సీబీఐ చీఫ్ గా ఏకే సిన్హా | Anil sinha appointed as CBI director | Sakshi
Sakshi News home page

సీబీఐ చీఫ్ గా ఏకే సిన్హా

Published Wed, Dec 3 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

సీబీఐ చీఫ్ గా ఏకే సిన్హా

సీబీఐ చీఫ్ గా ఏకే సిన్హా

న్యూఢిల్లీ: నూతన సీబీఐ డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ స్పెషల్ డెరైక్టర్ అనిల్ కుమార్ సిన్హాను ప్రభుత్వం ఎంపిక చేసింది. కొత్త సీబీఐ చీఫ్ ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం ప్రధాని నివాసంలో సమావేశమైంది. ప్రధాని మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తులతో కూడిన కొలీజియం 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఏకే సిన్హా పేరును సిఫారసు చేసింది.

సీబీఐ డెరైక్టర్‌గా మంగళవారం పదవీ విరమణ చేసిన రంజిత్ సిన్హా వలె.. కొత్త సీబీఐ చీఫ్ కూడా బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారే కావడం విశేషం. సీబీఐలో రెండో అత్యున్నత హోదాలో(స్పెషల్ డెరైక్టర్)లో ఇప్పటివరకు ఉన్న ఏకే సిన్హా.. పలు అక్రమాస్తుల కేసుల దర్యాప్తులో పాలు పంచుకున్నారు. ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)లో డీఐజీ, ఐజీ హోదాల్లో పనిచేశారు. విజిలెన్స్ కమిషన్‌లో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహించారు. లోక్‌పాల్ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత సీబీఐ డెరైక్టర్‌గా నియమితుడైన మొదటి అధికారి సిన్హానే కావడం విశేషం. ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఈ ముగ్గురు ఉన్న కమిటీ సిఫారసు చేసిన వారినే సీబీఐ చీఫ్‌గా నియమించాలని లోక్‌పాల్ చట్టంలో పొందుపర్చారు. అంతకుముందు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ నేతృత్వంలోని కమిటీ ఆ సిఫారసు చేసేది.
 


 హెడ్‌లైన్లలో నిలిపిన మీడియాకు థ్యాంక్స్!
 
 వీడ్కోలు కార్యక్రమంలో రంజిత సిన్హా
 సీబీఐ డెరైక్టర్‌గా పదవీవిరమణ
 
 న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్‌గా 1974 బ్యాచ్ బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి రంజిత్ సిన్హా మంగళవారం రిటైర్ అయ్యారు. పదవీవిరమణ సందర్భంగా సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను తీసుకున్న నిర్ణయాలన్నీ సంస్థ ప్రయోజనాల కోసమేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇంత వివాదాస్పద పరిస్థితుల్లో పదవీవిరమణ చేయాలని ఎవరూ కోరుకోరంటూ వ్యాఖ్యానించారు. ‘నా విజయాల ఆధారంగా కాదు.. ఎన్ని సార్లు పడిలేచానో చూసి నన్ను జడ్జ్ చేయండి’ అన్న నెల్సన్‌మండేలా వ్యాఖ్యను ఉద్ఘాటించారు. తనను డార్లింగ్ లీడర్‌గా ప్రశంసించిన జూనియర్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీడియాలో నాపై విమర్శలనే చూస్తుండటంతో నేను చేసిన ఇతర పనులను నేను కూడా మర్చిపోయాన’న్నారు. రోజుల తరబడి పతాక శీర్షికల్లో తనను నిలిపినందుకు కృతజ్ఙతలంటూ మీడియాపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అధికారులకు ఏమైనా సందేశమిస్తారా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు స్పందిస్తూ.. సందేశాలిచ్చేందుకు తాను సాధువునో, రాజకీయ నేతనో కాదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement