ముంబై: భారత్ బ్యాంకుల స్థూల మొండిబకాయిలు (జీఎన్‌పీఏ) సెప్టెంబర్ 2022 నాటికి 5 శాతానికి తగ్గాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక ఒకటి తెలిపింది. ‘బ్యాంకింగ్ ఇన్ ఇండియా– ట్రెండ్స్ అండ్ పోగ్రెస్’ శీర్షికన విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు..
►2017–18 ఆర్థిక సంవత్సరంలో గరిష్ట స్థాయికి చేరిన స్థూల మొండిబకాయిలు అటు తర్వాత క్రమంగా దిగివచ్చాయి. 2022 మార్చిలో ఇది 5.8 శాతానికి తగ్గింది.
►చెల్లింపుల్లో వైఫల్యాలు తగ్గడం, రికవరీలు మెరుగుపడ్డం, బకాయిల మాఫీ (రైటాఫ్) వంటి అంశాలు స్థూల మొండిబకాయిలు తగ్గడానికి కారణం.ప్రస్తుతం బ్యాంకింగ్ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడుతోంది. రుణ నాణ్యత పెరిగింది. మూలధన నిల్వలు పటిష్టంగా ఉన్నాయి. అయితే వడ్డీరేట్ల పెరుగుదల, ఆర్థిక మందగమనం వంటి అంశాలు బ్యాంకింగ్ రంగంపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. రుణ వృద్ధి రేటు మరెంతో మెరుగుపడాల్సి ఉంది. రుణ పునర్‌వ్యవస్థీకరణ మొత్తంగా 1.1 శాతం పెరిగితే, బడా రుణ గ్రహీతలకు సంబంధించి ఇది 0.5 శాతంగా ఉంది. వ్యక్తిగత రుణాలు, చిన్న వ్యాపాలకు సహాయం చేయడానికి సంబంధించి ప్రవేశపెట్టిన రుణ పునర్‌వ్యవస్థీకరణ స్కీమ్‌ల వల్ల తగిన ప్రయోజనాలు ఒనగూరుతున్నాయి. దేశీయంగా బ్యాంకుల స్థూల మొండిబకాయిలు తగ్గుముఖం పడితే, విదేశీ బ్యాంకుల విషయంలో పెరగడం గమనార్హం. 2020–21లో ప్రైవేటు బ్యాంకుల జీఎన్‌పీఏలు 0.2 శాతం ఉంటే, 2021–22లో 0.5 శాతానికి చేరాయి.
బ్యాంకింగ్‌లో 2020–21 మంచి యూ టర్న్ తీసుకుంది. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది.
► 2022–23 మొదటి ఆరు నెలల్లో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్‌లో మంచి పురోగతి నెలకొంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పీఏ) కట్టడికి తీసుకున్న చర్యల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది.
►వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి.
►ఇక గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ. 8,16,421 కోట్ల రుణ మాఫీ చేశాయి. మొత్తం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల (ఎస్‌సీబీలు) విషయంలో ఈ విలువ రూ. 11,17,883 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment