పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో పాలక, విపక్ష కూటముల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. తాను అనుభవం లేని నేతనే అయితే తనకు వ్యతిరేకంగా బీజేపీ ఎందుకు తన శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తోందని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. బీజేపీ నైరాశ్యంలో ఉందని దాని తీరుతెన్నులే తేటతెల్లం చేస్తున్నాయని అన్నారు. నితీష్ కుమార్ ప్రతిష్ట మసకబారిందా అని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీకి సీఎం అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. చదవండి : నితీష్‌కు డబుల్ ట్రబుల్..!
తనకు అనుభవం లేదని బీజేపీ చెబుతోందని, తాను ఎమ్మెల్యేగా విపక్ష నేతగా వ్యవహరించడంతో పాటు ఉపముఖ్యమంత్రిగానూ పనిచేశానని చెప్పారు. తన అయిదేళ్ల అనుభవం 50 సంవత్సరాల అనుభవంతో సమానమని ఆయన చెప్పుకొచ్చారు. బిహార్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారం తనకు ఎలాంటి సవాల్ విసరబోదని స్పష్టం చేశారు. బిహార్‌లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని జేడీయూ, బీజేపీకి అర్థమవడంతో వారు నిరాశలో కూరుకుపోయారని అన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment