Prevention of Corruption Act
-
‘ఎర’కు ఆధారమేదీ? నగదు పట్టుబడకుంటే ఏసీబీ సెక్షన్లు వర్తించవు’
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రెడ్ హ్యాండెడ్‌గా నగదు పట్టుబడనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు పంపాలంటూ పోలీసులు దాఖలు చేసిన రిపోర్టును తిరస్కరించారు. నిందితులను విడుదల చేయాలని.. వారికి సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం నోటీసులు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో నిందితులు కొనుగోలు సంప్రదింపులు జరిపిన ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని పోలీసులు విన్నవించినా దీనిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. గురువారం పొద్దంతా విచారించి.. టీఆర్ఎస్కు రాజీనామా చేసి, బీజేపీలో చేరితే రూ.100 కోట్ల డబ్బు, కాంట్రాక్టులు, కేంద్ర పదవులు ఇస్తామని ముగ్గురు వ్యక్తులు ప్రలోభపెట్టారంటూ నలుగురు ఎమ్మెల్యేలు ఆరోపించడం, బుధవారం రాత్రి అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌజ్‌పై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో.. ఢిల్లీలోని ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రాంచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, హైదరాబాద్‌కు చెందిన హోటల్స్ వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజీ స్వామిలు మంతనాలు జరిపినట్టుగా ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి నిందితులు ముగ్గురిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఐపీసీలోని 120బీ, 171 బీ, 171ఇ, 506 సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టం–1988లోని సెక్షన్–8ను నమోదు చేశారు. వారిని శంషాబాద్ రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించి విచారించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే నర్కుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), శంషాబాద్ రూరల్ పోలీసులు సుమారు 10 వాహనాల్లో భారీ భద్రత మధ్య ముగ్గురు నిందితులను సరూర్‌నగర్‌లోని ఏసీబీ కోర్టు జడ్జి రాజగోపాల్ నివాసంలో హాజరుపర్చారు. సరైన ఆధారాలేవి? పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నిందితులను రిమాండ్‌కు పంపేందుకు తగిన ఆధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితులు పట్టుబడిన సమయంలో వారి నుంచి ఎలాంటి నగదు స్వాదీనం చేసుకోకపోవటంతో వారిపై నమోదు చేసిన కేసులు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల పరిధిలోకి రావని స్పష్టం చేశారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును తిరస్కరిస్తూ.. ఆ ముగ్గురికి 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి విచారించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే నిందితులు ఫామ్‌హౌజ్‌కు వచ్చారని.. కొనుగోలు సంప్రదింపులు జరిపిన ఆడియో, వీడియో రికార్డులు ఉన్నాయని పోలీసులు వివరించినా పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. బీజేపీలో చేరితే రూ.100 కోట్లు ఇస్తామన్నారు తనతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి బుధవారం రాత్రి 11.30కు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నందకుమార్ సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ప్రతిని రాత్రి 12.30 గంటలకు కోర్టుకు పంపారు. ఉన్నతాధికారులు రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్‌కు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఆ ఎఫ్ఐఆర్ (నంబర్ 455/2022)లోని వివరాల మేరకు.. రూ.100కోట్లు, పదవులు, కాంట్రాక్టులు ఎర.. బీజేపీకి చెందిన ఢిల్లీలోని ఫరీదాబాద్ వాసి రాంచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్ ఇద్దరూ రోహిత్‌రెడ్డిని కలిసి బేరసారాలు చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయవద్దని, ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని కోరారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఇస్తామని, కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సివిల్ కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. తమ మాట వినకుంటే క్రిమినల్ కేసులతో పాటు సీబీఐ, ఈడీ దాడులు తప్పవని బెదిరించారు. టీఆర్ఎస్ నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడతామని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనలు అనైతికం, అక్రమం కావడం, అవినీతిని ప్రోత్సహించేలా ఉండటంతో.. వారిని ఏమాత్రం ప్రోత్సహించకూడదని రోహిత్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలంటూ.. ఈ క్రమంలో బుధవారం మరోసారి రోహిత్‌రెడ్డిని సంప్రదించిన నందకుమార్, రాంచంద్రభారతి.. ఆ రోజు మధ్యాహ్నం అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌కు వస్తున్నామని, అక్కడే బేరసారాలు పూర్తి చేద్దామని చెప్పారు. ఇదే సమయంలో రూ.50 కోట్ల చొప్పున ఆశ చూపి మరికొందరు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరేందుకు సిద్ధం చేయాలని కూడా కోరారు. రోహిత్‌రెడ్డితోపాటు ఈ డీల్‌కు అంగీకరించిన ఎమ్మెల్యేలు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా, నిబద్ధతతో, నిజాయతీతో పని చేయకూడదని.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కోరారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతికి చెందిన సింహయాజి స్వామితో కలిసి ఫామ్‌హౌస్‌కు వస్తున్నామని.. అక్కడే డీల్‌ను పూర్తి చేద్దామని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాధ్యులపై కేసు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని రోహిత్‌రెడ్డి తన ఫిర్యాదులో కోరారు. -
‘పాఠశాలల స్కామ్’ దర్యాప్తు పూర్తి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రైవేట్ స్కూళ్లకు అక్రమ అనుమతుల స్కామ్‌లో నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) పోలీసులు దర్యాప్తు పూర్తిచేశారు. నిందితులపై దర్యాప్తు అధికారులు అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించారు. సీసీఎస్ పోలీసులు ఈ చట్టాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగానే కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లనూ చేర్చారు. ఇప్పటివరకు నిందితులుగా తేలిన 9 మందిలో అత్యధికులు ప్రభుత్వ ఉద్యోగులే. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని సర్కారుకు లేఖ రాశారు. గోల్మాల్ ఇలా... ప్రైవేట్ స్కూళ్లు నిర్ణీత కాలానికి అనుమతుల్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త పాఠశాలలు అనుమతులు తీసుకుంటూ ఉంటాయి. వీటి ఫైళ్లు డీఈవో కార్యాలయాలతోపాటు రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్(ఆర్‌జేడీఎస్‌ఈ) కార్యాలయానికి వెళ్తాయి. దరఖాస్తు చేసుకున్న స్కూళ్లు కొంత మొత్తం రుసుమును చలానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని దరఖాస్తుల్ని హైదరాబాద్ డీఈవో కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ మన్సూర్ అలీ గోల్మాల్ చేశాడు. ఆయా స్కూళ్ల యాజమాన్యాల నుంచి తీసుకున్న సొమ్మును చలానా రూపంలోకి మార్చకుండా స్వాహా చేశాడు. ఆర్‌జేడీఎస్‌ఈ పేరిట నకిలీ అనుమతిపత్రాలు సృష్టించాడు. ఆర్‌జేడీఎస్‌ఈ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ప్రస్తుతం మంచిర్యాల డీఈవో ఆఫీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న మహ్మద్ అబ్దుల్ ఘనీ, ఆర్‌జేడీఎస్‌ఈ కార్యాలయం సూపరింటెండెంట్ మహ్మద్ హసన్ సయీద్, డీఈవో కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ జి.వేణు గోపాల్ సాయంతో వీటిని రూపొందించి పాఠశాలల యాజమాన్యాలకు అందించాడు. ఇవి సరైనవే అని నమ్మిన యాజమాన్యాలు 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి పదోతరగతి విద్యార్థుల్ని ఎన్రోల్ చేసుకున్నాయి. టెన్త్ పరీక్షల సమయంలో జిల్లాలవారీగా పరీక్షలు రాసేందుకు అనుమతి ఉన్న పాఠశాలల జాబితాలను ప్రభుత్వ పరీక్షల విభాగానికి డీఈవోలు అందిస్తారు. ప్రతి పాఠశాల సైతం తన వద్ద ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థుల పూర్తి వివరాలను ఆన్లైన్లో అదే విభాగానికి అప్లోడ్ చేస్తుంది. గత ఏడాది అలా చేసిన సందర్భంలోనే ఈ స్కామ్ బయటపడింది. డీఈవోల నుంచి వచ్చిన జాబితాలను పరిశీలించిన పరీక్షల విభాగం అందులో లేని స్కూళ్లు సైతం తమ విద్యార్థుల వివరాలను అప్లోడ్ చేసినట్లు గుర్తించింది. విచారణకు ఆర్జేడీ ఆదేశం ప్రైవేట్ స్కూళ్లకు అక్రమ అనుమతుల వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వపరీక్ష విభాగం హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ విచారణ నేపథ్యంలోనే అసలు విషయం వెలుగులోకి రావడంతో విద్యాశాఖ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన నిందితులపై ఐపీసీతోపాటు అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్ట్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆధారాలు లభించిన నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్‌లో మన్సూర్, ఘనీ, హసన్, వేణుగోపాల్లను పట్టుకుంది. మహమూద్ అలీ విచారణ నేపథ్యంలోనే 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి 14 స్కూళ్లకు అక్రమంగా ఇచ్చిన ఈఆర్టీని గుంజా శామ్యూల్ జోసఫ్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడైంది. దీంతో శామ్యూల్‌ను అరెస్టు చేశారు. మరికొందరు నిందితులు ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే చార్జ్షీట్లు దాఖలు చేయనున్నారు. -
