ఆధ్యాత్మిక కేంద్రంలో.. చారిత్రక ఘట్టం!
- 14వ ఆర్థిక సంఘం సమావేశానికి వేదికైన తిరుపతి
- సాధారణంగా రాజధానిలోనే ఆర్థిక సంఘం సమావేశం
- విజయవాడలో కోడ్ అమల్లో ఉండటంతో వేదిక మారిన వైనం
చారిత్రక ఘట్టానికి ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి వేదికైంది. విభజన తర్వాత రాష్ట్రంలో ప్రధానమైన 14వ ఆర్థిక సంఘం సమావేశానికి తిరుపతి వేదికగా మారింది. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతికి చేరుకున్న 14 ఆర్థిక సంఘం.. శుక్రవారం మొత్తం పలు అంశాలపై రాష్ర్ట ప్రతినిధులతో చర్చించింది. శనివారం ఉదయం పది గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే ఆదా యం రాష్ట్రానికి పంపిణీచేసే ప్రక్రియను ఆర్థిక సంఘం పర్యవేక్షిస్తుంది. రాజ్యాంగంలో 280 వ అధికరణ ద్వారా ఆర్థిక సంఘానికి ప్రత్యేకమైన విధులు, అధికారాలు కల్పించారు. తద్వారా ఆ సంస్థకు రాజ్యాంగ హోదా కల్పిం చారు. 2014-15 నుంచి 2019-20 వరకూ 14వ ఆర్థిక సంఘంచేసే ప్రతిపాదనలు అమ ల్లో ఉంటాయి. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే వైవీ.రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘాన్ని కేంద్రం ఏర్పాటుచేసింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర నిధుల పంపిణీపై సమావేశాలు నిర్వహించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆర్థిక సంఘాన్ని ఆదేశించారు. ఆ మేరకు 14వ ఆర్థిక సంఘం పర్యటన ఖరారైంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకూ పర్యటించాలని ఆర్థిక సంఘం నిర్ణయిం చింది. ఆర్థిక సంఘం సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించడం సమంజసం కాదని భావించిన ప్రభుత్వం.. తొలుత విజయవాడను వేదికగా ఎంపిక చేసింది. కానీ.. కృష్ణాజిల్లాలోని నంది గామ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. దాంతో.. అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.
ఈ నేపథ్యంలో 14వ ఆర్థిక సంఘం సమావేశాలకు తిరుపతి వేదికగా మారింది. ఢిల్లీ నుంచి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతికి చేరుకున్న 14వ ఆర్థిక సంఘం జిల్లా అధికారయంత్రాంగంతో సమావేశమైంది. గురువారం రాత్రి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. శుక్రవారం ఉద యం పది గంటలకు 14వ ఆర్థిక సంఘంతో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు, ఆర్థికశాఖ కార్యదర్శి పీవీ.రమేష్ తదితరులు సమావేశమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆర్థిక సంఘం ముందు ఏకరవు పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకూ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో సమావేశమైన ఆర్థిక సంఘం.. వారి ప్రతిపాదనలను స్వీకరించింది. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆర్థిక సంఘం.. నిధుల కేటాయింపులో అభిప్రాయాలను సేకరించింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి 5.30 గంటల వరకూ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమైంది.
నిధుల కేటాయింపు.. పంపిణీలో రాజకీయపార్టీల అభిప్రాయాలనూ.. సూచనలను సేకరించింది. వీటిని క్రోడీకరించి కేంద్రానికి అక్టోబర్‌లో నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్రం మన రాష్ట్రానికి నిధులను కేటాయించనుంది. శుక్రవారం సమావేశాలు ముగిశాక 14వ ఆర్థిక సంఘం సభ్యులు తిరుపతిలో ఓ ప్రైవేటు హోటల్‌లో బస చేసి శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.