పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి ఆర్మీ చీఫ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఒక కేసు విచారణకు హాజరైన ఆయన మాట్లాడుతూ గృహనిర్బంధంలోవున్న తన భార్య బుష్రా బీబీపై విషప్రయోగం జరిగిందని ఆరోపించారు. తన భార్యకు ఎటువంటి హాని జరిగినా అందుకు ఆర్మీ చీఫ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అడియాలా జైలులో 190 మిలియన్ పౌండ్ల తోషాఖానా అవినీతి కేసు విచారణ సందర్భంగా పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐఐ) నేత ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ తన భార్య బుష్రాకు విషమిచ్చి చంపే ప్రయత్నం జరిగిందని న్యాయమూర్తి నాసిర్ జావేద్ రాణా ఎదుట ఆరోపించారు. ఆమె శరీరంపై గాయాల ఆనవాళ్లు ఉన్నాయని, దీని వెనుక ఎవరి హస్తం ఉందో తనకు తెలుసని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
తన భార్య బుష్రాకు ఏదైనా హాని జరిగితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యత వహించాలని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. షౌకత్ ఖానుమ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అసిమ్ సాయంతో తన భార్యకు వైద్య పరీక్షలు చేయించాలని ఇమ్రాన్ ఖాన్ కోర్టును కోరారు. ఇంతకుముందు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యునిపై తనకు, తన పార్టీకి నమ్మకం లేదని ఇమ్రాన్ పేర్కొన్నారు.
మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విజ్ఞప్తి మేరకు ఆయన భార్య బుష్రా వైద్య పరీక్షలకు సంబంధించి దరఖాస్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ అనంతరం విలేకరులతో మాట్లాడిన బుష్రా తాను అమెరికన్ ఏజెంట్ అంటూ పార్టీలో వదంతులు వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. తన ఆహారంలో టాయిలెట్ క్లీనర్ చుక్కలు కలిశాయని ఆమె ఆరోపించారు. ఫలితంగా తన కళ్లు వాచిపోయాయని, ఛాతీ, కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్నానని ఆమె వాపోయారు.
బుష్రా బీబీ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెపై విషప్రయోగం జరిగిందని పీటీఐ ప్రతినిధి ఒకరు మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. బుష్రా బీబీని కలుసుకోకూడదంటూ ఆమె కుటుంబ సభ్యులను నిర్బంధించారని, ఈ చర్య రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment