సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా పరిషత్‌ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం తలసరి నిధుల్లో గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు కూడా నిధులను కేటాయించింది. ఈ మేరకు ఇప్పటికే ఖరారు చేసిన నిష్పత్తి ఆధారంగా తొలి త్రైమాసికానికి సంబంధించిన నిధులను రాష్ట్రానికి విడుదల చేయగా.. వాటిని జనాభా ప్రాతిపదికన జిల్లాలకు పంపిణీ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది రూ.1,847 కోట్లు ఖరారు చేయగా.. ఇందులో మొదటి విడత (తొలి త్రైమాసికం)గా రూ.308 కోట్లు విడుదల చేసింది.
జెడ్పీ 5%, ఎంపీపీలకు 10% నిధులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. 2014–15లో అమలు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. దీంతో మండల, జిల్లా పరిషత్‌లకు నిధుల కొరత ఏర్పడింది. కేవలం సీనరేజీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ నిధులపైనే ఆధారపడాల్సి వచ్చింది. నిధుల కటకటతో నీరసించిన జెడ్పీ, ఎంపీపీలకు కూడా కొంతమేర కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయడంతో వీటికి ఊరట లభించింది. గ్రామ పంచాయతీలకు 75 శాతం, మండల పరిషత్‌లకు 10 శాతం, జిల్లా పరిషత్‌లకు 5 శాతం నిష్పత్తిలో నిధులు పంచాలని నిర్ణయించింది.
దీంతో తొలి త్రైమాసికానికి సంబంధించి రూ.461.75 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతి మంజూరు చేసిన కేంద్రం.. టైడ్ గ్రాంట్ కింద రూ.308 కోట్లు విడుదల చేసింది. వీటిలో జిల్లా పరిషత్‌లకు రూ.1,026.11 లక్షలు, మండల పరిషత్‌లకు రూ.2,052.20 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.27,721.67 లక్షలను నిర్దేశించింది. వీటిని సాధారణ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ల కింద వినియోగించుకోవాలని సూచించింది. ఈ నిధులతో తాగునీటి సౌకర్యాల కల్పన, వాననీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, డోర్‌టుడోర్ చెత్త సేకరణ, కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రం, ప్లాస్టిక్ సేకరణ, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్‌రావు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment