అలోక్ వర్మ ఇంటి వద్ద నిఘా అధికారులను అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది, హోం శాఖ కార్యాలయం వద్ద నాగేశ్వరరావు
న్యూఢిల్లీ: ప్రభుత్వం సెలవుపై పంపిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ నివాసం బయట నలుగురు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారులు తచ్చాడుతూ కనిపించడం గురువారం సంచలనం సృష్టించింది. అయితే వారక్కడ రోజువారీ రహస్య విధులు నిర్వర్తిస్తున్నారని కేంద్ర హోం శాఖ పేర్కొంది. రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు అలోక్ వర్మ ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారు తమ సిబ్బందే అని ఐబీ ధ్రువీకరించింది. సున్నిత ప్రాంతాల్లో ఐబీ బృందాలు రహస్యంగా నిఘా విధులు నిర్వర్తించడం సాధారణ విషయమేనని హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొన్నిసార్లు స్థానిక పోలీసుల సహకారంతోనే ఇలా చేస్తామని, కొన్ని సందర్భాల్లో మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చేపడతామని చెప్పారు.
‘ఐడీ కార్డులు, ఇతర సరంజామా లేకుండా జరిపే సాధారణ నిఘాకు ఇది పూర్తిగా భిన్నమైనది. అలోక్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు నివాసముండే జన్‌పథ్ రోడ్డులో కొందరు అసాధారణంగా గుమిగూడి ఉండటాన్ని గమనించి, ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఐబీ సిబ్బంది అక్కడికి వెళ్లారు. కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని సదరు అధికారి వివరణ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌లు కూడా అలోక్ వర్మ నివాసం సమీపంలోనే నివసిస్తున్నారు. ఐబీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పగా, అలాంటిదేం లేదని స్థానిక డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు. సీబీఐ డైరెక్టర్ నివాసం వద్ద ఏదో గొడవ జరిగినట్లు సమాచారం అందిందని, ఆ నలుగురి గుర్తింపును ధ్రువీకరించుకున్న తరువాత వారిని వదిలిపెట్టినట్లు చెప్పారు.
భయాందోళనలో ప్రధాని: రాహుల్
ఫ్రాన్స్‌తో కుదిరిన రఫేల్ ఒప్పందంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ సన్నద్ధమవుతున్నందనే, భయంతో మోదీ రాత్రికి రాత్రే అలోక్ ను విధుల నుంచి తప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా వాచ్‌మన్‌గా ఉంటానని మోదీ చేసిన వ్యాఖ్యల్ని హేళనచేశారు. ‘రెండు రోజుల క్రితం వాచ్‌మన్ ఓ కొత్త పనిచేశారు. అది మధ్యాహ్నం కాదు. ప్రజలంతా నిద్రిస్తుండగా అర్ధరాత్రి జరిగింది’ అని సీబీఐలో చోటుచేసుకున్న పరిణామాల్ని ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, అలోక్ వర్మ అధికారాలను పునరుద్ధరించాలని, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని సీబీఐ కార్యాలయాల ముందు ధర్నా ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
సీబీఐ జగడంపై విచారణ నేడే
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రభుత్వం తన అధికారాలు తొలగిస్తూ, సెలవుపై పంపడాన్ని సవాలుచేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుకు తాత్కాలికంగా డైరెక్టర్ పదవి కల్పించడంపై స్టే ఇవ్వాలని కూడా ఆయన పిటిషన్‌లో కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది.
రాజకీయంగా కూడా కీలకం..
సీబీఐ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట కోర్టు నిర్ణయం సీబీఐకే కాకుండా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లకు కూడా కీలకం కానుంది. ‘సీబీఐ పంజరంలోని చిలక’ అని లోగడ వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీబీఐ డైరెక్టర్ పదవికి చట్టం నిర్దేశించిన రెండేళ్ల పదవీకాలాన్ని కేంద్రం ఏకపక్షంగా తగ్గించిందని, కాబట్టి కేసు తమ వైపే నిలుస్తుందని అలోక్ వర్మ లాయర్ల బృందం గట్టి విశ్వాసంతో ఉంది. రఫేల్ యుద్ధవిమానాల కుంభకోణంపై విచారణకు ఆసక్తి చూపుతున్నందుకే కాకుండా, ప్రధాని మోదీకి సన్నిహితుడైన రాకేశ్ అస్థానాను కాపాడటానికే వర్మను కేంద్రం విధుల నుంచి తప్పించిందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారం చేస్తోంది. సీబీఐ అధికార వర్గంలో మార్పుపై బీజేపీ వాదన మరోలా ఉంది. అవినీతిని అసలు సహించబోమనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానానికి తాజా నిర్ణయం ఒక ఉదాహరణగా ఆ పార్టీ సమర్థించుకుంది.
అలోక్ వర్మనే డైరెక్టర్..అస్థానానే స్పెషల్ డైరెక్టర్
అవినీతి ఆరోపణలతో అధికారాలు కోల్పోయిన అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాలు ఇంకా తమ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని సీబీఐ స్పష్టం చేసింది. నాగేశ్వరరావుకు అప్పగించిన డైరెక్టర్ బాధ్యతలు తాత్కాలికమేనని తెలిపింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ సిఫార్సుల మేరకే వర్మ, అస్థానాలను సెలవుపై పంపి, నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది. అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలపై సీవీసీ విచారణ ముగిసే వరకు సీబీఐ బాధ్యతల్ని నాగేశ్వరరావు చూస్తారని వెల్లడించింది. సీబీఐకి సంబంధించిన ఏడు దస్త్రాలను తొలగించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆ సంస్థ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. సీబీఐలో ప్రతి దశలోని అన్ని కీలక పత్రాలు భద్రంగా ఉన్నాయని, ఇలాంటి బూటకపు వార్తలు సీబీఐ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అన్నారు. అలోక్ వర్మను విధుల నుంచి తప్పించిన సమయంలో రఫేల్ ఒప్పందం సహా పలు కీలక కేసులు ఆయన పరిశీలనలో ఉన్నట్లు మీడియాలో వచ్చిన వార్తల్ని తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment