ఆర్థిక సంఘానికి హోదాకు సంబంధం లేదు
- ‘మంథన్ సంవాద్’ సదస్సులో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి స్పష్టీకరణ
- ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం పాటించాలనే నిబంధనేమీ లేదు
- విభజన తరువాత ఏపీ లోటులోకి వెళ్లిపోయింది
- కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి
- జీఎస్టీతో ఇంకా మారే అవకాశముంది
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంఘానికి(ఫైనాన్స్ కమిషన్), ప్రత్యేక హోదాకు ఎటువంటి సంబంధం లేదని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్, 14వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా పనిచేసిన డాక్టర్ వై.వి.రెడ్డి స్పష్టంచేశారు. ఆర్థిక సంఘం సిఫార్సులను ప్రభుత్వం పాటించాలన్న నిబంధన ఏమీ లేదని ఆయన తేల్చిచెప్పారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మంథన్ సంస్థ ఆదివారం వివిధ అంశాలపై ‘మంథన్ సంవాద్’ పేరిట భారీ సదస్సును హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా ‘కేంద్ర, రాష్ట్ర సంబంధాలు’ అనే అంశంపై డాక్టర్ వై.వి.రెడ్డి మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదా, సాధారణ రాష్ట్రాలు అంటూ తేడా లేదని మాత్రమే ఉందని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా రాష్ట్రాలన్నింటినీ ఆర్థిక సంఘం ఒకేలా చూస్తుందన్నారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉందని, ఆంధ్రప్రదేశ్ లోటులోకి వెళ్లిపోయిందని ఆయనీ సందర్భంగా అన్నా రు. తాను పనిచేస్తున్న సమయంలో ఆర్థిక సంఘం ఏ రాష్ట్రాన్నీ... ఎవ్వరినీ సంతృప్తి పరచలేదని... కాబట్టి సమానంగా అసంతృప్తితో ఉంచడమే పనిగా వ్యవహరించామని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో మార్పులు సహజం..
కేంద్రం అనే పదం రాజ్యాంగంలో లేదని... యూనియన్ గవర్నమెంట్ అని మాత్రమే ఉందని వైవీరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాలమధ్య సంబంధాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయని, ఒక్కోసారి ఒక్కోవిధంగా ఉందని అభిప్రాయపడ్డారు. జీఎస్‌టీ వల్ల కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇంకా మారుతాయన్నారు. కేంద్రం మరింత బలపడుతుందన్నారు. ‘‘నెహ్రూ హయాంలో కేంద్రానికి రాష్ట్రాలతో మంచి సంబంధాలుండేవి. నెహ్రూ సీఎంలతో తరచూ మాట్లాడుతూ ఉండేవారు. అయితే రాజ్యాంగం ఏర్పడిన 30 ఏళ్ల తర్వాత కేంద్రంపై రాష్ట్రాల వ్యతిరేకత పెరిగింది. రాష్ట్రాలు కీలకంగా మారాయి. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యాక జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడింది. ఒక ప్రాంతీయ పార్టీ అలా రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ప్రాంతీయ పార్టీలకు, రాజకీయవేత్తలకు తమకంటూ సొంత విధానాలుండేవి.. ఇవి కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపాయి’’ అని అన్నారు. ఏపీలో ఆర్థిక వ్యవహారాలు మొదలు ఆర్‌బీఐ గవర్నర్‌గా, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవాల్ని వైవీరెడ్డి ఈ సందర్భంగా వివరించారు.
ఎవరి ఆహార అలవాట్లు వారివి..
దేశంలో ఎవరి ఆహార అలవాట్లు వారివని... శాకాహారి అంటే ఏదో ప్రత్యేకంగా చూడడం సరికాదని మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ అన్నారు. బీఫ్ తినేవారికి అది వారి ఆహార అలవాటన్నారు. సఫాయి కర్మచారి వృత్తిని రద్దు చేయడంలో ఇప్పటికీ ప్రభుత్వాలు విజయం సాధించలేకపోయాయన్నారు. గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ ఉన్నప్పుడు సఫాయి కర్మచారి పని ఎంతో పవిత్రమైందనే అర్థంలో వ్యాఖ్యానించారంటూ.. దాన్ని తాను ఖండించిన విషయాన్ని విల్సన్ ప్రస్తావించారు. స్మార్ట్ సిటీలే కాదు.. స్మార్ట్ శానిటేషన్ తీసుకురావాలన్నారు. స్వచ్ఛభారత్ కాదని... మన మనస్సులు స్వచ్ఛంగా ఉండాలన్నారు. కులంతో సంబంధం లేకుండా దేశంలో అందరి మనస్సుల్లో బ్రాహ్మణిజం పేరుకుపోయిందన్నారు. దళితుడు సీఎం, రాష్ట్రపతి, న్యాయమూర్తి అయితే దళితుడు అని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని... ఇతర కులాలవారు ఆ స్థాయికొస్తే అలా చెప్పరన్నారు. కలెక్టర్ అయినా కులంతోనే చూసే పరిస్థితి నెలకొందన్నారు.
పోషకాహార లోపంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టట్లేదు: ఆకార్ పటేల్
దేశంలో పోషకాహార లోపంతో ఏటా 5 లక్షలమంది చిన్నారులు మృత్యువాత పడుతున్నా.. ప్రభుత్వాల దృష్టికి రావట్లేదని ప్రముఖ కాలమిస్ట్ ఆకార్ పటేల్ పేర్కొన్నారు. సమాచారం చేరవేతకు ఆంగ్ల భాషను వినియోగిస్తున్న ఉన్నత వర్గాలకు చెందిన 2.5 శాతం మందే దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యారంగంలో సంస్కరణలు రావాల్సిన అవసరముందని అశోక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు ప్రమత్‌రాజ్ సిన్హా అన్నారు. దేశంలో వృద్ధాప్య పింఛన్ తీసుకోవాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని పరిశోధన జర్నలిస్టు అవార్డు గ్రహీత జోసే జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ర్యాపర్, యాక్టివిస్ట్ సోఫియా అషఫ్,్ర మెషిన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్ మనోజ్ సక్సేనా మాట్లాడారు.