హైదరాబాద్: రఫేల్ స్కాంపై దర్యాప్తు చేస్తున్నారనే అక్కసుతో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రధాని నరేంద్ర మోదీ తొలగించారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా ధ్వజమెత్తారు. రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించిన మోదీకి అధికారంలో కొనసాగే హక్కులేదని స్పష్టం చేశారు. అలోక్ వర్మ తొలగింపును నిరసిస్తూ శుక్రవారం ఇక్కడ కోఠిలోని సీబీఐ కార్యాలయం ముందు వందలాది మంది మహాకుటమి కార్యకర్తలు, నేతలు ధర్నాకు దిగారు.
పోలీసులు సీబీఐ కార్యాలయ గేట్లను మూసివేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీలు వీహెచ్, మధుయాష్కి, పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీజేఎస్ నేత దిలీప్‌కుమార్ అక్కడికి రావడంతో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కుంతియా, ఉత్తమ్, వీహెచ్, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్‌యాదవ్‌లను అరెస్టు చేసి మలక్‌పేట్ పోలీసుస్టేషన్‌కు, మిగతావారిని కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కుంతియా, ఉత్తమ్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థను, సెక్యులరిజాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందనీ, ఇలాంటి ప్రభుత్వం దేశంలో ఉండటం ప్రమాదకరమన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్‌కు అధికారంలో కొనసాగే హక్కులేదన్నారు. రఫేల్ కుంభకోణాన్ని తొక్కి పట్టేందుకే ప్రధాని నరేంద్ర మోదీ న్యాయవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
ముఖేశ్‌గౌడ్ డుమ్మా
గోషామహాల్ నియోజకవర్గంలోని కోఠి ప్రాంతంలో కుంతియాలాంటి జాతీయ నేతల సమక్షంలో జరుగుతున్న ధర్నాకు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్‌గౌడ్ డుమ్మా కొట్టడం గమనార్హం. ముఖేశ్‌గౌడ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారా, లేదా ఇతర పార్టీల వైపు చూస్తున్నారా.. అని స్థానిక నాయకులకు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment