మీడియాను నియంత్రించలేం!
సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హాకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తన ఇంటి సందర్శకుల జాబితాకు సంబంధించి ఎటువంటి సమాచారం వెలువరించకుండా మీడియాను నియంత్రించాలన్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశం చాలా సున్నితమైనదని, దీనిపై మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న 2జీ కుంభకోణానికి సంబంధించి నిందితులుగా ఉన్న పలు సంస్థల ప్రతినిధులు సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హాను కలిశారని.. నిందితుల్లో కొందరిని రక్షించేందుకు రంజిత్ ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
రంజిత్‌ను సీబీఐ డెరైక్టర్ పదవి నుంచి తొలగించేలా ఆదేశించాలని సీపీఐఎల్ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కాగా.. తన నివాసానికి వచ్చినవారి జాబితాను వెల్లడించడం తన వ్యక్తిగత జీవితానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తుందని రంజిత్ సిన్హా కోర్టుకు విన్నవించారు. ఈ అంశంలో తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు.
తమకు సీల్డ్ కవర్‌లో వచ్చిన సమాచారం బయటకు పొక్కకున్నా.. ఇతరమార్గాల ద్వారా వెల్లడయ్యే అంశాలను నిలువరించటం సాధ్యం కాదని.. ఈ విషయంలో మీడియాను నియంత్రించటం సాధ్యం కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కాగా, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంతో రంజిత్‌సిన్హాకు సంబంధం ఉందని.. అందువల్ల ఆ కేసు దర్యాప్తు నుంచి రంజిత్‌సిన్హాను దూరంగా ఉంచాలంటూ కామన్‌కాజ్ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశిస్తే కోల్‌స్కామ్ దర్యాప్తు నుంచి తప్పుకుంటానని రంజిత్‌సిన్హా తెలిపారు.