సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి పొత్తులే కారణమని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం 40 నుంచి 45 స్థానాలైనా గెలిచేవాళ్లమని చెప్పారు. మహా కూటమి వద్దని ఎన్నికల ముందే అధిష్టానానికి చెప్పానని, అయినప్పటికీ పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. పొత్తుల కారణంగా టికెట ఎవరి వస్తుందోనని ప్రజలు అయోమయానికి గురైయ్యారన్నారు. దీనికి తోడు సీట్లే పంచుకోలేని వాళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ కేసీఆర్ చేసిన ప్రసంగాలు ప్రభావితం చూపాయన్నారు. ప్రజా కూటమి గెలిస్తే చంద్రబాబు పాలన సాగిస్తారని టీఆర్‌ఎస్ ప్రచారం చేసిందన్నారు.
తనలాంటి నాయకులు ఓడిపోవడానికి పొత్తులే కారణమని చెప్పారు. కేసీఆర్ తన నియోజకవర్గంలో రెండు సార్లు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నల్గొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మారని, అందుకే తాను ఓడిపోయానని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు వద్దని పార్టీ సమీక్ష సమావేశంలో చెప్పానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు లేకపోతే 7 లేదా 8 స్థానాలలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. అధిష్టానం టికెట్ ఇస్తే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment