పెద్ద గొప్ప పనులేమీ చేయలేదు: రంజిత్ సిన్హా
సీబీఐ డైరెక్టర్గా పనిచేసిన కాలంలో తాను పెద్ద గొప్ప పనులేమీ చేయలేదని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా అన్నారు. రెండేళ్ల పాటు దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థకు అధినేతగా ఉన్న ఆయన.. చివర్లో మాత్రం బొగ్గు స్కాం, 2జీ స్కాంల విషయంలో అపవాదు మూటగట్టుకుని వెళ్లాల్సి వచ్చింది. మంగళవారంతో రంజిత్ సిన్హా పదవీకాలం కూడా ముగిసింది. ఏమీ చెప్పకుండానే తాను వెళ్లిపోతున్నానని, పెద్దగా గొప్ప పనులేమీ చేయలేదని ఆయన అన్నారు. మీరు ఏం కావాలనుకుంటే అది రాసుకొమ్మని కూడా విలేకరులతో అన్నారు. ఇప్పటికే అంతా తనమీద కావల్సినంత బురద జల్లారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగ్ మాజీ అధినేత వినోద్ రాయ్, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ల తరహాలో అనుభవాల సారంతో ఏదైనా పుస్తకం రాసే ఆలోచన ఉందా అని ప్రశ్నించినప్పుడు.. తాను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను తప్ప ఎవరినీ అనుసరించేది లేదన్నారు. రైల్వేబోర్డులో ఓ సభ్యుడిని, ప్రభుత్వ రంగ బ్యాంకు సీఎండీ ఒకరిని, సెన్సార్ బోర్డు సీఈవోను.. ఇలా ఉన్నత స్థాయిలో ఉన్న అనేకమంది లంచాల బాగోతాన్ని బయటపెట్టిన ఘనత రంజిత్ సిన్హాకు ఉంది.