సీబీఐ డైరెక్టర్ ‘ఇంటి’ గుట్టు | CBI denies report its Director meeting tel co officials | Sakshi
Sakshi News home page

సీబీఐ డైరెక్టర్ ‘ఇంటి’ గుట్టు

Published Wed, Sep 3 2014 12:29 AM | Last Updated on Mon, Aug 13 2018 8:27 PM

సీబీఐ డైరెక్టర్ ‘ఇంటి’ గుట్టు - Sakshi

సీబీఐ డైరెక్టర్ ‘ఇంటి’ గుట్టు

న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా మరో వివాదంలో చిక్కకున్నారు. 2జీ కేసులో సంచలన విషయాలు బయటపడడానికి కారణమైన సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్(సీపీఐఎల్) అనే స్వచ్ఛంద సంస్థ మంగళవారం సిన్హా ‘ఇంటి’గుట్టు బయటపెట్టింది. సిన్హా ఇంటి ప్రవేశ రిజిస్టర్ వివరాలను సుప్రీంకోర్టుకు అందజేసింది. అందులో ఆందోళనకు గురిచేసే, 2జీ కేసులో న్యాయ పాలనకు అడ్డొచ్చే విధ్వంసకర విషయాలున్నాయంటూ సీపీఐఎల్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టులో పేర్కొన్నారు. 2జీ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ ఉన్నతాధికారులు.. గత 15 నెలలుగా సీబీఐ డెరైక్టర్ సిన్హాను ఆయన నివాసంలో కలిసినట్లుగా వచ్చిన వార్తలను కోర్టు దృష్టికి తెచ్చారు.

 

ఆ ఇంటి రిజిస్టర్‌లోని వివరాలను ఆయన చదవబోతుండగా.. సీబీఐ న్యాయవాది వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ రిజిస్టర్‌లో వివరాలను బహిరంగంగా వెల్లడించొద్దని, అఫిడవిట్ రూపంలో అందించాలని కోరారు. డీఎంకే తరఫు సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కూడా ఆయనకు మద్దతు పలికారు. తదుపరి విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
 
 2జీ కేసులో ఎస్‌పీపీగా ఆనంద్ గ్రోవర్
 
 2జీ స్పెక్ట్రమ్ కేసు విచారణలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా (ఎస్‌పీపీ) సీనియర్ అడ్వొకేట్ ఆనంద్ గ్రోవర్‌ను సుప్రీంకోర్టు మంగళవారం నియమించింది. ఇప్పటివరకూ ఈ బాధ్యతలు నిర్వహించిన మరో సీనియర్ అడ్వొకేట్ యు.యు. లలిత్ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. దీంతో లలిత్ స్థానంలో గ్రోవర్‌ను ఎస్‌పీపీగా నియమించాలంటూ సీనియర్ అడ్వొకేట్, సీబీఐ తరఫు న్యాయవాది కె.కె. వేణుగోపాల్ చేసిన ప్రతిపాదనకు జస్టిస్ హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement