సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ కేసులో ప్రాధమిక దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో సుప్రీం కోర్టుకు సోమవారం కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సమర్పించింది. నివేదికను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌తో కూడిన సుప్రీం బెంచ్ ఈ అంశంపై విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది. ఇక అక్టోబర్ 23న తాను సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలపై నివేదికను సీబీఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు కోర్టుకు సమర్పించారు. కాగా ఆదివారం సైతం రిజిస్ర్టీ తెరిచిఉంటుందని, అయితే నివేదిక సమర్పించే విషయమై రిజిస్ర్టార్‌కు ఎలాంటి సమాచారం లేదని ప్రధాన న్యాయమూర్తి ఆక్షేపించారు.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై క్షమాపణలు చెబుతూ నివేదిక సమర్పించడంలో తమవైపు నుంచి కొంత జాప్యం జరిగిందని అంగీకరించారు. కాగా, అలోక్ వర్మపై అవినీతి ఆరోపణల కేసులో రెండు వారాల్లోగా ప్రాధమిక దర్యాప్తు పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సీవీసీకి రెండు వారాల గడువిచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా అలోక్ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి సీవీసీ చీఫ్ కేవీ చౌదరి నేతృత్వంలోని కమిటీ ముందు వర్మ హాజరైన నేపథ్యంలో సుప్రీం విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది
Comments
Please login to add a commentAdd a comment