సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణలో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ ఇచ్చిన సమాధానాలు, సీబీఐ డీఐజీ మనీశ్ సిన్హా వేసిన పిటిషన్‌లోని అంశాలు బయటకు పొక్కడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరెవరో వచ్చి తమకిష్టమొచ్చిన విషయాలను చెప్పేసి వెళ్లిపోయే స్థలం సుప్రీంకోర్టు కాదని సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. సీవీసీ తరఫు న్యాయవాది సహా ఎవ్వరి వాదనలూ ఇప్పుడు తాము వినదల్చుకోలేదనీ, అలోక్ వర్మ స్పందన, సిన్హా ఆరోపణలు బయటకు పొక్కడంపైనే మాట్లాడతామని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.
‘ఈ రోజు మీరు ఒక్క పదం కూడా మాట్లాడకండి. మేం మీ వాదన వినం’ అని సీజేఐ గొగోయ్ అలోక్ వర్మ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్‌తో అన్నారు. అలోక్‌వర్మపై అవినీతి ఆరోపణలకు సంబంధించి సీవీసీ ప్రాథమిక విచారణలోని అంశాలపై గోప్యత పాటించాలని గతంలోనే తాము ఈ కేసులోని కక్షిదారులను కోరామని కోర్టు గుర్తుచేసింది. సీబీఐ నైతికత, గౌరవాలను కాపాడేందుకే తాము ఆ ఆదేశాలిచ్చామనీ, కానీ ఆ విషయాలు మీడియాలో వచ్చాయంది.
సీబీఐ డీఐజీ మనీశ్ సిన్హా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి లంచం తీసుకున్నారనీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై విచారణను అడ్డుకున్నారనీ, న్యాయ శాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర మధ్యవర్తిగా వ్యవహరించారని సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ విషయాలు బయటకు రావడంపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ గౌరవాన్ని కాపాడాలని తాము ప్రయత్నిస్తుంటే కక్షిదారులు అన్నీ బహిరంగంగా చెప్పేస్తున్నారని న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
రెండుసార్లు విచారణ..
మంగళవారం ఉదయం తొలిసారి విచారణ ప్రారంభమైన వెంటనే ‘ద వైర్’ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనం ప్రతిని అలోక్ వర్మ తరఫు న్యాయవాది ఫాలీ నారిమన్‌కు న్యాయవాదులు అందించి, ఆయన స్పంద నను కోరారు. వర్మ తరఫు మరో లాయర్ గోపాల్ శంకరనారాయణన్ సోమవారం వర్మ స్పందనను సమర్పించేందుకు మరికొంత సమయం అడగడాన్ని నారిమన్ ప్రశ్నించారు. తర్వాత కోర్టు ‘విచారణను జరిపించుకునేందుకు మీలో అర్హులున్నారని మేం అనుకోవడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కొన్ని నిమిషాలకే నారిమన్ మళ్లీ కోర్టు లోపలకు వచ్చి విచారణను కొనసాగించాలని కోరడంతో కోర్టు సమ్మతించింది. నారిమన్ వాదిస్తూ ‘ఈ కథనం నవంబర్ 17న ప్రచురితమైంది. ఇది సీవీసీ విచారణలో అలోక్ ఇచ్చిన సమాధానాలకు సంబంధించినది. సీవీసీ విచారణపై స్పందన తెలపాల్సిందిగా అంతకుముందు రోజే కోర్టు వర్మను కోరింది’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment