ఎన్నికల సభలో మాట్లాడుతున్న మోదీ
ఫోర్బ్స్‌గంజ్/సహస్ర: పార్లమెంటులోని ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీకి వంద మంది కూడా సభ్యులు లేరని ప్రధాని మోదీ హేళన చేశారు. ఆ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం మోదీ ప్రచారసభల్లో మాట్లాడారు. బిహార్‌లో నితీశ్ సీఎం అయ్యాక అభద్రతా భావం మచ్చుకైనా కనిపించడం లేదని కితాబునిచ్చారు. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని వారికి అవకాశం దొరికినప్పుడల్లా ఆ పార్టీని శిక్షిస్తున్నారని మోదీ చెప్పారు.
ప్రజాగ్రహం కారణంగానే పార్లమెంటు ఉభయ సభల్లో వారి ఎంపీల సంఖ్య 100 కంటే తక్కువకి పడిపోయిందని అన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని, రైతులు రుణ మాఫీ చేస్తామని, రిటైర్డ్ సర్వీస్‌మెన్‌కు వన్ ర్యాంకు, వన్ పెన్షన్ వంటి అమలు చేయని హామీల కారణంగా ఆ పార్టీపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోందని అన్నారు. సోమవారం వెలువడిన రాజ్యసభ ఫలితాల్లో 11 స్థానాలకు గాను బీజేపీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించి ఎగువ సభలో తన బలాన్ని 92కి పెంచుకుంటే, కాంగ్రెస్ బలం 38కి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తొలిసారిగా రెండు సభల్లోనూ కలిపి కేవలం 89 మంది సభ్యులు ఉండడంతో మోదీ కాంగ్రెస్‌ని హేళన చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని సాగించారు.
Comments
Please login to add a commentAdd a comment