వ్యాపారాలనూ వదలని అవినీతి
న్యూఢిల్లీ: లంచాలు, అక్రమార్జన అనేవి భారత్ సహా వర్ధమాన మార్కెట్లలో అత్యధిక స్థాయిలో ఉన్నట్టు ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) నిర్వహించిన సర్వేలో తేలిసింది. వ్యాపారాల్లో అవినీతి, లంచాలు తారస్థాయిలో ఉన్నాయని ఈవై సర్వేలో 52 శాతం మంది చెప్పడం గమనార్హం. మన దేశంలోనూ 40 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘భారత్‌లో 40 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు వ్యాపారాల్లో అవినీతి అక్రమార్జన విధానాలు విస్తృతంగా ఉన్నాయని చెప్పారు. 12 శాతం మంది గత రెండేళ్లలో తమ కంపెనీ పెద్ద ఎత్తున మోసాలను చవిచూసినట్టు చెప్పారు. 20 శాతం మంది నగదు చెల్లింపులు అన్నవి వ్యాపారం నిలదొక్కుకునేందుకు అవసరమన్నారు’’ అని ఈవై నివేదిక తెలియజేసింది. భారత్‌లో కార్పొరేట్ పరిపాలన, పారదర్శకతను పెంపొందించేందుకు... అవినీతి నిరోధక చట్టం 2018, కంపెనీల చట్టం 2017, ఐబీసీ, నిబంధనలు పాటించకపోతే జరిమానాల వంటి పలు ప్రయ త్నాలు జరిగినట్టు ఈవై తెలిపింది. ‘‘అయినప్పటికీ మోసం, అవినీతి అనేవి వృద్ధికి ప్రధాన అడ్డంకులు. మీడియాలో తరచుగా అవినీతికి సంబంధించి పెద్ద కేసులను చూపించడం వల్ల సంబంధిత ప్రాంతంలో వ్యాపారాలను నిర్వహించే కంపెనీల ప్రతిష్టకు రిస్క్ ఉంటుంది’’ అని ఈవై అభిప్రాయం వ్యక్తం చేసింది. చాలా వర్ధమాన దేశాల్లో కొత్త చట్టాల అమలు, నిఘాను పెంచడం, మోసాల నివారణకు కంపెనీల స్వీయ కార్యాచరణ వంటివి చేపట్టినాగానీ సెంటిమెంట్ బలహీనంగానే ఉందని ఈవై తెలిపింది. అక్రమాలను ముందే గుర్తించి నిరోధించేందుకు ఫోరెన్సిక్ డేటా అనలిటిక్స్ వినియోగం వంటి చర్యలు అవసరమని సూచించింది. ఈవై ఫోరెన్సిక్ అండ్ ఇంటెగ్రిటీ సర్వీసెస్ ఈ సర్వేను నిర్వహించింది. భారత్‌తోపాటు జపాన్, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ సహా 33 వర్ధమాన మార్కెట్లకు సంబంధించి 1,450 ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాలను సేకరించింది. ఆసక్తికర అంశాలు ►వ్యాపారానికి మోసాలు, అవినీతి అతిపెద్ద ముప్పు అని 42% మంది చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా చెప్పిన వారు 29 శాతమే. ►కంపెనీ మనుగడ సాగించాలంటే కొంత మేర ప్రోత్సాహకాలు ఇవ్వక తప్పని పరిస్థితిగా చాలా సంస్థలు చెప్పడం గమనార్హం. ► కాంట్రాక్టుల కోసం లంచాలు సాధారణమేనని 16% మంది చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా చెప్పిన వారు 5 శాతం మంది ఉన్నారు. ► వ్యాపార ప్రయోజనాల కోసం నగదు రూపేణా ప్రోత్సాహకం ఇవ్వడం ఆమోదనీయమేనని వర్ధమాన మార్కెట్లలో 19% మంది చెప్పారు. దీన్ని సమర్థించే విషయంలో 33 వర్ధమాన దేశాల్లో భారత్ 12, చైనా 6వ స్థానంలో ఉన్నాయి. -
లంచమిచ్చినా జైలుకే
న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేకం చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. దీని ప్రకారం లంచం తీసుకున్న అధికారులే కాదు, ఇచ్చిన వారు కూడా శిక్షార్హులవుతారు. అవినీతి నిరోధక చట్టం–1988 సవరణ బిల్లును సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘లంచం తీసుకోవటంతోపాటు ఇవ్వడమూ నేరమే. లంచం ఇచ్చే వారికి ఇకపై మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ అధికారికి లంచం లేదా ఇతరత్రా లబ్ధి చేకూరుస్తామంటూ హామీ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు జరిమానా విధిం చే వీలుంటుంది. అవినీతి కేసులు దాఖలైన రెండేళ్లలోగా కోర్టులు విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేసుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోలీసులు విచారణ చేపట్టరాదు’ అని తెలిపారు. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ మునియప్ప మాట్లాడుతూ.. అవినీతిని అరికట్టాలంటే ఎన్నికల సంస్కరణలే మార్గమన్నారు. -
ఓటుకు డబ్బు తీసుకోవడం అవినీతి కాదు...
- ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు న్యాయవాది వాదన - ఇందుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదు - ముగిసిన వాదనలు..తదుపరి విచారణ 22కు వారుుదా సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు తీసుకుంటే అది అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) పరిధిలోకి రాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పునరుద్ఘాటించారు. ఓటు వేయడమన్నది ప్రజా విధుల్లో భాగం కాదని, అది కేవలం రాజ్యాంగపరమైన బాధ్యత మాత్రమేనని ఆయన తెలిపారు. అంతేకాక ఎన్నికై న వ్యక్తి ప్రజా సేవకుడిగా బాధ్యతలు నిర్వరిస్తున్న సందర్భంలో అవినీతికి పాల్పడితే అప్పుడు మాత్రమే పీసీ యాక్ట్ వర్తిస్తుందని ఆయన వివరించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి జరుపుతున్న విచారణ సందర్భంగా లూథ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకే కేసులో రెండు ఎఫ్ఐఆర్లు చెల్లవు.. ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న వారు ప్రజా సేవకుల నిర్వచన పరిధిలోకి వస్తారే తప్ప, ఓటర్లు, ఎన్నికల బరిలో ఉన్న వారు ప్రజా సేవకుల కిందకు రారని సిద్ధార్థ లూథ్రా చెప్పారు. సభ లోపల జరిగే ఓటింగ్‌కు, సభ వెలుపల జరిగే ఓటింగ్‌కు మధ్య స్పష్టమైన తేడా ఉందని ఆయన వివరించారు. ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఆర్పీసీ సెక్షన్ 210 కింద ఫిర్యాదు చేశారని, చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించడానికి ముందే ఈ సెక్షన్ కింద దర్యాప్తునకు ఆదేశించాల్సి ఉంటుందని లూథ్రా పేర్కొన్నారు. అరుుతే ఏసీబీ కోర్టు మాత్రం చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన తరువాతే ఫిర్యాదుపై స్పందిస్తూ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. అంతేకాక ఫిర్యాదుదారు సెక్షన్ 210 కింద ఫిర్యాదు చేస్తే ప్రత్యేక కోర్టు సెక్షన్ 156(3) కింద దర్యాప్తునకు ఆదేశించిందని, ఇది ఎంత మాత్రం సరికాదని ఆయన వివరించారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిపాలన ఉత్తర్వులుగా ఫిర్యాదుదారు చెబుతున్నారని, 156(3) కింద కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అవి జ్యుడీషియల్ ఉత్తర్వులే అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు జారీ చేసే ముందు ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తోందన్న విషయం కింద కోర్టుకు స్పష్టంగా తెలుసన్నారు. కాబట్టి రామకృష్ణారెడ్డి ఫిర్యాదును కింది కోర్టు తిరస్కరించాల్సిందని, అరుుతే ఆ పని చేయకుండా దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించిందని తెలిపారు. ఈ ఆదేశాల వల్ల ఏసీబీ మరోసారి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఒకే కేసులో రెండు ఎఫ్ఐఆర్లు చెల్లవని ఆయన చెప్పారు. విచారణ 22కు వాయిదా.. కేసుతో సంబంధం లేని థర్డ్‌పార్టీ ఇచ్చిన ఫిర్యాదును విచారించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులున్నప్పటికీ, ఆ విషయాన్ని కింది కోర్టు పట్టించుకోలేదన్నారు. దర్యాప్తునకు ఆదేశించేందుకు ఫిర్యాదు దాఖలు వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా? తదితర విషయాలను కింది కోర్టు పరిశీలించలేదన్నారు. ఓ క్రిమినల్ కేసులో బాధితుడు లేదా ఫిర్యాదిదారు, నిందితుడు, ప్రాసిక్యూటర్ వీరు ముగ్గురికే పాత్ర ఉంటుందన్నారు. ఈ ముగ్గురు కాక నాల్గో వ్యక్తికి కేసులో జోక్యం చేసుకునే అర్హత ఎంత మాత్రం ఉండదంటూ ఆయన తన వాదనలను ముగించారు. ఈ వాదనల సందర్భంగా ఆయా న్యాయవాదులు ప్రస్తావించిన సుప్రీంకోర్టు తీర్పుల వివరాలను అందచేసేందుకు వీలుగా తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 22కు వారుుదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు సాగడం లేదంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దీనిపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రరుుంచారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి విచారణ జరుపుతున్నారు. -
నిజాయితీ అధికారులకు రక్షణ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణల విషయంలో మార్పులకు రంగం సిద్ధమైంది. సీబీఐ వంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించేముందు ఆయా శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిజాయితీ అధికారులను కాపాడేందుకు అవినీతి వ్యతిరేక బిల్లులో సవరణలు తీసుకొచ్చి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని గురువారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకునేలా ఈ బిల్లు ధైర్యాన్నిస్తుందని.. సుపరిపాలనకు ఇది కీలకమైన అంశమని మంత్రి అన్నారు. అవినీతి వ్యతిరేక సవరణ బిల్లును 2013, ఆగస్టు 19న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. తర్వాత దీన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదించారు. 2016, ఫిబ్రవరి 6న రాజ్యసభకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. గతేడాది ఏప్రిల్ 29న బిల్లులోని సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. -
బాబుపై ‘అవినీతి కేసు’ పెట్టాలి
- ధ్వజమెత్తిన అంబటి రాంబాబు - ఉద్యమకారులపై పీడీ చట్టం అన్యాయం సాక్షి, హైదరాబాద్: ప్రజా ఉద్యమాలు చేసే రాజకీయ పార్టీల నేతలు, ఉద్యమకారులపైన పీడీ (ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్) చట్టం ప్రయోగించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలివ్వడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ) సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ దోచుకుంటున్నందుకు చంద్రబాబుపైనే అవినీతి నిరోధక చట్టం కేసును పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఉద్యమాలను అణచి వేయాలని చంద్రబాబు చెప్పడం చూస్తూంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంత పాలనలో ఉన్నామా! అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. భీమవరం వద్ద అక్వాఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. నేరాలను కప్పిపుచ్చుకోవడానికే.. సచివాలయాన్ని వెలగపూడికి తరలించడానికి తామెంత మాత్రం వ్యతిరేకం కాదని, అయితే అరకొర వసతుల మధ్య ‘తాత్కాలిక శాసనసభ’, ‘తాత్కాలిక సచివాలయం’కు మార్చడం సరికాదని అంబటి చెప్పారు. చంద్రబాబు తాను చేసే ప్రతి కార్యక్రమంలోనూ, ప్రతి సంతకంలోనూ అవినీతికి పాల్పడుతూ ‘వైట్ కాలర్’ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో ఉండే పోలీసు వ్యవస్థ, ఇతర వ్యవస్థలు తన పరిధిలో ఉండవని, అదే విజయవాడలో అయితే అన్ని వ్యవస్థలూ తన ఆధీనంలోనే ఉంటాయి కాబట్టే ఈ తరలింపు జరుగుతోందని చెప్పారు. దోమలతో బాబు పోటీ! ‘‘ఓ పిల్ల దోమ, తల్లి దోమతో... ‘మనపై చంద్రబాబు ఎందుకు దండయాత్ర చేస్తున్నారు?అని ప్రశ్నించింద ట. అందుకు తల్లి దోమ సమాధానమిస్తూ... ‘ప్రజలు నిద్రపోయాక మనం రక్తం తాగుతున్నాం, చంద్రబాబు ప్రజల రక్తాన్ని నిలువెల్లా పీల్చేస్తున్నారు. ఇందులో పోటీ ఉండకూడని, తానే పీల్చాలనే ఉద్దేశంతో మనపై దండయాత్ర చేస్తున్నారు’ అని చెప్పిందట..’’అంటూ పిట్టకథ చెబుతూ అంబటి ఎద్దేవా చేశారు. -
‘బాబుపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టాలి’
-
‘బాస్’ తప్పించుకోలేరు!
టీడీపీ ‘నోటుకు ఓటు’ ఉదంతంపై న్యాయ నిపుణులు కోర్టు సాక్ష్యాధారాలుగా వీడియో, ఆడియో, ఫోన్ సంభాషణలు బాగోతంలో భాగస్వాములందరిపైనా దర్యాప్తుకు అవకాశం కేసు నలుగురిపైనే పెట్టినా.. ఎందరి మీదైనా చార్జిషీట్ 120బీ, 34 సెక్షన్లలో అందుకు అవకాశం హైదరాబాద్: ఏదైనా ఘటనకు సంబంధించి తొలుత కేసు కొందరిపై మాత్రమే నమోదైనా, దర్యాప్తు ఆధారంగా కుట్ర వెనుక ఉన్న భాగస్వామ్యులందరిపైనా అభియోగాలు మోపవచ్చని సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 120బీ, సెక్షన్ 34లు ఈ వెసులుబాటును కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘రేవంత్‌రెడ్డి నోటుకు ఓటు కేసు’పై సోమవారం ‘సాక్షి’ టీవీ నిర్వహించిన చర్చలో ఆయన ఢిల్లీ నుంచి మాట్లాడారు. దర్యాప్తు అనంతరం చార్జిషీట్లో మరికొందరు వ్యక్తుల పేర్లను, సెక్షన్లను చేర్చే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. ఈ మొత్తం తంతంగాన్ని ఏసీబీ రహస్య వీడియోల్లో చిత్రీకరించిన నేపథ్యంలో, ఆ వీడియో, ఆడియోల్లో కనిపిస్తున్న, వినిపిస్తున్న వ్యక్తులందరినీ ఏసీబీ విచారిస్తుందన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ధ్రువీకరిస్తే ఈ వీడియో, ఆడియోలను సాక్ష్యాధారాల కింద కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. ‘బాసే పంపాడు’ అని సంభాషణలో రేవంత్ ప్రస్తావించిన నేపథ్యంలో ఆ వ్యక్తి ఎవరని దర్యాప్తులో తేల్చి అతనిపైనా చార్జిషీట్ వేస్తారన్నారు. ముడుపులుగా ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, మిగతా రూ.4.5 కోట్లను ఎక్కడి నుంచి సమీకరిస్తున్నారు, ఇదంతా నల్లధనమా అనే అంశాల్లో సైతం దర్యాప్తు జరిపి... అవసరమైతే మనీ ల్యాండరింగ్, 420, 409 సెక్షన్లను కూడా చార్జిషీట్లో చేర్చుతారన్నారు. వీరందరిపైనా ఆరోపణలు రుజువైతే ఏడేళ్ల దాకా కూడా శిక్ష పడుతుందన్నారు. ఏ దశలోనైనా ‘బాస్’ను కేసులో చేర్చవచ్చు ‘‘బాస్ చెప్పిన ప్రకారం ఇస్తున్నాను. మా బాస్ నన్ను ఆథరైజ్ చేశాడు. ఆయన ఇంకా ఇస్తాడు’’ అని రేవంత్ చెప్పినట్లు వీడియోల్లో వినిపిస్తోంది. ఈ వీడియోలను, ఫోన్ సంభాషణలను కోర్టులు సాక్ష్యాధారాలుగా స్వీకరిస్తాయి. ఏ దశలోనైనా ఈ కేసులో ‘బాస్’ను చేర్చవచ్చు. అయితే, ఎమ్మెల్యేలపై ఏసీబీ కేసులు చెల్లుబాటు కావని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ అంశం తేలాల్సి వుంది. ఏమైనా ముడుపులివ్వజూపడం ద్వారా ఎన్నికలను అవినీతిమయం చేశారు. రేవంత్‌తో పాటు టీడీపీ నైతిక బాధ్యత వహించాలి. రేవంత్‌పై సానుభూతి వుండదు’’ - హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు ఇతర సాక్ష్యాలు అవసరం లేదు ‘‘ఈ ఘటన తీవ్ర విస్మయానికి గురిచేసింది. రాజకీయ నగ్నత్వం బయటపడింది. అనైతిక రాజకీయాలకు ఇది పరాకాష్ట. వీడియో దృశ్యాల్లో సాక్ష్యాధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోర్టులకు ఇంకే ఇతర సాక్ష్యాలూ అవసరం లేదు’’ - శ్రీనివాస్ రెడ్డి, ‘మన తెలంగాణ’ ప్రధాన సంపాదకుడు -
సెక్షన్ 19 రాజ్యాంగబద్ధమే!
పబ్లిక్సర్వెంట్లకు రక్షణ కల్పించడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: అవినీతి కేసుల విచారణలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు అవినీతి నిరోధక చట్టంలో కల్పించిన రక్షణ సదుపాయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వ ముందస్తు అనుమతితో మాత్రమే వారిని విచారించాలని పేర్కొన్న అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని స్పష్టం చేసింది. తప్పుడు ఆరోపణల నుంచి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడం.. అవినీతికి పాల్పడినట్లు సరైన సాక్ష్యాధారాలుంటే విచారణ జరపడం.. ఈ రెండింటి మధ్య సరైన సమతౌల్యం పాటించాలని జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తప్పుడు ఆరోపణల నుంచి నిజాయితీపరులను రక్షించేందుకు ‘ముందస్తు అనుమతి’ అనేది ఒక చట్టబద్ధమైన రక్షణ అని ధర్మాసనం వివరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19ని తొలగించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా బుధవారం ధర్మాసనం పై స్పష్టీకరణ ఇచ్చింది. సెక్షన్ 19 లోని ‘ముందస్తు అనుమతి’ నిబంధన వల్ల అవినీతిపరులైన రాజకీయ నేతలపై విచారణ సాధ్యం కావడం లేదంటూ యూపీ మాజీ సీఎం మాయావతి ఉదంతాన్ని ఉటంకిస్తూ న్యాయవాది మంజూర్ అలీ ఖాన్ ఆ పిల్ దాఖలు చేశారు. సెక్షన్ 19తో సంబంధం లేకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరు రాజకీయ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులను విచారించేలా ఆదేశాలివ్వాలని ఆయన అందులో కోరారు. -
ముందస్తు అనుమతి అక్కర్లేదు
* అవినీతి అధికారుల విచారణపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ * ముందస్తు అనుమతి అంటే రాజ్యాంగ విరుద్ధం * అది ఆర్టికల్ 14 ఉల్లంఘన * డీఎస్‌పీఈఏ సెక్షన్ 6ఏ కొట్టివేత * సుప్రీం తీర్పును స్వాగతించిన సీబీఐ న్యూఢిల్లీ: అవినీతి కేసుల్లోని బ్యూరోక్రాట్ల విచారణ విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే సీబీఐ వారిని విచారించవచ్చని తేల్చి చెప్పింది. వారి విచారణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న చట్టపరమైన నిబంధన చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని మంగళవారం తేల్చి చెప్పింది. ఆ నిబంధన అవినీతిపరులకు రక్షణ కవచంలా ఉందని చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వం లోని జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖలీఫుల్లాలతో కూడిన ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినీతి కేసుల్లో జాయింట్ సెక్రటరీ ర్యాంకు, ఆపై స్థాయి అధికారులను విచారించాలంటే సంబంధిత పైస్థాయి అధికారుల అనుమతి తీసుకోవాలన్న ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (డీఎస్‌పీఈఏ)లోని సెక్షన్ 6ఏను ధర్మాసనం కొట్టివేసింది. ఆ సెక్షన్ ప్రకారం అవినీతి కేసుల్లో అధికారులను అవినీతి నిరోధక చట్టం-1988 (పీసీఏ) ప్రకారం విచారించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, ఇది రాజ్యాంగంలోని 14వ (చట్టంముందు అందరూ సమానమే) అధికరణను ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. ర్యాంకుకు సంబంధం లేకుండా అవినీతికి పాల్పడిన అధికారులందర్నీ ఒకే గూటి పక్షుల్లాగా పరిగణించి, వారందర్నీ ఒకేలా చూడాలని కోర్టు తెలిపింది. ఈ విషయంలో అధికారుల స్థాయిలను వర్గీకరించడం కష్టతరమని, అది పీసీఏ తీర్పునకు వ్యతిరేకమని ధర్మాసనం అభిప్రాయపడింది. 6ఏ ప్రకారం ముందస్తు అనుమతి అంటే పరోక్షంగా విచారణకు ఆటంకం కల్గించడమేనని చెప్పిం ది. ప్రాథమిక దర్యాప్తునకు సీబీఐని అనుమతించకపోతే ఇక విచారణ ఎలా కొనసాగుతుందని ప్రశ్నించిం ది. అందుకే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఎలాంటి మినహాయింపు ఉండదని కోర్టు పేర్కొంది. అంతకుముందు 6ఏ రాజ్యాంగ చెల్లుబాటుపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు.. స్వేచ్ఛపై ప్రశ్నలు ఉదయిస్తే, మరింత విస్తృతమైన ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పిస్తుందని చెప్పింది. ఇక కేసుల విచారణ వేగవంతం: సుప్రీం తీర్పును సీబీఐ స్వాగతించింది. ఇక కేసుల విచారణ వేగాన్ని పుంజుకుంటుందని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చెప్పారు. ఈ తీర్పు మరింత బాధ్యతను పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీనియర్ అధికారులను ప్రశ్నించే విషయంలో మరింత శ్రద్ధ పెట్టేందుకు తమ సంస్థను పటిష్టపరుస్తామని తెలిపారు. -
ప్రైవేటు వ్యక్తినీ అవినీతి నిరోధక చట్టం కింద విచారించొచ్చు
న్యూఢిల్లీ: అవినీతి నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిందితులైన ప్రభుత్వోద్యోగులు లేనప్పుడు కూడా ప్రైవేటు వ్యక్తిని ప్రత్యేక కోర్టు విచారించొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే నేరంలో భాగస్వామి అయిన ప్రైవేటు వ్యక్తిని కేవలం ప్రత్యేక కోర్టు జడ్జి విచారించాలని అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1) తెలియజేస్తోందని వివరించింది. ఈ చట్టం కింద ప్రతి నేరంలోనూ నిందితుడు ప్రభుత్వోద్యోగి అయ్యుండాల్సిన అవసరం లేదని జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ప్రత్యేక కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యేందుకు ప్రభుత్వోద్యోగి జీవించి ఉండటం తప్పనిసరేమీ కాదని...ఆ వ్యక్తి లేనప్పుడు ప్రైవేటు వ్యక్తులను కూడా అవినీతి నిరోధక, అవినీతి నిరోధకేతర నేరాల కింద విచారించొచ్చని కోర్టు తెలిపింది. ప్రభుత్వోద్యోగి మృతిచెందినందు వల్ల అతనిపై అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన నేరాలను విచారించడం కుదరదంటూ ఢిల్లీ హైకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. -
వారికి ప్రత్యేక రక్షణలెందుకు?
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు అవినీతి నిరోధక చట్టంలో ప్రత్యేక రక్షణలు కల్పించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. అది ఆ చట్ట స్ఫూర్తికే విరుద్ధమని స్పష్టం చేసింది. వారిపై దర్యాప్తును ప్రారంభించే ముందు సీబీఐ వారి పై అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధనను తప్పుపట్టింది. వారికా ప్రత్యేక రక్షణ ఎందుకని ప్రశ్నించింది. అవినీతికి సంబంధించినంత వరకు నిందితులంతా ఒకే తరగతి అని కుండబద్ధలు కొట్టింది. అది రాజ్యాంగంలోని సమాన హక్కు నిబంధనకు వ్యతిరేకమేనని బుధవారం జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది. ధర్మాసనం ప్రశ్నల పరంపరను ప్రభుత్వం తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎల్.నాగేశ్వరరావు తట్టుకోలేకపోయారు. ‘ఒకదాని వెంట మరొక ప్రశ్న దూసుకొస్తుంటే జవాబివ్వడం కష్టం. బదులిచ్చేందుకు నాకు కాస్త అవకాశమివ్వండి’ అంటూ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. బెంచ్ సంధించిన ప్రశ్నలు.. కొందరికే ఈ రక్షణ ఎందుకు? ఏ పద్ధతి ప్రకారం వర్గీకరణ చేశారు? వేరే ఉద్యోగులకు ఈ ప్రయోజనం ఎందుకు లేదు? వీరికి, వారికి ఏంటీ తేడా? విధానరూపకర్తలైన ఉన్నతాధికారులకు దర్యాప్తు నుంచి రక్షణ లభించి.. ఆ విధానాలను అమలు పరిచేవారు మాత్రం ఈ చట్టం పరిధిలోకి వస్తారా? సంయుక్త కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులు నిర్భీతితో పనిచేసేందుకు.. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలోనూ ప్రత్యేక రక్షణలు కల్పించారని, వాటి ప్రకారం అవినీతి ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించే ముందు వారి ఉన్నతాధికారి అనుమతి సీబీఐ తీసుకోవాల్సి ఉంటుందని అదనపు సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు.