హెచ్‌ఎండీఏ మెడపై ఐటీ కత్తి!
ఈ నెల 12లోగా 471 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు
దిక్కుతోచని స్థితిలో మహానగరాభివృద్ధి సంస్థ
హైదరాబాద్: ఆదాయ పన్ను శాఖ అకస్మాత్తుగా హెచ్‌ఎండీఏకు మళ్లీ షాక్ ఇచ్చింది. ఈ నెల 12లోగా ఐటీ బకాయిలు రూ. 471 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ అందులో హెచ్చరించింది. గతంలో హైకోర్టు ఎటువంటి స్టే ఉత్తర్వులు ఇవ్వలేదని, చట్ట నిబంధనలకు భాష్యం మాత్రమే చెప్పిందని పేర్కొంటూ ఆదాయ పన్ను బకాయిలు చెల్లించాల్సిందేనని హెచ్‌ఎండీఏకు ఆదేశించింది. ‘ప్రభుత్వ స్థలాలు అమ్మిపెట్టిన పాపానికి మేము ఐటీ బకాయిలు చెల్లించడమేంటీ..? ఆ భూముల అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును ఎప్పుడో ప్రభుత్వ ఖజానాకు జమ చేశాం.
స్వార్జితం కాని సొమ్ముకు కూడా ఆదాయపు పన్ను చెల్లించాలని ఆ శాఖ నోటీ సులివ్వడం ఎంతవరకు సమంజసం’ అంటూ హెచ్‌ఎండీఏ అధికారులు వాదిస్తున్నారు. అయితే... ఆదాయ పన్ను శాఖ మాత్రం ఈ వాదనతో ఏకీభవించట్లేదు. రికార్డుల ప్రకారం ఆ భూములను హెచ్‌ఎండీఏ విక్రయించి ఆదాయం సమకూర్చుకుంది. ఆ నిధులు ఏం చేశారన్నది తమకు సంబంధం లేదు. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ నిబంధన ప్రకారం సమకూరిన ఆదాయంలో 30 శాతం పన్ను చెల్లించాల్సిన బాధ్యత హెచ్‌ఎండీఏదేనని ఐటీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఉపకారానికి పోతే ఊబిలో కూరుకు పోయినట్లయిందని హెచ్‌ఎండీఏ అధికారులు వాపోతున్నారు.