సంపాదకీయం: మొత్తానికి కేంద్ర నేరపరిశోధక సంస్థ (సీబీఐ)కి స్వతంత్ర ప్రతిపత్తి ససేమిరా ఇచ్చేది లేదని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. నిజానికి అది పెద్ద మనసు చేసుకుంటుందని, దాన్ని స్వతంత్రంగా పనిచేసుకోనిస్తుందని ఎవరికీ భ్రమలు లేవు. కాకపోతే... వివిధ కుంభకోణాల కేసుల్ని విచారించే సందర్భంగా సీబీఐ పనితీరుపైనా, దాని కుమ్మక్కు వ్యవహారాలపైనా సుప్రీంకోర్టు పలుమార్లు మందలించింది గనుక కేంద్రం ఇక దారికి రాకతప్పదని కొందరనుకున్నారు. విషయం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లింది గనుక సీబీఐ కూడా ఈసారి చాలా ధైర్యం చేసింది. తమకు ఎలాంటి విషయాల్లో స్వయంప్రతిపత్తి అవసరమో పూసగుచ్చినట్టు చెప్పింది. పాలనాపరమైన స్వయంప్రతిపత్తితోపాటు ఆర్ధిక విషయాల్లో కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండాలని... అప్పుడుమాత్రమే తాము ఎవరి ఒత్తిళ్లకూ లోనుకాకుండా పనిచేయడం సాధ్యమవుతుందని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా విన్నవించారు. ఏఏ అంశాల్లో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఆయన సవివరంగా చెప్పారు. ఉదాహరణకు సంస్థకు డెప్యూటేషన్‌పై వచ్చేవారిని ఎంచుకునే స్వేచ్ఛ సీబీఐ డెరైక్టర్‌కు లేదు.
కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ దాన్ని చూస్తుంది. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నా, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలన్నా, కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్లు కొనుగోలు చేయాలన్నా ఆర్ధిక మంత్రిత్వశాఖలోని అధికారుల దయాదాక్షిణ్యాలపై డెరైక్టర్ ఆధారపడవలసి వస్తున్నది. సంస్థకు ప్రత్యేక బడ్జెట్ ఉంటే ఇలాంటి పరిస్థితి తొలగిపోతుంది. అలాగే, డెరైక్టర్ పదవిని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శితో సమానం చేస్తే నేరుగా కేంద్ర హోంమంత్రితో సంప్రదించేందుకు వీలుకలుగుతుందని సీబీఐ వివరించింది. అదే గనుక జరిగితే బ్యూరోక్రసీ ఆధిపత్యం అంతమవుతుందని, నిర్ణయాలు వేగిరం తీసుకునే అవకాశం కలుగుతుందని చెప్పింది. అటు కేంద్రం కూడా తాను ఇవ్వదల్చుకున్న స్వయంప్రతిపత్తి ఎలాంటిదో వివరిస్తూ రెండు నెలలక్రితం ఒక అఫిడవిట్ దాఖలుచేసింది. అందులో సీబీఐ డెరైక్టర్ ఎంపిక కోసం అనుసరించదలచిన విధానాలు, ఆ డెరైక్టర్ కాల పరిమితి, బదిలీ...న్యాయస్థానాల్లో సీబీఐ కేసుల్ని చూసేందుకు ప్రాసిక్యూషన్ బోర్డు ఏర్పాటు, పరిమితమైన ఆర్ధిక అధికారాలవంటివి ఉన్నాయి. సీబీఐ అడుగుతున్న ఇతర అంశాల మాటేమిటన్న ప్రశ్న వచ్చాక కేంద్రం తన తాజా వాదనలు వినిపించింది.
సీబీఐకి తాము ఇప్పటికే ఎక్కువ అధికారాలు కట్టబెట్టామన్న అభిప్రాయంతో కేంద్రం ఉంది. అయితే, అవి పైపై మెరుగులేనని తరచి చూస్తే తెలుస్తుంది. డెరైక్టర్ నియామకం వరకూ కొలీజియం చేస్తుంది. కానీ, అటు తర్వాత ఆ డెరైక్టర్ తన పరిమితుల్లోనే మెలగవలసి ఉంటుంది. ఏ ప్రతిపాదనైనా యధావిధిగా అంచెలంచెలుగా కేంద్ర హోంశాఖ మంత్రికి చేరుతుంది. ఈలోగా ఎంతో కాలహరణం తప్పదు. ఉదాహరణకు సంస్థ తరఫున 22మంది ప్రాసిక్యూటర్ల నియామకానికి సంబంధించిన ప్రతిపాదన గత కొన్ని నెలలుగా కేంద్రం వద్దే నానుతోంది.
పర్యవసానంగా వివిధ న్యాయస్థానాల్లో సంస్థ నడిపిస్తున్న కేసుల విచారణలో జాప్యం ఏర్పడుతోంది. అయితే సీబీఐకి అయినా, మరో సంస్థకైనా ఇచ్చే స్వయంప్రతిపత్తి దాన్ని మరింత సమర్ధవంతంగా పనిచేయించడానికే తప్ప... కొంతమంది వ్యక్తులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడానికి కాదు. స్వయంప్రతిపత్తి ఇచ్చినప్పుడు అందుకు అవసరమైన జవాబుదారీతనాన్ని కూడా నిర్దేశించవలసిన అవసరం ఉంటుంది. కాగ్‌కి, ఎన్నికల సంఘానికి కూడా స్వయంప్రతిపత్తి ఉంది. ఆ సంస్థలకు అది రాజ్యాంగంద్వారా సంక్రమించింది. అడపా దడపా అధికార పక్షంనుంచి, విపక్షాలనుంచి అవి విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నా ప్రజలకు ఆ సంస్థల్లో విశ్వసనీయత ఏర్పడటానికి కారణం వాటి సారథులే. అంతకన్నా ముఖ్యంగా రిటైరైన తర్వాత వారు ప్రభుత్వ పదవులు చేపట్టకూడదన్న నియమమే. సీబీఐకిచ్చే స్వయంప్రతిపత్తి కూడా ఆ స్థాయిలో లేకపోతే రిటైరయ్యాక వచ్చే పదవులను ఆశించి అధికారపక్షం ఎలా ఆడిస్తే అలా ఆడరన్న గ్యారంటీ ఏమీలేదు.
గతంలో సీబీఐ డెరైక్టర్లుగా పనిచేసిన కొందరు ఇప్పుడు అధికార పదవుల్లో సేదతీరుతున్న తీరు కనబడుతూనే ఉంది. ఐఎంజీ భూములు కుంభకోణం వ్యవహారంలో దర్యాప్తు జరపాలని అయిదేళ్లక్రితం రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించినప్పుడు తమకు తగినంతమంది సిబ్బందిలేరని సీబీఐ జవాబిచ్చింది. ఆ జవాబు చడీచప్పుడూ లేకుండా ఫైళ్లలో కూరుకుపోయింది. సమాచార హక్కు చట్టంకింద దాన్ని గురించి ఆరా తీస్తే తప్ప విషయం వెల్లడి కాలేదు. సంస్థ బాధ్యతలను చూస్తున్నవారు చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే స్వయంప్రతిపత్తి ఇలా దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. వ్యక్తుల ఇష్టాయిష్టాలు, వారి లోపాయికారీ సంబంధాలు సంస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అందువల్లే, స్వయంప్రతిపత్తితో పాటు జవాబుదారీతనాన్ని కూడా నిర్దేశించవలసి ఉంటుంది.
కానీ, యూపీఏ ప్రభుత్వం దీన్ని తన సొంత వ్యవహారంగా పరిగణిస్తోంది. ఇందులో కేవలం పాలనాపరమైన ఇబ్బందులను మాత్రమే చూస్తోంది. సీబీఐ డెరైక్టర్ ర్యాంకు... ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), సీఆర్‌పీఎఫ్ డీజీ వంటివారి హోదాలతో సమానమైనదని, ఆయనకు కేంద్ర కార్యదర్శి హోదా ఇస్తే మిగిలినవారికీ ఇవ్వాల్సివస్తుందని చెబుతోంది. అందువల్ల ఆచరణ సాధ్యంకాదని అంటున్నది. స్వయంప్రతిపత్తివంటి విస్తృతమైన అంశాన్ని ఇలా కొన్ని పరిమితులకు లోబడి ఆలోచించే బదులు దానిపై పార్లమెంటులో కూలంకషంగా చర్చించాలి. సీబీఐకి ఇవ్వాల్సిన అధికారాలపైనా, దానికి ఉండాల్సిన జవాబుదారీ తనంపైనా అందరి అభిప్రాయాలనూ తెలుసుకోవాలి. వాటి ప్రాతిపదికగా సీబీఐని తీర్చిదిద్దినప్పుడు దాని పనితీరు మెరుగుపడుతుంది. అది నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతుంది. ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా స్వతంత్రంగా వ్యవహరించగలుగుతుంది.
స్వయంప్రతిపత్తి ఎండమావేనా?!
Published Wed, Oct 30 2013 1:36 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement