సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నప్పటికీ.. రాష్ట్రంలో విపక్షాలు ఇంకా గందరగోళంలోనే ఉన్నాయి. అధికార టీఆర్‌ఎస్ దూకుడుతో ఎన్నికల బరిలో దూసుకెళుతుంటే ప్రతిపక్షాలు ఇంకా వ్యూహాలను ఖరారు చేసుకునే పనిలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు ఈ ఎన్ని కల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవ హరిస్తుండటం, కలిసేందుకు ప్రయత్నించినా.. కామ్రేడ్ల మధ్య సఖ్యత కుదరకపోవడంతో విపక్షాల రాజకీయం ఆగమాగంగా మారింది. కాంగ్రెస్ మినహా మహాకూటమిలోని భాగస్వామ్యపక్షాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి కూడా రాలేదు. తాము పోటీచేయని స్థానాల్లో ఎవరికి మద్దతివ్వాలన్నది తేల్చుకోలేకపోతున్నాయి. అధికార పక్షం ఎదురేలేకుండా దూసుకుపోతుంటే.. విపక్షాలు మాత్రం కనీస పోటీ ఇచ్చేందుకే విలవిల్లాడుతున్నాయి.
కాంగ్రెస్ ఒంటరిగానే!
అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో ఇతర ప్రతిపక్షాలతో జట్టుకట్టి పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే వెళ్తోంది. ఇప్పటికే ఖమ్మం లోక్‌సభ మినహా 16 మంది అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పనిచేసిన పార్టీలను ఈసారి కలుపుకునిపోయేందుకు కనీస ఆసక్తి చూపడం లేదు. టీజేఎస్, సీపీఐ లాంటి పార్టీలతో కూడా సంప్రదింపులు జరపలేదు. జాతీయ పార్టీగా ఈ ఎన్నికల్లో లభించే మద్దతుతో పాటు.. ఇతర పక్షాల సహకారం కూడా తోడైతే కొంత ఫలితం ఉండే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచించకుండానే.. టీపీసీసీ నేతలు ఎన్నికల కసరత్తు పూర్తి చేసుకోవడం గమనార్హం.
కామ్రేడ్ల ఐక్యత హుష్‌కాకి!
రాష్ట్రంలో ఉనికి కోసం అష్టకష్టాలు పడుతున్న కామ్రేడ్లు కూడా లోక్‌సభ ఎన్నికలపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన సీపీఐ, సీపీఎంలు ‘వామపక్షాల ఐక్యత’పేరుతో మళ్లీ కలవాలనుకున్నా సైద్ధాంతిక అంశాలు వారిని కలవనీయడం లేదు. ముఖ్యంగా బహుజన లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీలు వారి ఐక్యతకు అవరోధాలుగా కనిపిస్తున్నాయి. సీపీఎంతో పాటు తాము పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతిఇస్తామని సీపీఐ చేస్తున్న ప్రతిపాదనకు సీపీఎం సుముఖంగా లేదు. కాంగ్రెస్ వ్యతిరేక వైఖరికి కట్టుబడాలని మార్క్సిస్టులు కోరుతున్నా.. దీన్ని సీసీఐ అంగీకరించడం లేదు. ఇక, బీఎల్‌ఎఫ్‌ను కొనసాగిస్తామన్న సీపీఎం ప్రతిపాదన సీపీఐకి రుచించడం లేదు. దీంతో ఇరు పార్టీలు సమావేశాల మీద సమావేశాలు పెట్టుకుంటున్నాయి కానీ ఏమీ తేల్చడం లేదు. అయితే.. సీపీఐ మాత్రం భువనగిరిలో అభ్యర్థిని ప్రకటించింది.
బీజేపీ రూటే సెపరేటు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇంకా వ్యూహాలను రచించడంలో.. అభ్యర్థులను ఖరారుచేయడంలోనే మునిగి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేయబోతోంది. అయితే.. అభ్యర్థుల ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది. పోటీ ఉన్న చోట ఎక్కువ మంది ఆశావాహులుండడం, కొన్ని చోట్ల కనీస పోటీనిచ్చే నేతలు టికెట్ అడక్కపోవడంతో కమలంపార్టీ పరిస్థితి కూడా ఊగిసలాట దశలోనే ఉంది. మొత్తం మీద లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్రంలోని ప్రతిపక్షాల కంగాళీ పరిస్థితులు అధికార పక్షానికి ఊతమిస్తాయనే చర్చ జరుగుతోంది.
తేల్చుకోలేని టీజేఎస్, టీడీపీ
గత ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలైన టీజేఎస్, టీడీపీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. అసలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలా? ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? పోటీ చేయని చోట్ల ఎవరికి మద్దతివ్వాలనే అంశాల్లో ఇంకా డోలాయమానంలోనే ఉన్నాయి. పోటీ చేయ డం ఖాయమని ఆయా పార్టీల నేతలు పైకి చెపుతున్నా.. ఏం చేస్తారన్నది అనుమానమే. మొదట్లో టీజేఎస్ కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, భువనగిరి స్థానాల్లో పోటీ చేయా లని నిర్ణయించినా కరీంనగర్, నిజామాబాద్ లకే పరిమితం కావాలనుకుంటున్నట్లు తెలి సింది. అయితే.. తాము పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని టీజేఎస్ నిర్ణయించింది. ఇక, తెలుగుదేశం పార్టీ కూడా ఇటీవలే ముఖ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. అయితే.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? పోటీలో లేని చోట్ల ఎవరికి మద్దతివ్వాలన్నదానిపై మరోసారి సమావేశమై వెల్లడిస్తామని తెలిపింది. నామినేషన్ల ఘట్టం మొదలైనా.. ఇంకా భేటీ కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment