
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో నూతనోత్తేజం నెలకొంది. లోక్‌తాంత్రిక్ జనతాదళ్ చీఫ్ శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి రాజ్‌రావు బుధవారం ఢిల్లీలో సీనియర్ నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఎల్జేపీ నేత, మాజీ ఎంపీ కాళీ పాండే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిద్దరూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. తన తండ్రి ఆకాంక్షలకు అనుగుణంగా బిహార్‌లో మహాకూటమి తరపున పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను చేపడతానని ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న సుభాషిణి పేర్కొన్నారు. చదవండి : బిహార్ ఎన్నికలు.. మరక మంచిదే
తనకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా లేరని, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా మహాకూటమిని బలోపేతం చేసి బిహార్‌ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రయత్నిస్తానని కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా సుభాషిణి చెప్పుకొచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు దశల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు