భారతదేశంలో జైలు శిక్ష అనుభవిస్తున్న కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్‌కు పాకిస్తాన్ పట్టంకట్టింది. ఆమె పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వంలోకి అడుగు పెట్టింది. అన్వరుల్ హక్ కాకర్ తాత్కాలిక ప్రభుత్వంలో మానవ హక్కులు, మహిళా సాధికారతపై ప్రధానమంత్రికి ప్రత్యేక సలహాదారుగా ఆమె నియమితులయ్యింది. ఆమె ఒక ఉగ్రవాది భార్య అయినప్పటికీ పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెకు ప్రాధాన్యతనివ్వడం చర్చనీయాంశంగా మారింది. మానవ హక్కుల అంశంలో ప్రత్యేక సలహాదారుగా నియమించేందుకు ముషాల్ హుస్సేన్ మాలిక్‌కు మించిన అర్హత కలిగిన వ్యక్తులు పాకిస్తాన్‌లో లేరా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నియామకం వెనుక పాకిస్తాన్ రహస్య ఎజెండా ఉందనేది స్పష్టం అవుతున్నదని వారు అంటున్నారు.
ముషాల్‌కు బాధ్యతల అప్పగింత వెనుక..
నిజానికి ముషాల్ హుస్సేన్ మాలిక్ నియామకం లాంఛనప్రాయ చర్య అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. ముషాల్ పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రముఖరాలేమీ కాదు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి ఓట్లను సంపాదించిపెట్టనూ లేదు. అటువంటి పరిస్థితిలో కాశ్మీర్ ఎజెండాను సజీవంగా నిలిపివుంచడానికి, పాకిస్తాన్ సైన్యం వినతి మేరకు ముషాల్‌ను పాకిస్తాన్ ఈ ఉన్నత పదవిలో నియమించిందని తెలుస్తోంది. ముషాల్ హుస్సేన్ కశ్మీర్ విషయంలో మొదటి నుంచి భారత్‌పై విషం చిమ్ముతూ వస్తోంది.
కశ్మీర్ సమస్యను సజీవంగా ఉంచాలని..
భారతదేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్- 370 రద్దు చేసిన అంశాన్ని తిరిగి లేవనెత్తడానికి పాకిస్తాన్ చేస్తున్న విఫల ప్రయత్నాలలో భాగమే ఈ చర్య అని విశ్లేషకులు అంటున్నారు. కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన జీ-20 సమావేశాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ముషాల్‌ను సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ముషాల్ మాట్లాడుతూ యాసిన్ మాలిక్ విషయంలో భారత్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు చేసింది. ఇదిలావుండగా ఇటీవల జీ-20 సభ్యులు శ్రీనగర్‌కు చేరుకుని, సమావేశంలో పాల్గొన్నప్పుడు మరోసారి కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై లేవనెత్తేందుకు పాక్ ప్రయత్నించింది.
పీఓకే ప్రజలను తప్పుదారి పట్టించేందుకే..
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వంలో ముషాల్ చేరిక వెనుక పాక్ ఎత్తుగడ ఉంది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లు ఎక్కుతున్నారు. ఈ నేపధ్యంలో పాక్ ప్రభుత్వం ముషాల్‌ను నియమించడం ద్వారా పీఓకే ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం దక్కుతుందని భావిస్తోంది. కాగా ముషాల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్. 2005లో పాకిస్తాన్‌లో ఆమెకు యాసిన్ మాలిక్ పరిచయం అయ్యాడు. 2009లో వారు పెళ్లి చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: అమెరికాను చైనా ఎందుకు హెచ్చరించింది?
Comments
Please login to add a commentAdd a comment