రంజిత్ సిన్హాపై సీవీసీ దర్యాప్తు | CVC investigate on Ranjit sinha for colgate case | Sakshi
Sakshi News home page

రంజిత్ సిన్హాపై సీవీసీ దర్యాప్తు

Published Fri, May 15 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

రంజిత్ సిన్హాపై సీవీసీ దర్యాప్తు

రంజిత్ సిన్హాపై సీవీసీ దర్యాప్తు

 ‘కోల్‌గేట్’ నిందితులను కలవడాన్ని తప్పుబట్టిన సుప్రీం
 సీబీఐ మాజీ డెరైక్టర్ తీరుపై ఆక్షేపణ
 జూలై 6లోగా నివేదిక ఇవ్వాలని సీవీసీకి ఆదేశం
 
 న్యూఢిల్లీ: కోల్‌గేట్ కేసులో సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్‌కుమార్ సిన్హా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో నిందితుడిని ఆయన కలుసుకోవడం సమంజసం కాదని, దీనిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. సిన్హా వ్యవహరించిన తీరుతో కేసు ఎంతమేరకు ప్రభావితమైందన్న దానిపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు సూచించింది. పలు కేసులకు సంబంధించి కొందరు వ్యక్తులను దర్యాప్తు అధికారుల పరోక్షంలో రంజిత్‌కుమార్ కలవడం ఆక్షేపణీయమని జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
 
 ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి జూలై 6లోగా నివేదిక అందించాలని సీవీసీని ఆదేశించింది. ఆ సమావేశాల తర్వాత సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లు, దర్యాప్తు నివేదికల్లో ఏమైనా తేడాలున్నాయా గుర్తించాలని సూచించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇలాంటి సమావేశాలు జరిగినట్లు తేలిందని కోర్టు వెల్లడించింది. ఈ భేటీలు అధికారిక రహస్యాల చట్టం పరిధిలోకి రావని, సమాచారహక్కు చట్టం కింద ఈ వివరాలను సేకరించడం ప్రజాప్రయోజనాల కిందకే వస్తుందని స్పష్టం చేసింది. కాగా, తనపై పిటిషన్ వేసిన సీనియర్ లాయర్ ప్రశాంత్‌భూషణ్ అసత్య ఆరోపణలు చేశారని, దీనిపై ఆయన్ని విచారించాలని సీబీఐ మాజీ చీఫ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
 
 బొగ్గు స్కాంకు సంబంధించిన కేసులను బలహీనపరిచేందుకు రంజిత్‌కుమార్ అధికార దుర్వినియోగం చేశారంటూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బొగ్గు స్కాంలో నిందితులుగా ఉన్న అప్పటి రాజ్యసభ ఎంపీ విజయ్ దర్దా సహా పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలతో రంజిత్‌కుమార్ సమావేశమైనట్లు ఆయన నివాసంలో ఉండే సందర్శకుల పుస్తకంలోని పేర్ల ద్వారా తెలుస్తోందని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలియజేశారు. దీనిపై కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement