
బాబుపై ‘అవినీతి కేసు’ పెట్టాలి
- ధ్వజమెత్తిన అంబటి రాంబాబు
- ఉద్యమకారులపై పీడీ చట్టం అన్యాయం
సాక్షి, హైదరాబాద్: ప్రజా ఉద్యమాలు చేసే రాజకీయ పార్టీల నేతలు, ఉద్యమకారులపైన పీడీ (ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్) చట్టం ప్రయోగించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలివ్వడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ) సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ దోచుకుంటున్నందుకు చంద్రబాబుపైనే అవినీతి నిరోధక చట్టం కేసును పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఉద్యమాలను అణచి వేయాలని చంద్రబాబు చెప్పడం చూస్తూంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంత పాలనలో ఉన్నామా! అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. భీమవరం వద్ద అక్వాఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు.
నేరాలను కప్పిపుచ్చుకోవడానికే..
సచివాలయాన్ని వెలగపూడికి తరలించడానికి తామెంత మాత్రం వ్యతిరేకం కాదని, అయితే అరకొర వసతుల మధ్య ‘తాత్కాలిక శాసనసభ’, ‘తాత్కాలిక సచివాలయం’కు మార్చడం సరికాదని అంబటి చెప్పారు. చంద్రబాబు తాను చేసే ప్రతి కార్యక్రమంలోనూ, ప్రతి సంతకంలోనూ అవినీతికి పాల్పడుతూ ‘వైట్ కాలర్’ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో ఉండే పోలీసు వ్యవస్థ, ఇతర వ్యవస్థలు తన పరిధిలో ఉండవని, అదే విజయవాడలో అయితే అన్ని వ్యవస్థలూ తన ఆధీనంలోనే ఉంటాయి కాబట్టే ఈ తరలింపు జరుగుతోందని చెప్పారు.
దోమలతో బాబు పోటీ!
‘‘ఓ పిల్ల దోమ, తల్లి దోమతో... ‘మనపై చంద్రబాబు ఎందుకు దండయాత్ర చేస్తున్నారు?అని ప్రశ్నించింద ట. అందుకు తల్లి దోమ సమాధానమిస్తూ... ‘ప్రజలు నిద్రపోయాక మనం రక్తం తాగుతున్నాం, చంద్రబాబు ప్రజల రక్తాన్ని నిలువెల్లా పీల్చేస్తున్నారు. ఇందులో పోటీ ఉండకూడని, తానే పీల్చాలనే ఉద్దేశంతో మనపై దండయాత్ర చేస్తున్నారు’ అని చెప్పిందట..’’అంటూ పిట్టకథ చెబుతూ అంబటి ఎద్దేవా చేశారు.