సాక్షి, అమరావతి: పంటలకు మెరుగైన ధరలు కల్పించడంతో పాటు రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు 2021–22 ఆర్ధిక సంవత్సరం నుంచి ప్రత్యేకంగా గ్రాంట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ గ్రాంట్లు పొందాలంటే 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలను చేయాల్సి ఉంటుందని షరతు విధించింది. ఈ మేరకు మధ్యంతర నివేదికను విడుదల చేసింది. పంటలకు మెరుగైన ధరలు లభించేలా మార్కెటింగ్ వ్యవస్థను సరళీకరించాలని, దళారీ వ్యవస్థను నిర్మూలించాలని, ప్రైవేట్ వ్యాపారుల మధ్య పోటీతత్వం పెంచాలని స్పష్టం చేసింది. 15వ ఆర్థిక సంఘం ఇంకా ఏయే సిఫార్సులు చేసిందంటే...
- రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే విక్రయించుకునేలా మార్కెటింగ్ రంగంలో సంస్కరణలు తీసుకురావాలి.
- ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 2016, 2017, 2018లో రూపొందించిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. ఇందుకోసం ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లులను పాస్ చేయాలి.
- మార్కెటింగ్ వ్యవస్థలోకి ప్రైవేట్ పెట్టుబడులను తీసుకురావడంతో వ్యవసాయంలో వృద్ధిసాధించొచ్చు.
- కేంద్ర మోడల్ చట్టాలకు వీలుగా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభల్లో బిల్లులను ఆమోదిస్తే 2021–22 నుంచి ఆయా రాష్ట్రాలకుగ్రాంట్లు మంజూరు చేస్తాం.
విద్య, వైద్య రంగాలకు రాయితీలు
అప్పర్ ప్రైమరీ స్కూళ్ల నుంచి సెకండరీ స్కూళ్లకు వచ్చే సరికి చదువుకునే బాలికల సంఖ్య తగ్గిపోతోందని 15వ ఆర్థిక సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. చిన్న వయసులోనే బాలికలు వివాహాలు చేసుకోవడం, గర్భం దాల్చడంతో తల్లీబిడ్డల్లో పౌష్టికాహార లోపాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఈ పరిస్థితిని మార్చడంలో అత్యుత్తమ ఫలితాలు సాధించే రాష్ట్రాలకు 2021–22 నుంచి రాయితీలను సిఫార్సు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు ఇండికేటర్స్‌ను నిర్ధారించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. జాతీయ విద్యా విధానం–2019 ప్రకారం ప్రీ ప్రైమరీ విద్యను అమలు చేసే రాష్ట్రాలకు కూడా రాయితీలను సిఫార్సు చేయనున్నట్లు వెల్లడించింది.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. ప్రభుత్వ రంగంలోని ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకునే రాష్ట్రాలకు 2021–22 నుంచి గ్రాంట్లు మంజూరు చేస్తామని వివరించింది.
- 2021–22లో పోలీసుల శిక్షణ కేంద్రాల ఏర్పాటు, పోలీసుల గృహ నిర్మాణాలకు గాను గ్రాంట్ల మంజూరుకు సిఫార్సులు చేస్తామని, ఈలోగా 2020–21లో పోలీసు శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు స్థలాలను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని ఆర్థిక సంఘం స్పష్టం చేసింది.
న్యాయ వ్యవస్థ పటిష్టానికి నిధులు
కేసుల సత్వర పరిష్కారానికి న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తుది నివేదికలో గ్రాంట్లు మంజూరు చేస్తామని 15వ ఆర్థిక సంఘం వెల్లడించింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, లాయర్స్ హాల్స్, సమాచార కేంద్రాలు, జస్టిస్ క్లాక్స్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వివాదాల పరిష్కార కేంద్రాలు, విలేజ్ లీగల్ ఎయిడ్ క్లినిక్స్, జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అధారిటీల సామర్థ్యం పెంపునకు గ్రాంట్లను సిఫార్సు చేస్తామని పేర్కొంది.
- వాణిజ్య ఎగుమతులను పెంచే రాష్ట్రాలకు రాయితీలను సిఫార్సు చేయాలని ఆర్థిక సంఘం నిర్ణయించింది. ఈ మేరకు నిర్దిష్ట సూచికలను రూపొందించాలని నీతి ఆయోగ్‌కు సూచించింది.
- జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఉత్తమ పనితీరును సాధించిన రాష్ట్రాలకు ఫెర్ఫార్మెన్స్ రాయితీలను ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. ఈ రాయితీలను 2021–22 నుంచి మంజూరు చేయనున్నట్లు పేర్కొంది.
మార్కెటింగ్ సంస్కరణలతో రైతులకు లబ్ధి
Published Mon, Feb 3 2020 4:39 AM | Last Updated on Mon, Feb 3 2020 4:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment