ముందస్తు అనుమతి అక్కర్లేదు
* అవినీతి అధికారుల విచారణపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
* ముందస్తు అనుమతి అంటే రాజ్యాంగ విరుద్ధం
* అది ఆర్టికల్ 14 ఉల్లంఘన
* డీఎస్‌పీఈఏ సెక్షన్ 6ఏ కొట్టివేత
* సుప్రీం తీర్పును స్వాగతించిన సీబీఐ
న్యూఢిల్లీ: అవినీతి కేసుల్లోని బ్యూరోక్రాట్ల విచారణ విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే సీబీఐ వారిని విచారించవచ్చని తేల్చి చెప్పింది. వారి విచారణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న చట్టపరమైన నిబంధన చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని మంగళవారం తేల్చి చెప్పింది. ఆ నిబంధన అవినీతిపరులకు రక్షణ కవచంలా ఉందని చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వం లోని జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖలీఫుల్లాలతో కూడిన ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినీతి కేసుల్లో జాయింట్ సెక్రటరీ ర్యాంకు, ఆపై స్థాయి అధికారులను విచారించాలంటే సంబంధిత పైస్థాయి అధికారుల అనుమతి తీసుకోవాలన్న ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ (డీఎస్‌పీఈఏ)లోని సెక్షన్ 6ఏను ధర్మాసనం కొట్టివేసింది. ఆ సెక్షన్ ప్రకారం అవినీతి కేసుల్లో అధికారులను అవినీతి నిరోధక చట్టం-1988 (పీసీఏ) ప్రకారం విచారించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, ఇది రాజ్యాంగంలోని 14వ (చట్టంముందు అందరూ సమానమే) అధికరణను ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. ర్యాంకుకు సంబంధం లేకుండా అవినీతికి పాల్పడిన అధికారులందర్నీ ఒకే గూటి పక్షుల్లాగా పరిగణించి, వారందర్నీ ఒకేలా చూడాలని కోర్టు తెలిపింది.
ఈ విషయంలో అధికారుల స్థాయిలను వర్గీకరించడం కష్టతరమని, అది పీసీఏ తీర్పునకు వ్యతిరేకమని ధర్మాసనం అభిప్రాయపడింది. 6ఏ ప్రకారం ముందస్తు అనుమతి అంటే పరోక్షంగా విచారణకు ఆటంకం కల్గించడమేనని చెప్పిం ది. ప్రాథమిక దర్యాప్తునకు సీబీఐని అనుమతించకపోతే ఇక విచారణ ఎలా కొనసాగుతుందని ప్రశ్నించిం ది. అందుకే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఎలాంటి మినహాయింపు ఉండదని కోర్టు పేర్కొంది. అంతకుముందు 6ఏ రాజ్యాంగ చెల్లుబాటుపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు.. స్వేచ్ఛపై ప్రశ్నలు ఉదయిస్తే, మరింత విస్తృతమైన ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పిస్తుందని చెప్పింది.
ఇక కేసుల విచారణ వేగవంతం: సుప్రీం తీర్పును సీబీఐ స్వాగతించింది. ఇక కేసుల విచారణ వేగాన్ని పుంజుకుంటుందని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చెప్పారు. ఈ తీర్పు మరింత బాధ్యతను పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీనియర్ అధికారులను ప్రశ్నించే విషయంలో మరింత శ్రద్ధ పెట్టేందుకు తమ సంస్థను పటిష్టపరుస్తామని తెలిపారు.