రంజిత్ సిన్హా ‘రేప్’ వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చేసిన ‘రేప్’ కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీలతో పాటు మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. సీబీఐ చీఫ్ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఆయన తన వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. తన కామెంట్లు వివాదాస్పదం కావడంతో రంజిత్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించడంపై మంగళవారం రంజిత్ సిన్హా స్పందిస్తూ.. ‘క్రీడల్లో బెట్టింగ్‌పై నిషేధాన్ని అమలు చేయలేకపోవడం ఎలాంటిదంటే రేప్‌ను నిరోధించలేకపోతే.. దానిని ఎంజాయ్ చేయండి అనడంలా ఉంటుంది’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తప్పుపట్టింది. సిన్హా వివరణ అందిన తర్వాత సీబీఐ డెరైక్టర్‌గా ఆయనను తప్పించాలని సిఫార్సు చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి, ఇటువంటి బాధ్యాతారహితమైన ప్రకటన చేయడం తగదని ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు నిర్మలా సమంత్ ప్రభావాల్కర్ చెప్పారు. సున్నిత అంశాలపై పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె సూచించారు. బీజేపీ సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, గడ్కారీ స్పం దిస్తూ సీబీఐ చీఫ్ వంటి అత్యుత్తమ పదవికి సిన్హా తగడని, ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.