 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ఆరు నెలలకు గాను ఇవే పురపాలికలకు రూ.133 కోట్లను విడుదల చేయగా.. తాజాగా తర్వాతి ఆరు నెలల నిధులుగా రూ. 158 కోట్లను విడుదల విడుదల చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. గడువులోగా ఎన్నికలు జరగని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్, బాదేపల్లి, సిద్దిపేట, చేగుంట, కొల్లాపూర్, అచ్చంపేట, మందమర్రి, మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీలకు నిధులు ఆగిపోయాయి. ఎన్నికలు నిర్వహించిన తర్వాతే వాటికి నిధులు విడుదలయ్యే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
తాగునీటి భారం
పథకాల నిర్వహణ పంచాయతీలదే సర్కారు నిర్ణయం గ్రామాలకు మరిన్ని ఆర్థిక తిప్పలు ఆర్థిక సం ఘం నిధులు ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటున్న ప్ర భుత్వం తాజాగా తాగునీటి పథకాల నిర్వహణ భారం పంచాయతీల నెత్తిన పెట్టింది. ఇప్పటికే గ్రామాల్లో విద్యుత్ దీపాల బిల్లుల చెల్లింపును అప్పగించిన వైనం తెలిసిందే. వచ్చే ఐదు రూ.లక్షల్లో సగం వీటికే ఖర్చుచేయాల్సి రావడంతో ఏ మేరకు అభివృద్ధి పనులు చేపడతామని సర్పంచ్‌లు వాపోతున్నారు. సీపీడబ్ల్యూ స్కీంల నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్నం : జిల్లాలోని 925 పంచాయతీల పరిధిలో 18,485 చేతిపంపులు, 2765ఎన్‌పీడబ్ల్యూ, పీడబ్ల్యూస్కీమ్లు, 29 సీపీడబ్ల్యూ స్కీమ్‌లు న్నాయి. చే తిపంపు నిర్వహణకు రూ.2 వేలు, ఎన్‌పీడబ్ల్యూ,పిడబ్ల్యూ స్కీమ్‌లకు రూ.లక్ష న్నర నుంచి 3లక్షల వరకు, సీపీడబ్ల్యూ స్కీమ్‌కైతే రూ.30లక్షల నుంచి రూ.60 లక్షల వ రకు మెయింటనెన్స్‌కు ఖర్చవుతుంటుంది. వీటిలో విద్యుత్ బిల్లులే అధికంగా ఉంటాయి. సీపీడబ్ల్యూ స్కీమ్‌ల నిర్వహణను జెడ్పీ, చేతిపంపుల మరమ్మతులను మండల పరిషత్‌లు, ఎన్పీ డబ్ల్యూ,పీడబ్ల్యూ స్కీమ్‌ల మరమ్మతు పనులను పంచాయతీలు పర్యవేక్షిస్తుండేవి. ఇప్పటి వరకు ఈ మొత్తాన్ని కేంద్రం ఏటా విడుదల చేసే ఆర్థిక సంఘం నిధుల నుంచి జెడ్పీ, మండల పరిషత్‌లే భరించేవి. 2015-16 నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకే కేటాయించాలని నిర్ణయించడంతో వీటి నిర్వహణ భారాన్ని కూడా పంచాయతీలే భరించాలని సర్కార్ తేల్చి చెప్పింది. జెడ్పీ, మండల పరిషత్‌కు ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు లేకపోవడంతో ఇక నుంచి తాగునీటి పథకాల నిర్వహణ కయ్యేఖర్చుతో పాటు పంచాయతీల్లో ఉండే ప్రభుత్వ భవనాలకు రిపేర్లు, అంతర్గత సీసీ రోడ్లు,డ్రైన్లు, పంచాయతీ కార్యాలయ కంప్యూటరీకరణ వంటి ఆర్థిక సంఘం నిర్దేశించిన పనులన్నింటికి అయ్యే వ్యయాన్ని పంచాయతీలే భరించాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా గతంలో మహానేత వైఎస్సార్ తీసుకున్న నిర్ణయం మేరకు మొన్నటి వరకు ప్రభుత్వం భరించిన విద్యుత్ బిల్లుల చెల్లింపు భారాన్ని కూడా తిరిగి పంచాయతీలకే అప్పగించింది. ఏ స్కీమ్ ద్వారా ఏఏ పంచాయతీల పరిధిలోని గ్రామాలకు తాగునీరందుతుందో ఆయా పంచాయతీలే ఆ స్కీమ్‌ల నిర్వహణ భారం జనాభా ప్రాతిపదికన భరించాలని ప్రభుత్వం ఆదేశించింది. చేతిపంపుల మరమ్మతులు కూడా పంచాయతీలే చేపట్టాలని పేర్కొంది. ఆ మేరకు నిధులను జెడ్పీకి పంచాయతీలు జమచేయాలని ఆదేశించారు. ఈ నిధులను ఆర్‌డబ్ల్యూఎస్‌కు బదలాయించి స్కీమ్‌ల వారీగా నిర్వహణకు ఖర్చు చేయాలని సూచించింది. పనులను పర్యవేక్షించేందుకు ఇందుకోసం స్కీమ్‌ల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీల్లో స్కీమ్ పరిధిలోని పంచాయతీ సర్పంచ్‌లతో పాటు ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వాదేశాల మేరకు ఇటీవల పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులతో జెడ్పీ సీఈవో జయప్రకాష్‌నారాయణ్ సమావేశం నిర్వహించి వారి అంగీకారం తీసుకున్నారు. మెజారిటీ సర్పంచ్‌లు ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించగా, కొందరు మాత్రం తాగునీటి పథకాల నిర్వహణతో పాటు విద్యుత్, టెలిఫోన్ తదితర బిల్లుల చెల్లింపులన్నీ ఈ నిధుల నుంచే మీట్ అవ్వాలంటే ఇక అభివృద్ధి పనులకు ఖర్చు చేసేందుకు ఏం మిగులుతుందని వాపోయారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్కీమ్‌ల నిర్వహణఖర్చులతో పాటు తాత్కాలిక మరమ్మతులకయ్యే మొత్తాన్ని మాత్రృమే భరిస్తాం తప్ప.. పెండింగ్ బిల్లులు, శాశ్వత మరమ్మతులకు ఖర్చు చేసే ప్రసక్తే లేదని వారు తెగేసి చెప్పారు. కాగా జిల్లాలో చాలా వరకు చేతిపంపులు మూలనపడ్డాయి. సీపీడబ్ల్యూ స్కీమ్‌లు పంపులు, ఫిల్టర్ బెడ్స్ పనిచేయక మొరాయిస్తున్నాయి. మరొక పక్క లక్షల్లో పేరుకు పోయిన విద్యుత్ బిల్లులు భయపెడుతున్నాయి. -
ఆధ్యాత్మిక కేంద్రంలో.. చారిత్రక ఘట్టం!
14వ ఆర్థిక సంఘం సమావేశానికి వేదికైన తిరుపతి సాధారణంగా రాజధానిలోనే ఆర్థిక సంఘం సమావేశం విజయవాడలో కోడ్ అమల్లో ఉండటంతో వేదిక మారిన వైనం చారిత్రక ఘట్టానికి ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి వేదికైంది. విభజన తర్వాత రాష్ట్రంలో ప్రధానమైన 14వ ఆర్థిక సంఘం సమావేశానికి తిరుపతి వేదికగా మారింది. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతికి చేరుకున్న 14 ఆర్థిక సంఘం.. శుక్రవారం మొత్తం పలు అంశాలపై రాష్ర్ట ప్రతినిధులతో చర్చించింది. శనివారం ఉదయం పది గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే ఆదా యం రాష్ట్రానికి పంపిణీచేసే ప్రక్రియను ఆర్థిక సంఘం పర్యవేక్షిస్తుంది. రాజ్యాంగంలో 280 వ అధికరణ ద్వారా ఆర్థిక సంఘానికి ప్రత్యేకమైన విధులు, అధికారాలు కల్పించారు. తద్వారా ఆ సంస్థకు రాజ్యాంగ హోదా కల్పిం చారు. 2014-15 నుంచి 2019-20 వరకూ 14వ ఆర్థిక సంఘంచేసే ప్రతిపాదనలు అమ ల్లో ఉంటాయి. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే వైవీ.రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘాన్ని కేంద్రం ఏర్పాటుచేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర నిధుల పంపిణీపై సమావేశాలు నిర్వహించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆర్థిక సంఘాన్ని ఆదేశించారు. ఆ మేరకు 14వ ఆర్థిక సంఘం పర్యటన ఖరారైంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకూ పర్యటించాలని ఆర్థిక సంఘం నిర్ణయిం చింది. ఆర్థిక సంఘం సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించడం సమంజసం కాదని భావించిన ప్రభుత్వం.. తొలుత విజయవాడను వేదికగా ఎంపిక చేసింది. కానీ.. కృష్ణాజిల్లాలోని నంది గామ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. దాంతో.. అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో 14వ ఆర్థిక సంఘం సమావేశాలకు తిరుపతి వేదికగా మారింది. ఢిల్లీ నుంచి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతికి చేరుకున్న 14వ ఆర్థిక సంఘం జిల్లా అధికారయంత్రాంగంతో సమావేశమైంది. గురువారం రాత్రి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. శుక్రవారం ఉద యం పది గంటలకు 14వ ఆర్థిక సంఘంతో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు, ఆర్థికశాఖ కార్యదర్శి పీవీ.రమేష్ తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆర్థిక సంఘం ముందు ఏకరవు పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకూ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో సమావేశమైన ఆర్థిక సంఘం.. వారి ప్రతిపాదనలను స్వీకరించింది. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆర్థిక సంఘం.. నిధుల కేటాయింపులో అభిప్రాయాలను సేకరించింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి 5.30 గంటల వరకూ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. నిధుల కేటాయింపు.. పంపిణీలో రాజకీయపార్టీల అభిప్రాయాలనూ.. సూచనలను సేకరించింది. వీటిని క్రోడీకరించి కేంద్రానికి అక్టోబర్‌లో నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్రం మన రాష్ట్రానికి నిధులను కేటాయించనుంది. శుక్రవారం సమావేశాలు ముగిశాక 14వ ఆర్థిక సంఘం సభ్యులు తిరుపతిలో ఓ ప్రైవేటు హోటల్లో బస చేసి శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. -
నేడు, రేపు తిరుపతిలో 14వ ఆర్థిక సంఘం పర్యటన
తిరుపతి: డాక్టర్ వైవీ రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం గురు, శుక్రవారాల్లో తిరుపతిలో పర్యటించనుంది. 11వ తేదీ గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరుపతికి చేరుకునే కమిషన్ సాయంత్రం 4 గంటలకు జిల్లా పాలనాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో భేటీ అవుతుంది. రాత్రి తిరుపతిలోనే బస చేసి 12న తిరుచానూరు రోడ్డులోని హోటల్ గ్రాండ్ రిడ్జ్‌లో ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్వాగతోపన్యాసంతో రెండోరోజు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 10.35 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. 