
ఇదెక్కడి చేయూత
ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు అందని రాయితీలు
రూ.కోటికి పైగా పేరుకుపోయిన బకాయిలు
పరిశ్రమలకు స్వర్గధామం ఏపీ. ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఫలానా పరిశ్రమ పెట్టుకుంటామని దరఖాస్తు చేస్తే చాలు. అన్ని అనుమతులు చకచకా ఇచ్చేస్తాం.. అన్ని రాయితీలు ఇస్తాం.. అంటూ సర్కా రు చెప్పుకుం టున్న గొప్పలు నీటి మీద రాతలేనని తేలిపోతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికులకు ప్రభుత్వ ఆసరా కాగితాలకే పరిమితమవుతోంది. రాయితీల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు.
విశాఖపట్నం: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎన్నో రాయితీలు పొందే అవకాశం ఉంది. పెట్టుబడితోపాటు స్టాంప్ డ్యూటీ, పావలా వడ్డీ, సేల్స్ ట్యాక్స్, పవర్ టారిఫ్ ఇలా వివిధ రకాల రాయితీలు కల్పించాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉంది. అలాగే వారికి అవసరమైన ఆర్థిక చేయూతనివ్వడంతో పాటు కావాల్సిన స్థలం కేటాయింపు విద్యుత్ తదితర అన్ని విషయాల్లో రాయితీలు కల్పించాలి. అయితే జిల్లాలో గత ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నేటికీ వివిధ రాయితీలు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో వారంతా పరిశ్రమల స్థాపనకు చేసిన అప్పులు తీర్చే దారిలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
పెట్టుబడిలో 35 శాతం రాయితీగా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ విధంగా మూడు కంపెనీలకు రూ.20 లక్షల మేర పెట్టుబడి రాయితీ రావాల్సి ఉంది. అలాగే స్టాంప్‌డ్యూటీలో 50 శాతం, ల్యాండ్ కాస్ట్‌లో 25 శాతం రాయితీ కింద చెల్లించాల్సి ఉంటుంది. రెండు కంపెనీలకు రూ.70వేల వరకు రావాల్సి ఉండగా, పావలా వడ్డీ స్కీమ్‌లో భాగంగా ఇంట్రస్ట్ సబ్సిడీ కింద రూ.3.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. సేల్స్ టాక్స్ కింద మూడు కంపెనీలకు రూ.50 లక్షల మేర రాయితీ విడుదల కావాల్సి ఉంది. పవర్ టారిఫ్ రాయితీ కింద ఓ కంపెనీకి రూ.3 వేల వరకు విడుదల కావాల్సి ఉంది.
మరికొన్ని కంపెనీలకు రూ.50 లక్షల మేర వివిధ రాయితీల కింద ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సి ఉంది. గత రెండేళ్లుగా తిరుగుతున్నా రాయితీ సొమ్ము విడుదలలో సర్కార్ చిన్నచూపు చూస్తోందని ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు.