సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానా
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానాపై అదే సంస్థ కేసు నమోదుచేసింది. సీబీఐలో రెండో అత్యున్నతాధికారిపై సీబీఐనే కేసు పెట్టడం ఇదే తొలిసారి. మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాంస వ్యాపారి మొయిన్ ఖురేషికి సాయం చేసేందుకు మధ్యవర్తి నుంచి అస్తానా లంచం తీసుకున్నారన్నది ఇక్కడ ప్రధాన ఆరోపణ అని అధికారులు తెలిపారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఖురేషి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు రూ. 24 కోట్లు చెల్లించాడని అస్తానా ఆగస్టు 24న కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారణ జరుపుతోంది. అప్పటి నుంచి అలోక్, అస్తానా వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రతరమైన నేపథ్యంలో సీబీఐ అస్తానాపై నేరపూరిత కుట్ర, అవినీతి, నేర దుష్ప్రవర్తన తదితర ఆరోపణలపై కేసు నమోదుచేసింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సతీశ్‌బాబు సనా ఫిర్యాదు మేరకు సీబీఐలోని అవినీతి నిరోధక విభాగం పలు సెక్షన్ల కింద అస్తానాతో పాటు మరికొందరిపై తాజా కేసు నమోదుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment