సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తనను విధులను తప్పించి బలవంతంగా సెలవుపై పంపించడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించడంలేదు. ఆయన పదవీ విరమణ ముగియనున్న జనవరిలోగానైనా సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతుందా? అన్నది ఇప్పుడు కోటి రూకల ప్రశ్న. అలోక్ వర్మ పదవీ విరమణలోగా తీర్పు వెలువడితే అది తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత తీర్పు వెలువడితే తమకు ప్రయోజనం ఉండదని, పైగా అప్పుడు తీర్పు కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వెలువడవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా పదవీ విరమణ తర్వాత తీర్పు వెలువడితే అది అలోక్ వర్మకు అప్రయోజనమే అవుతుంది.
ఇప్పటి వరకు అలోక్ వర్మ పిటిషన్‌పై విచారణ జరిగిన తీరే పలు అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. సీబీఐ డైరెక్టర్ విధుల నుంచి వర్మను తప్పించి, బలవంతపు సెలవుపై పంపిస్తూ మోదీ ప్రభుత్వం అక్టోబర్ 23వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ నియామకమిటీ అనుమతి లేకుండా కేంద్రం ఏకపక్షంగా తనపై చర్య తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ వర్మ అక్టోబర్ 26వ తేదీన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ డైరెక్టర్‌ను రెండేళ్ల కాల పరిమితికి నియమించేందుకు ప్రధాన మంత్రి, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి సూచించిన సుప్రీం కోర్టు జడ్జీతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టే గతంలో మార్గదర్శకాలను సూచించింది. సీబీఐ డైరెక్టర్‌ను రెండేళ్ల పదవీ కాలం ముగియకముందే విధులను తొలగించాలన్న ఈ కమిటీయే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా మార్గదర్శకాల్లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఇందుకు విరుద్ధంగా తనను తొలగించారన్నదే అలోక్ వర్మ వాదన. హవాలా కేసులో భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారంటూ సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానపై సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ కేసు నమోదు చేయడంతో కలహం మొదౖలñ న విషయం తెల్సిందే. అలోక్ వర్మనే ముడుపులు తీసుకుంటారని, తనకు అలాంటి అలవాటు లేదని అస్థాన ప్రత్యారోపణలు చేశారు. దీంతో మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా జోక్యం చేసుకొని ఇద్దరిని విధుల నుంచి తప్పించి బలవంతపు సెలవులపై పంపించింది. రాకేశ్ అస్థాన మోదీకి మంచి మిత్రుడన్న విషయం అందరికి తెల్సిందే.
అలోక్ వర్మ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్ నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీం బెంచీ అక్టోబర్ 26వ తేదీన విచారణ చేపట్టింది. అలోక్ వర్మను తొలగించడంలో మోదీ ప్రభుత్వం నియమ నిబంధనలను పాటించిందా, లేదా అన్న అంశాన్ని పరిశీలించాల్సిన బెంచీ అందుకు భిన్నంగా వర్మపై అస్థాన చేసిన ఆరోపణల్లో నిజమెంతో దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా ‘సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివీసీ)’ను ఆదేశించింది. రెండు వారాల తర్వాత సివీసీ దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతూ ఓ సుప్రీం కోర్టు జడ్జీ ఏకే పట్నాయక్‌ని నియమించింది. సీవీసీ దర్యాప్తుపై అనుమానం ఉంటే అప్పుడే సుప్రీం కోర్టు జడ్జీని నియమించి ఉండాల్సిందని, రెండు వారాల అనంతరం నియమించడం అంటే దర్యాప్తును సాగదీయడానికే కావొచ్చని న్యాయ వర్గాలే అనుమానిస్తున్నాయి.
వర్మ పిటిషన్ తదుపరి విచారణ నవంబర్ 12వ తేదీన ఉండగా అదే రోజు ఉదయం సీవీసీ తన నివేదికను సమర్పించింది. నివేదికను పరిశీలించినప్పటీకీ లోతుగా పరిశీలించేందుకు సమయం చాలదంటూ కేసు విచారణను నవంబర్ 16కు వాయిదా వేసింది. ఆరోజున విచారణ చేపట్టాక నివేదిక కొన్ని అంశాల్లో వర్మను ఎక్కువ అభినందించిందని, కొన్ని అంశాల్లో తక్కువ అభినందించిందని, తక్కువ అభినందించిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా వర్మను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ఆదేశిస్తూ కేసు విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేశారు. నవంబర్ 19వ తేదీనే వర్మ తన సమాధాన పత్రాన్ని సమర్పించారు. సీవీసీ నివేదిక, వర్మ సమాధాన పత్రంలోని పలు అంశాలు ఓ న్యూస్ వెబ్‌సైట్‌లో రావడం పట్ల 20వ తేదీ విచారణలో ప్రధాన న్యాయమూర్తే అసహనం వ్యక్తం చేశారు. అసలు కేసునే విచారించమంటూ విసుక్కున్నారు. ఆ తర్వాత నవంబర్ 29వ తేదీకి విచారణను వాయిదా వేశారు. ఆ రోజు కూడా ఏ కారణంతో వాయిదా వేస్తారో చూడాలి.
Published Mon, Nov 26 2018 4:56 PM | Last Updated on Mon, Nov 26 2018 8:39 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment