MP YS Avinash Reddy Letter To CBI Director Praveen Sood - Sakshi
Sakshi News home page

సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

Published Sun, Jul 23 2023 6:54 PM | Last Updated on Mon, Jul 24 2023 3:09 PM

Mp Avinash Reddy Letter To Cbi Director Praveen Sood - Sakshi

సాక్షి, అమరావతి: సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి రాంసింగ్‌ పక్షపాతంగా వ్యవహరించారంటూ.. గతంలో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్లను విశ్లేషిస్తూ ఆయన లేఖ రాశారు. సీబీఐ విచారణను పున:సమీక్షించుకోవాలని అవినాష్‌రెడ్డి కోరారు.

‘‘విచారణ అధికారిగా బాధ్యతలు తీసుకోకముందే రాంసింగ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా విచారణ జరిపారు. నాతో పాటు మా తండ్రి భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిని ఇరికించేందుకు సాక్ష్యులను రాంసింగ్‌ బెదిరించారు. నా పేరు చెప్పమని పీఏ కృష్ణారెడ్డిని థర్డ్‌ డిగ్రీతో రాంసింగ్‌ టార్చర్‌ చేశారు. రాంసింగ్‌ వేధింపులు భరించలేక పీఏ కృష్ణారెడ్డి, కడప ఎస్పీ పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారు. పలువురు సాక్ష్యుల స్టేట్‌మెంట్లను రాసింగ్‌ పూర్తిగా మార్చేశారు.’’ అని అవినాష్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
చదవండి: నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చెబుతున్నది తప్పు: వివేకా పీఏ కృష్ణారెడ్డి

‘‘వరుసగా అబద్ధాలు చెప్పిన ఏ4 దస్తగిరి మాటల ఆధారంగా సీబీఐ విచారణ చేసింది. హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరిని అరెస్ట్‌ చేయకుండా సీబీఐ ఆలస్యం చేసింది. వివేకాను హత్య చేసిన దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కానీ, సునీత కానీ వ్యతిరేకించలేదు’’ అని అవినాష్‌ లేఖలో తెలిపారు.

‘‘సీఐ శంకరయ్య చెప్పని మాటలను రాంసింగ్‌ సాక్ష్యాలుగా చూపారు. సీఐ శంకరయ్య దీనిపై కడప జిల్లా ఎస్పీ, కడప కోర్టులో ఫిర్యాదు చేశారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ తనను చిత్రహింసలకు గురి చేశారని ఉదయ్‌ కుమార్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రాంసింగ్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. వివేకా హత్య కేసులో తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని రాంసింగ్‌ వక్రీకరించారని డాక్టర్‌ అభిషేక్‌రెడ్డి మీడియా ముందు చెప్పారు. హత్య జరిగిన రోజు మా నాన్న భాస్కర్‌రెడ్డి ఇంటికి ఏ2 సునీల్‌ యాదవ్‌ వచ్చారని సీబీఐ చెప్పింది అబద్ధం’’ అని అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు.
చదవండి:​​​ ​ దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు'

‘‘గూగుల్‌ టేక్‌ అవుట్‌కు సంబంధించి తొలి చార్జిషీట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదు. రాంసింగ్‌ వచ్చిన తర్వాతనే కావాలనే ఈ అబద్ధాన్ని సృష్టించారు. వివేకా హత్య కేసులో కీలకమైన రెండో వివాహం అంశాన్ని సీబీఐ కావాలనే పక్కనపెట్టింది. తన భర్త హత్యకు ఆయన మొదటి భార్య కుటుంబ సభ్యులే కారణమని వివేకా రెండో భార్య షమీమ్‌ అనుమానం వ్యక్తం చేశారు. అయినా సీబీఐ ఈ విషయంలో ఎటువంటి విచారణ జరపలేదు. వివేకా హత్య కేసులో గత విచారణ అధికారి రాంసింగ్‌ చేసిన తప్పులను సవరించాలి’’ అని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement