మీ నిధులు.. మా ఇష్టం
మీ నిధులు.. మా ఇష్టం
Published Wed, Aug 2 2017 2:10 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
పంచాయతీల సొమ్ములపై రాష్ట్రప్రభుత్వ పెత్తనం..
14వ ఆర్థిక సంఘం నిధులపై ఆంక్షలు.. రాజ్యాంగాన్ని పరిహసిస్తూ ఉత్తర్వులు
- ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెడితేనే నిధులు
- ఇంటి పన్నుల రూపంలో వసూలైన సొమ్ముపైనా అదుపు
- గ్రామాల్లో చెత్త సేకరణకు షెడ్లు నిర్మించాలి
- ఫొటోలిస్తేనే నిధులు
- నిధులు అందుబాటులో లేక పంచాయతీల అవస్థలు
- ఆంక్షలపై సర్పంచ్‌ల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఆర్థిక సంఘం నిధులనేవి గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. గ్రామ పంచాయతీలకు ఆర్ధిక సంఘం ద్వారా కేంద్ర నిధులందాలని, అపుడే అవి పరిపుష్టమై గ్రామ స్వరాజ్య స్వప్నం సాకారమౌతుందని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. 1994లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరహాలో గ్రామ పంచాయతీలకు సైతం స్వయం ప్రతిపత్తిని కల్పించారు. కేంద్రం ఇచ్చే నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కూ ఉండదు. దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాజ్యాంగ స్ఫూర్తిని పట్టపగలే పరిహాసం చేస్తోంది. 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులపై పెత్తనమంతా తమదే అంటోంది. తాము చెప్పినట్లు చేస్తేనే ఆ నిధులు తీసుకోవాలంటూ ఆంక్షలు విధిస్తోంది. దీంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేక సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు. ఇవెక్కడి ఆంక్షలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థికసంఘం నిధులు సర్పంచ్‌లకు ఇవ్వొద్దు..
కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను సంబంధిత సర్పంచులకు ఇవ్వొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల్లో వసూలు చేసి, ట్రెజరీల్లో జమ చేసిన ఇంటి పన్నుల సొమ్ము వినియోగంపైనా ఆంక్షలు విధించింది. కేంద్రం విడుదల చేసిన నిధులను, పంచాయతీల సొంత సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులు, గ్రామాల్లో వసూలు చేసిన ఇంటి పన్నుల డబ్బును గ్రామ పంచాయతీల తీర్మానాలకు అనుగుణంగా ఖర్చు పెట్టుకోవడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సర్పంచ్‌లకు చెక్ పవర్‌ను కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కును హరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
షెడ్ల నిర్మాణం పంచాయతీల పనేనట!
‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సేకరించిన చెత్తను ఒక చోట చేర్చేందుకు షెడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ షెడ్లను పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నిర్మించాల్సి ఉంటుంది. కానీ, కేంద్రం ఇచ్చిన నిధులతోపాటు పంచాయతీల సొంత నిధులను వీటి నిర్మాణం కోసం వెచ్చించాలని ప్రభుత్వం అధికారుల ద్వారా సర్పంచ్‌లపై ఒత్తిడి తీసుకొచ్చింది. అత్యధిక శాతం సర్పంచులు దీన్ని వ్యతిరేకించడంతో ఆంక్షలను తెరపైకి తెచ్చింది. గ్రామ పంచాయతీల పేరిట ఉన్న నిధులను ఆయా సర్పంచ్‌లు డ్రా చేసుకునే వీల్లేకుండా ట్రెజరీలపై ఆంక్షలు విధించింది. ఇందుకు సంబంధించి కొన్ని జిల్లాల్లో మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్పష్టమైన ఉత్తర్వులిచ్చేశారు.
ట్రెజరీల్లో పంచాయతీల సొమ్ము రూ.1,449 కోట్లు
రాష్ట్రంలోని 12,920 గ్రామ పంచాయతీల పేరుతో ప్రస్తుతం ఖజానాలలో(ట్రెజరీ) దాదాపు రూ.1,449 కోట్ల నిధులున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2016–17లో కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు దాదాపు రూ.1,463 కోట్లు నేరుగా విడుదల చేసింది. ఈ నిధుల్లో ఎక్కువ భాగం ఆర్థిక సంవత్సరం చివరన అంటే ఈ ఏడాది మార్చిలో ఇచ్చింది. సర్పంచ్‌లు ఇప్పటిదాకా డ్రా చేసిన నిధులు పోగా.. ప్రస్తుతం దాదాపు రూ.900 కోట్లు గ్రామ పంచాయతీల పేరిట ట్రెజరీల్లో ఉన్నట్లు సమాచారం. దీనికితోడు గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను రూపంలో వసూలు చేసిన రూ.549 కోట్లను మార్చి నెలలోనే ట్రెజరీల్లో జమ చేశాయి. కేంద్రం ఇచ్చినవాటితో పాటు పంచాయతీల సొంత నిధులను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెడితేనే వాటిని ట్రెజరీల నుంచి పొందే అవకాశం కల్పిస్తామంటూ సర్కార్ ఆంక్షల అడ్డుగోడ నిర్మించింది.
చెల్లింపులు నిలిపివేత
గ్రామ పంచాయతీల నిధుల చెల్లింపులపై జూలై 27వ తేదీ నుంచి ట్రెజరీల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ సర్పంచ్‌లకు నిధులు విడుదల చేయొద్దంటూ ప్రభుత్వం తేల్చిచెప్పింది. సాధారణ నిధుల నుంచి పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల చెల్లింపులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. చెత్త సేకరణ షెడ్ల నిర్మాణం పూర్తి చేసి, సంబంధిత ఫోటోలను సమర్పిస్తేనే ట్రెజరీల నుంచి నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే.. షెడ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి, వాటిని ఫొటోలు తీసి ఇస్తేనే ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల చేతికొస్తాయన్నమాట! వర్షాకాలంలో గ్రామాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా, వ్యాధులు ప్రబలకుండా మురుగు కాల్వలను శుభ్రం చేసుకోవడానికి కూడా నిధులు అందుబాటులో లేకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి లోకేశ్ వింత నిర్ణయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్ పంచాతీయరాజ్ శాఖ మంత్రిగా కుర్చీ ఎక్కాక ఈ శాఖలో ఎన్నడూ లేని వింత పోకడలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి లోకేశ్ తన మనసుకు తోచిందే తడవుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారులు ఆయనకు ఎదురు చెప్పలేక ప్రతి నిర్ణయానికీ తలూపుతున్నారు. అందుకే రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు.
Advertisement