11 గంటల నుంచి ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ప్రగతికి సంబంధించి సూచించిన కీలక అంశాలపై చర్చ అనంతరం ఫైనాన్స్ కమిషన్ తన స్పందన తెలియజేస్తుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధులతో అనంతరం స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ పక్షాల ప్రతినిధులతో కమిషన్ విడివిడిగా సమావేశమవుతుంది. రాత్రి ఇక్కడే బస చేసి 13 ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టీ బుధవారం పర్యవేక్షించారు. అధికారులంతా తిరుపతికి చిత్తూరు(సెంట్రల్): శుక్రవారం 14వ ఆర్థిక సంఘం సమావేశం తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్లో జరగనున్న విషయం విదితమే. ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులంతా గురువారం సాయంత్రం తిరుపతికి చేరుకోనున్న నేపథ్యంలో వారికి భోజనం, వసతి సౌకర్యాల కల్పన కోసం అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు బుధవారం మధ్యాహ్నం నుంచే తిరుపతికి బయలుదేరి వెళ్లారు. పలువురిని చైర్మన్, సభ్యులకు లైజాన్ అధికారులుగా నియమించారు. దీనికి తోడు ఆయా శాఖలకు సంబంధించిన ప్రభుత్వ కార్యదర్శులు రానున్న నేపథ్యంలో ప్రొటోకాల్ నిబంధనల మేరకు ప్రధాన అధికారులంతా వారి సేవలో ఉండాల్సి ఉంది. దీంతో ప్రతి శాఖాధికారి తప్పనిసరిగా మూడు రోజుల పాటు (గురు, శుక్ర, శని) తిరుపతిలో ఉండేందుకు సిద్ధమై వెళ్లారు. భారీ బందోబస్తు తిరుపతి క్రైం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తిరుపతికి వస్తున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ సిద్ధార్థ జైన్, ఎస్పీ గోపీనాథ్ జట్టి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్ గ్రాండ్ రిడ్జ్కు చేరుకుని సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం అక్కడే భోజన కార్యక్రమం అయిన తరువాత సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరుతారని సమాచారం. పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్లను అణువణువునా బుధవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో జారుుంట్ కలెక్టర్, ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
జెడ్పీలో స్థాయీ సంఘాల ఎన్నిక నేడు
విజయనగరం ఫోర్ట్ : జిల్లా పరిషత్‌లో ఏడు స్థాయీ సంఘాలను నేడు ఎన్నుకోనున్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశంలో ఈ సంఘాలను ఎన్నుకోనున్నారు. ప్రణాళిక , ఆర్థిక సంఘం, గ్రామీ ణాభివృద్ధి, వ్యవసాయం, విద్యా వైద్యం, స్రీ,శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ, పనుల కమిటీలను ఎన్నుకోనున్నారు. ప్రణాళిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్యావైద్య, పనుల కమిటీలకు చైర్మన్‌గా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వ్యవహరిస్తారు. జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు సభ్యులుగా ఉంటారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వ్యవసాయ సంఘం చైర్మన్‌గా, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు సభ్యులుగా వ్యవహరిస్తారు. స్త్రీ,శిశు సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమ సంఘాలకు మహిళా జెడ్పీటీసీలను చైర్మన్‌గా జిల్లా పరిషత్ చైర్పర్సన్ నియమిస్తారు. జిల్లాలో జెడ్పీటీసీలు 34 మంది, ఎంపీలు ముగ్గురు, ఎమ్మెల్యేలు తొమ్మిది మంది, ఎమ్మెల్సీలు ఇద్దరు కలిపి 48 మంది ఉన్నా రు. ఇద్దరు కోఆప్షన్ సభ్యులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. వీరిలో ఆరు కమిటీలకు ఏడుగురు చొప్పన, ఒక కమిటీకి ఎని మిది మంది సభ్యులు ఉం టారు. జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలున్నా యి. వీటిలో 24 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాగా, పది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. నాలుగు కమిటీలే కీలకం: ఏడు కమిటీల్లో నాలుగు కమిటీలే కీలకం. ప్రణాళికఆర్థిక సంఘం, పనులు, విద్యావైద్య, గ్రామీణాభివృద్ధి కమిటీలే కీలకం. కమిటీల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తారా, లేదో వేచిచూడాలి.