ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంపు
♦ రెవెన్యూ లోటు లేని రాష్ట్రాలకు వెసులుబాటు
♦ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం
♦ తెలంగాణకు రూ.2,300 కోట్ల అదనపు రుణానికి అవకాశం
సాక్షి, హైదరాబాద్: ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం(ఎఫ్‌ఆర్‌బీఎం) రుణ పరిమితిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ లోటు లేని రాష్ట్రాలకు ఈ వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో 3శాతం రుణాలు తీసుకునే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ఈ పరిమితి 3 నుంచి 3.5 శాతానికి పెరగనుంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర కేబినేట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణకు అదనంగా రూ.2,300 కోట్లు అప్పు తెచ్చుకునే వెసులుబాటు కలుగుతుంది.
ఏడాదిన్నరగా ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. గుజరాత్ తర్వాత రెవెన్యూ మిగులున్న రాష్ట్రం తెలంగాణ అని, రుణ పరిమితి పెంచాలని లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల అమలుకు ఆర్థికంగా ఒత్తిడిని అధిగమించేందుకు అదనపు ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు వార్షిక రుణ పరిమితిని పెంచాలని, ఈ అప్పును చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉన్నందున కేంద్ర ప్రభుత్వంపై భారం పడే ప్రసక్తి లేదని అందులో పేర్కొంది.
ఎట్టకేలకు కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని సడలించే నిర్ణయం తీసుకోవటం తెలంగాణకు ఊరటనిచ్చే పరిణామం. ఇటీవల ప్రవేశపెట్టిన 2016-17 వార్షిక బడ్జెట్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పెరుగుతుందనే అశాభావంతోనే కేటాయింపులు చేసుకోవటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును రూ.23,467.29 కోట్లుగా చూపించిం ది. రాష్ట్ర జీఎస్‌డీపీలో ఇది 3.5 శాతంగా అంచనా వేసింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అంచనాకు అనుగుణంగా అప్పులు తెచ్చుకునే వెసులుబాటు రాష్ట్రానికి లభించనుంది. గత ఏడాది సైతం 3.49 శాతం మేరకు ద్రవ్యలోటు చూపించిన రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పెంపునకు కేంద్రం అనుమతించకపోవటం భంగపడింది.