57 పురపాలికలకు 158 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరగని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వ నిధుల్లో మళ్లీ కోత పడింది. జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులతో కలిపి రాష్ట్రంలో 69 పురపాలికలు ఉండగా... ఎన్నికలు జరిగిన 57 పురపాలికలకు మాత్రమే తాజాగా 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.158.03 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ఆరు నెలలకు గాను ఇవే పురపాలికలకు రూ.133 కోట్లను విడుదల చేయగా.. తాజాగా తర్వాతి ఆరు నెలల నిధులుగా రూ. 158 కోట్లను విడుదల విడుదల చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.
గడువులోగా ఎన్నికలు జరగని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్, బాదేపల్లి, సిద్దిపేట, చేగుంట, కొల్లాపూర్, అచ్చంపేట, మందమర్రి, మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీలకు నిధులు ఆగిపోయాయి. ఎన్నికలు నిర్వహించిన తర్వాతే వాటికి నిధులు విడుదలయ్యే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.